నవతెలంగాణ – నాచారం
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా నాచారం డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండారి లక్ష్మారెడ్డి రూ.37.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. చెరువును కేవలం నీటి వనరుగా కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఆధునిక విహార కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. సుందరీకరణలో భాగంగా ఆధునిక వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, హరితవనాలు, సిట్టింగ్ ఏరియాలు, అలంకార లైటింగ్, పిల్లల ఆట స్థలాలు, ఫుడ్ కోర్టులు మరియు పర్యావరణహిత సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చెరువు పరిసర ప్రాంతం నగరవాసులకు ప్రధాన ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని ఆయన అన్నారు. చెరువు పరిరక్షణతో పాటు వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, భూగర్భ జలాల సంరక్షణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత హెచ్‌ఎంటీ నగర్ ప్రాంత రూపురేఖలు మారిపోవడంతో పాటు స్థానిక ఆస్తుల విలువలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఆయన, ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జెన్ శేఖర్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమైనందుకు ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.



