మో”డల్” పథకం

– ఇందిరమ్మ నమూనా ఆలస్యం
– ఇంకా ఎంపిక కానీ లబ్ధిదారులు
– నాలుగు నమునాల్లో ఏదో ఒకటికే అవకాశం
– ఇష్టం వచ్చినట్టు కట్టుకునేందుకు వీలులేదు
– పిల్లర్లు, భీమ్‌లు లేకుండా పలు నమూనాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇందిరమ్మ ఇళ్ల పథకం మూడు అడుగుల ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతోంది. ఇంకా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. మండలానికి ఒక గ్రామంలో మాత్రమే లబ్ధిదారుల ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకా వారికి కూడా ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వలేదు. ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఇంకా మార్గదర్శకాలే సిద్ధం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకానికి పిల్లర్లు, భీమ్‌లు లేకుండా పలు నమూనాలను సిద్ధం చేసింది. వాటిని అమలు చేయాలని చూస్తోంది. నాలుగు నమునాల్లో ఏదో ఒకటి లబ్ధిదారులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం లేదు. అయినా ఇంకా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో మీనమేషాలు లెక్కిస్తుంది. ఇదీలా ఉంటే మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతుంది. స్థానికల ఎమ్మెల్యేల చేతుల మీదుగా భూమి పూజ చేశారు. కానీ ఇంకా నిర్మాణం చేపట్టడంలో అధికారులు నిర్లక్షం వహిస్తున్నారు.

జిల్లాకు 28 వేల ఇండ్లు 
రంగారెడ్డి జిల్లాకు మొదటి విడతలో 28 వేల ఇండ్లను మంజూరు చేసింది. జిల్లాలో ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్ లింగంపల్లి,  షాద్ నగర్ నియోజకవర్గాలున్నాయి. ఈ  8 నియోజకవర్గాలకు గాను నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసింది. ఈ ఇండ్లను ప్రతి నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు స్థానిక ఎమ్మెల్యేల కన్నుసన్నల్లోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తారు. అందుకు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
పేదల ఎదురు చూపులు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభలు నిర్వహించింది. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో అధికారులు లబ్ధిదారుల ఎపికను పూర్తి చేయాలని సంకల్పించింది. కానీ గ్రామాల్లో కేవలం పదుల సంఖ్యలో వచ్చే ఇందిరమ్మ ఇండ్ల కోసం వందల మంది పోటీపడే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వానికి లబ్ధిదారుల తాకిడి ఎక్కువై వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశాలున్నాయి. దాంతో గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేయకుండానే తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించారు. కానీ ప్రభుత్వం మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో ఇందిరమైన లబ్ధిదారులను గుర్తించింది. వారి తాత్కాలిక ప్రొసిడింగ్స్ అందజేసినప్పటికీ ఇంకా ఇంటి నిర్మాణం కోసం అనుమతులు మాత్రం లభించని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారులు ఎంపిక కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా? రాదా? అన్న అనుమానాల వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చు తగ్గించేందుకు నాలుగు నమూనాలు..
ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఐరన్‌, సిమెంట్‌, కూలీల ఖర్చు భారీగా పెరిగిపోయింది. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలంటే కనీసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కేవలం రూ .5 లక్షలు మాత్రమే ఇస్తామంటుంది. నిర్మాణ ఖర్చు తగ్గించేలా నాలుగు మోడల్స్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం కసరత్తు చేపట్టింది. ఐరన్‌, సిమెంట్‌ ఖర్చు తగ్గించేలా నమూనాలను రూపొందిస్తోంది. లబ్ధిదారుడు ఈ నాలుగు నమూనాల్లోనే ఏదైనా ఒకదానిని ఎంచుకునే అవకాశం కల్పించింది.
మండలానికో మో”డల్‌” ఇల్లు..
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు మండలాని ఒక మోడల్‌ ఇంటి నిర్మాణం చేపట్టింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి వివిధ శాఖ కార్యాలయాల ప్రాంగణంలో ఈ నమూనా ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం నిర్మిస్తున్న పిల్లర్లు, భీమ్‌లతో కూడిన పద్ధతిలో కాకుండా ఖర్చు తక్కువ అయ్యేలా ఇతర పద్ధతులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికి ఒకటి చొప్పున వేర్వేరు పద్ధతుల్లో మోడల్‌ ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తోంది. కానీ ఈ మోడల్ ఇంటి నిర్మాణం ముందుకు సాగడం లేదు. నిర్మాణం కోసం స్థానిక శాసనసభ్యుల చేతులు మీదుగా భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా 45 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యేలు హౌసింగ్ అధికారులు ఆదేశించినా ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు.
ఇవిగో నమూనాలు..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించే విధంగా ప్రభుత్వం పలు పద్ధతులపై అధికారులతో సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా నాలుగు పద్ధతులను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. వీటిలో ఏదో ఒక నమూనా ప్రకారం లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.
పిల్లర్‌ రూఫింగ్‌ నిర్మాణం..
గోడలపై ఆర్‌సీసీ రాఫ్టర్లు అమర్చుతారు. వాటి మీద పూర్వకాలం తరహాలో బెంగళూరు పెంకులు పరుస్తారు. పెంకుల మీద రెండున్నర అంగుళాల మందంతో శ్లాబ్‌ వేస్తారు. ఈ విధానంతో ఇటుక, స్టీల్‌ వ్యయం తగ్గించొచ్చు.
షార్ట్‌ కాలమ్‌ ఇన్‌స్ట్రక్షన్‌..
ఇండ్ల నిర్మాణంలో ఐరన్‌ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చును తగ్గించేందుకు ఈ డిజైన్‌ పద్ధతి ఒకటి. పునాది నిర్మాణం వరకు మాత్రమే కాలమ్స్‌ ఉంటాయి. పైన ప్లింథ్‌ భీమ్స్‌ ఉంటాయి. మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీట్‌ గోడ ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లలో పై అంతస్తులు ఉండే అవకాశం లేనందున ఈ నమూనా బాగుంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
షియర్‌ వాల్‌ పద్ధతి..
ఈ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్‌తో సిద్ధం చేస్తారు. పునాదులపై రంద్రాన్ని డ్రిల్‌ చేసి ర్యాడ్స్‌తో ఆ గోడలను అనుసంధానం చేస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీల్‌ వ్యయం ఉండదు.
స్టోన్‌ రూఫింగ్‌ విధానం..
కాంక్రీట్‌ గోడలు నిర్మించిన తర్వాత.. పూర్వ కాలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నట్టు దూలాల తరహా పైన ఆర్‌సీసీ రాఫ్టర్స్‌ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్‌ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్‌ పొర వేస్తారు. షాబాద్‌ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
నిర్మాణంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్నాం. పునాది తీశాం.. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. లబ్ధిదారులకు నిర్మాణం, వ్యయం తగ్గింపుపై అవగాహన కోసం ఈ మోడల్‌ ఇల్లు ఉపయోగ పడుతుంది. ఉంటాయి.
– రామచంద్రయ్య, హౌజింగ్‌, ఏఈ, ఇబ్రహీంపట్నం.
Spread the love