ఆధునిక జీవనదర్పణం

నిత్యనూతన కవి కేతిరెడ్డి యాకూబ్‌ రెడ్డి రెండు కవితాసంపుటులను వెలువరించాడు. మొదటిది కొన్ని కలలు- కొన్ని కన్నీళ్ళు- ఒక సునామి, రెండవది రెండు ప్రేమలవాన. మొదటి కవితా సంపుటిలో పల్లె, ప్రకతి, రైతు కన్నీళ్ళు, మార్కెటీకరణ, తెలంగాణ అవసరాన్ని చెప్పే కవితలు ఉన్నాయి. రెండవకవితాసంపుటిలో జీవితాన్ని, జీవితానుభవాలను, జీవనతాత్వికతను ఎక్కువపాళ్ళలో కవిత్వం చేశాడు. ఆధునిక కవితాధోరణి అయినా సర్రియలిజం కవితలు కూడా ఇందులో రాశాడు.
కుటుంబ వారసత్వానుసారంగా వచ్చే ప్రేమ ఎవరికైనా కొడుకు, మనుమలే కదా. అందరికీ అది సాధారణం. కవి కాబట్టి, అందులోనూ ప్రేమమయజీవిహొ కాబట్టి ఈ కవికిది ప్రత్యేకం. ఆ సారాంశాన్నే కవి కవిత్వ పరిభాషలో ‘రెండు ప్రేమలవాన’ అన్నాడు. ఇవాల్టికీ ఈ ప్రేమ అవసరం. ఏ అభివద్ధి అయినా కుటుంబం నుండే మొదలవ్వాలి. కుటుంబాన్ని నిలబెడితే దేన్నయినా నిలబెట్టగలరు. అందుకే ఈ కవి ఈ ప్రేమవానలో తడుస్తూనే మనల్ని తడవమంటూ ప్రేమ పంచుతున్నాడు. కవిత్వం రాయటానికి ఇంతకన్నా సబ్జెక్టు ఏముంటది. రెండవ పుస్తకం తేవడానికి కాస్త ఎక్కువ కాలమే పట్టినా నూతనాభివ్యక్తులతో కవిత్వమై వచ్చాడు. ఈ కాలమ్‌లో ఆ ‘రెండు ప్రేమలవానలోని ‘అంతా మామూలే’హొ కవితను పరిశీలిద్దాం.
ఈ రోజుల్లో ఆత్మీయతలు కరువు కావడానికి మారుతున్న జీవనవిధానం ఓ కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఫోన్లు ఎత్తి ఎదుటి వారితో మాట్లాడడానికి సమయం ఉండదు. బతుకు పోరాటంలో అతను మునిగి తేలుతుంటాడు. ఇక్కడి వరకు పర్లేదు. ఆత్మీయుల చావు విషయంలో ఇది తగదు కదా. ఆ అంశాన్ని కవితలోకి పట్టుకొచ్చి ఆలోచింపచేస్తున్నాడు ఈ కవి. శీర్షికలోనే మనుషుల స్వభావాన్ని తెలియజేస్తూ సాధారణంగా ఓ వాక్యాన్ని ప్రయోగించి సులువుగా అర్థం చేయించాడు. ఒకప్పుడు చనిపోవటం అంటే ఎంతో బాధను వ్యక్తపరిచి కొంతకాలం వరకు మనుషులు కాలేకపోయేవారు. మారుతున్న కాలంతో పాటు మనుషుల్లో కూడా కన్నీరు తగ్గిపోయింది. ఇక్కడ మరికొన్ని కారణాలు లేకపోలేదు. ఒకటేమో జీవితమంటే ఇంతే కదా అనే తాత్వికతలోకి నెట్టివేయబడటం. మరొకటి తీరికలేని పని ఒత్తిడి వలన పట్టించుకోక పోవడం. ఏది ఏమయినా కొంత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరమయితే ఉంది. దాన్ని ఎరుక పరుస్తూ చురక పెడుతున్నాడు ఈ కవి.
ఎత్తుగడలో కత్రిమంగా ఏడుస్తున్న వ్యక్తుల విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏడ్వటం కూడా ఓ కళనే. అది అందరికీ రాదు. కొంతమందికి బాధ లోపల ఉంటుంది. పైకి కన్నీటి చుక్క పెకలదు. కొంతమంది గట్టిగా అరుస్తుంటారు. చుక్కనీరు కారదు. ఏడుపు ప్రేమ సంబంధమైన విషయం. ఏడుపు ఓ మొహమాటంగా మారిందని, కర్చీఫ్‌లను అడ్డుపెట్టి దుఃఖమని భ్రమ కల్పించేహొస్థితిని నేటికాలంలో చూస్తుంటామని కవి వాపోతున్నాడు.
మానవ సంబంధాలను ముందు పరుస్తూ ప్రాణమున్న జీవి అయితే ఇంటికెళితే బాధలు చెప్పుకొని పైసో, పరకో అడుగుతాడు. కిస్తీలు ఏమన్న ఉంటే పైసలు సర్దమని అడుగుతాడు. శవం కాబట్టి నీకేం పర్లేదు అని కవి వ్యంగ్యాత్మక టోన్‌తో భరోసా ఇస్తున్నాడు.
చావు, పెళ్ళి దాదాపు ఒకలాగే మారిపోయాయి. పదిరోజుల మద్యం పారకం విషయం ఇక్కడ వివరణతో రాయటం సబబు కాదు. బంధువులు కలవటాలు, పరిచయాలు అన్ని అక్కడే. శవముందన్న విషయం సెకండరీ.
అందుకే చావు ఇంటికి కూడా అలా కాలక్షేపం కోసం వెళ్ళిరా అని కవి సుతిమెత్తగా మందలిస్తున్నాడు.
చావుకు వెళ్ళే సందర్భంలో కూడా ఎన్నో ఆలోచనలు. సమయం ఆదా చేసుకోవాలని ఒకరు, ఉద్యోగాలలో చిక్కుకుపోయి మరికొందరు. దూరం నుండి వస్తున్నవాళ్ళు ఇంకొంతమంది. శవం ఎప్పుడు బయలుదేరుతుందో ఫోన్‌ చేసి వచ్చేవాళ్ళు కొందరు. ఇవన్నీ కవిని ఉక్కిరిబిక్కిరి చేసినట్టున్నాయి. అందుకే ఈ వాక్యాలు రాయగలిగాడు. ఆధునిక జీవితంతో ఎంత మమేకమైతే ఈ వాక్యాలు రాయగలుగుతాడు.
”కలతెందుకు కంగారెందుకు/ పాడె మీది శవం/ మిస్డ్‌ కాల్‌ ఇచ్చే బయలుదేరుతుంది”
చివరికి చితిలో పుల్లను వేసి అందరు ఇంటిదారి పడతారు. అంతటితో ఆ బంధానికింత ఋణం తీర్చుకున్నట్టు భావిస్తారు. అలాంటి పుల్ల విషయం కూడా వదిలి పెట్టకుండా పూసగుచ్చినట్టు నేటికాలపు మనుషుల మనస్తత్వాలను, బంధాలను వివరిస్తూ చిక్కని కవిత్వమున్న కవితను అందించాడు. ఈ పుస్తకం కొని చదివాక బాగుందనిపిస్తే మీరు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి వదిలేయండి. తాను కాల్‌ చేసి మీతో మాట్లాడేదాకా వదిలిపెట్టడు.
అంతా మామూలే
శవం మీద
ఛిద్రమౌతున్న కన్నీటి పొర
కళ్ళద్దాల వెనక
కర్చీఫ్‌ మొహమాటపు కదలిక
ఫరవాలేదు-
శవం జాగరణ కోరదు
ఓదార్పు ఆశించదు
మాట సర్దమనో మూట సర్దమనో
ప్రాధేయ పడదు
అదో ఆటవిడుపు
అ…లా…వెళ్ళిరా
పాత బంధువులూ మిత్రులూ
కొత్తగా పరిచయమవుతారు
కలతెందుకు కంగారెందుకు
పాడె మీది శవం
మిస్ట్‌ కాల్‌ ఇచ్చే బయలుదేరుతుంది
వెళ్ళేటప్పుడు ఒక
ఎండుపుల్ల మరచిపోకు
విచారం వద్దు
ఇదేం అపచారమూ కాదు
చావులకు కుదించబడ్డ బంధాల్లో
ఎవరూ ఏమీ అనుకోరు
– కేతిరెడ్డి యాకూబ్‌ రెడ్డి
– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551

Spread the love