మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు పేర్కొంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు దిగువ స్థాయి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలోని కొన్ని భాగాల వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Spread the love