నవతెలంగాణ-ఆలేరు టౌను
చేయూత పెన్షన్ పథకానికి నూతన దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నట్లు, మున్సిపల్ చైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ తెలిపారు. ఆలేరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో నవతెలంగాణతో శుక్రవారం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భాగంగా, ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారుల నుంచి నూతన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు చెప్పారు.
ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత అందించే ఉద్దేశంతో పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు పెన్షన్ పొందని అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల ఆగస్టు 31వ తేదీలోగా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించాలని ఆమె కోరారు. అర్హత కలిగిన వారు ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
వితంతు పెన్షన్‌కు నూతన అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, భర్త మరణ ధృవపత్రంతో పాటు భర్త ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్, ఒక ఫొటో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.దివ్యాంగుల పెన్షన్‌కు నూతన అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఫోన్ నంబర్, ఒక ఫొటో సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒంటరి మహిళల పెన్షన్‌కు నూతన అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, సంబంధిత ధృవపత్రం, కుల ధృవపత్రం జిరాక్స్, ఆధార్ ధృవపత్రం జిరాక్స్, ఫోన్ నంబర్, ఒక ఫొటో తదితర అవసరమైన పత్రాలను కార్యాలయంలో అందజేయాలన్నారు.



