మనసే ఒక లోచనం

మనసే ఒక లోచనంమనలో ఉండి మనలను నడిపించే మనసే మన తొలిగురువు. మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ… పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ’లోచనం’ చేసేదే మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే అంతరాళమే మనసు. ప్రతి మనిషి భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.

మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. మనసు లేనిదే మనిషి లేడు. మన మనసే మనకు మార్గం చూపే దీపం. పుస్తకాల నుంచి మనం పొందేది విజ్ఞానం అయితే మన మనసుతో మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. మన బుద్ధికి, మన మనసుకి నిరంతరం సంఘర్షణ జరుగుతుంటుంది. మనం ఇతరుల కష్టాల్ని అర్ధం చేసుకోవాలంటే వారు చెప్పేవి మనసుతో వినాలి. మనసు బాధ పడుతున్నప్పుడు ఇంకో తోడు కావాలి. మన మనసులోని భావాల్ని అర్ధం చేసుకునే మనసు కావాలి. మనసుపై అనేక పాటలు రాసి ఆత్రేయ ‘మనసుకవి’ అని పేరు తెచ్చుకున్నారు. ఈ మనసు ఒక భోషాణం లాంటిది.
మనలో ఉండి మనలను నడిపించే మనసే మన తొలిగురువు. మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ… పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ’లోచనం’ చేసేదే మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే అంతరాళమే మనసు. ప్రతి మనిషి భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఆ సమయంలో ఎవరి సలహాను మనసు పరిగణనకు తీసుకోదు. అయితే ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యకు సంబంధించినదై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గతంలో చేసిన పనుల గురించి కావచ్చు.
ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కానీ, కొన్ని కోరికల గురించి కానీ జరుగుతుంటోంది. ఈ ఆలోచనా ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకదు. అప్పుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితులైన వారి సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా మన చుట్టూ జరిగేదే.
ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని ‘గురువు’ అంటారు. కేవలం మనుషులే కాదు ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలిస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా మనకు గురువే. కొన్ని సందర్భాల్లో మన మనసు చెప్పింది వినకుండా ప్రలోభాలకు లోనవుతాం. చుట్టూ ఉన్న పరిస్థితులు మనసుని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికలే చూడండీ… ఐదేండ్లు మనల్ని పాలించే నాయకులను ఎన్నుకోవల్సినది మనమే కదా! మనల్ని పాలించే సరైన వ్యక్తి ఎవరో మనం మన మనసుతో ఆలోచించాలి. ప్రలోభాలకు గురైతే మరో ఐదేండ్లు తిప్పలు పడాల్సిందే. కనుక మన మనసును కూడా మన గురువుగానే పరిగణించాలి. మనసు కూడా ఓ లోచనమే అని గుర్తించాలి. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే, మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటే మనం మనంగా బతకలగుతాం.

Spread the love