దార్శనిక శిఖరం…

dr br ambedkarభారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు అది. వేలయేండ్ల అణిచివేతపై మడమతిప్పని పోరాటం సలిపిన యోధుడు అతడు. అంటరానివాడని అవమానించిన జాతికి దిక్కుమొక్కు అతడే అయ్యాడు. ప్రపంచం గర్వించదగిన మేధావిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తాను పుట్టిన నేలను నిలిపినవాడు. కోట్లాదిమంది గుండెల్లో కొలువున్న జ్ఞానశిఖరం అతడే. ఔను, ఆ స్ఫూర్తిప్రదాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహాశయుడే. ఏప్రిల్‌ 14 భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా ఆ దార్శనికుని అజరామరమైన కషిపై రేఖామాత్రపు పరిచయ ప్రయత్నం…
తనపట్ల వివక్షతను, అసహనాన్ని ప్రదర్శించిన జాతిని క్షమించిన అభినవ బుద్ధుడు. ఈ దేశం బాగుండాలని తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనను నమ్ముకున్న జాతులకు ఒక దిశానిర్దేశం చేసిన వేగుచుక్క. ‘ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎట్లా జీవించామన్నదే ముఖ్యమని’ తలిచిన తాత్వికుడు. ఇవాళ ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈ దేశానికి రక్షణ కవచం. హక్కుల ముఖం చూడని కోట్లాదిమందిని మనుషులుగా తలెత్తుకునేలా చేసింది అతని కలమే. అతడే ఫాదర్‌ ఆఫ్‌ మోడరన్‌ ఇండియాగా కొలంబియా విశ్వవిద్యాలయం చేత కొనియాడబడిన దార్శనికుడు బాబా సాహెబ్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌.
The pinnacle of vision...that is himఅవమానాలకు ఎదురీది…
అది బ్రిటీష్‌ ఇండియా. అప్పటికి అగ్రకులాలకు తప్ప నిమ్న కులస్తులకు కనీస హక్కులు లేని కాలం. చాతుర్వర్ణ కులవ్యవస్థ ఇంకా బుసలు కొడుతూ ఊరికి దూరంగా వెలివాడలను నిలిపిన తరుణం. అలాంటి రోజుల్లో పుట్టిన ఒక దళితుడు చదవడం కాదుగదా కనీసం స్వేచ్ఛగా జీవించగలడా? ఆత్మగౌరవంతో అడుగు వేయగలడా? లేదు. నిత్యం కులం చేత అవమానించబడుతూ ఛీత్కారాల మధ్య మాత్రమే బతకాల్సిన రోజులవి. ఆ సమయంలో 1891 ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌లోని రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో జన్మించాడు భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌. గంపెడు సంతానం కలిగిన ఆ కుటుంబంలో అంబేద్కర్‌ కడుపేదరికాన్ని అనుభవించాడు. తండ్రి బ్రిటీష్‌ సైన్యంలో సుబేదారుగా పనిచేస్తున్నా కనీస అవసరాలకు కష్టమైన కుటుంబం. పైగా పంచములంటే, అంటరాని వారంటే ఆ రోజుల్లో కులసర్పం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. దీంతో బాబా సాహెబ్‌ సైతం బాల్యం నుండే అనేక అవమానాలు ఎదుర్కోక తప్పలేదు. బడిలో చివరన కూర్చోబెట్టడం, అగ్రవర్ణ పిల్లలు కసురుకుంటే గురువులే తరగతి బయటపెట్టి చదువు చెప్పడం వంటి ఎన్నో అవమానాలు అంబేద్కర్‌ బాల్యంలోనే అనుభవించాడు. కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్లు సైతం ఇవ్వని సమాజం ఆనాడు ఉంది. అయినా సరే అంబేద్కర్‌ మాత్రం ఏనాడూ ధైర్యాన్ని కోల్పోయింది లేదు. బాబా సాహెబ్‌ పుట్టిన రోజు కానుకగా తన మేనమామ బహుమతిగా ఇచ్చిన గౌతమబుద్దుని జీవిత చరిత్ర పుస్తకం తనను ఎంతో ప్రభావితం చేసింది.
చదువే లోకంగా…
ఈ అంటరాని లోకంలో అట్టడుగు వర్గాలకు చదువు తప్ప మరో ఆస్తి, ఆయుధం లేదు. చదువుకుంటేనే బాగుపడతాం. ఈ మనువాద వ్యవస్థను జ్ఞానంతోనే గెలవాలనే పట్టుదల క్రమంగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌లో పెరుగుతూ వచ్చింది. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును మాత్రం వదిలిపెట్టింది లేదు. ఉన్నత చదువులు చదివి జ్ఞానవంతుడై నిలబడితేనే ఈ సమాజం మనకు విలువ ఇస్తుందని బలంగా నమ్మాడు బాబా సాహెబ్‌. అట్లా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌తో పాటు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో సైతం చదువుకున్నాడు. అది కూడా కేవలం ఒక ఉద్యోగం కోసమో, భద్రమైన జీవితం కోసమో కాదు. ఆయన చదివిన చదువంతా భారత సమాజానికి ఉపయోగపడే చదువులే చదివాడు.
ముఖ్యంగా ఆయన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ‘ది ప్రాబ్లెం ఆఫ్‌ రూపీ’అనే అంశంపై రాసిన గ్రంథం అత్యంత విలువైనది. అదే మన దేశంలో ఆర్‌బిఐ వంటి జాతీయ బ్యాంకులు నెలకొల్పడానికి ప్రధాన ఆధారంగా నిలిచింది. అట్లా అష్టకష్టాలు పడి చదివిన చదువును, జ్ఞానాన్ని ఈ దేశ అభ్యున్నతి కోసం వెచ్చించిన ఆదర్శనీయుడు బాబా సాహెబ్‌. విదేశాల్లో చదువుకోవడానికి తన ఆర్థిక స్తోమత సరిపోని సమయంలో బరోడా మహారాజ్‌ శాయాజీరావ్‌ గైక్వాడ్‌ 1912లో అందించిన ఆర్థిక సహాయం బాబా సాహెబ్‌ చదువు ఆగిపోకుండా కాపాడగలిగింది. అలాంటి పెద్దపెద్ద చదువులు అంబేద్కర్‌ చదవడం వల్లనే 545 సంస్థానాలుగా ఉన్న మన దేశాన్ని ఏకతాటి మీదికి తెచ్చేందుకు ఆయన రచించిన భారత రాజ్యాంగమే ఉపయోగపడింది. అట్లా చదువుకు, జ్ఞానానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అదే స్ఫూర్తి స్వాతంత్య్రానంతర భారత దేశంలో కోట్లాదిమంది అట్టడుగు కులాల ప్రజలు చదువుల బాట పట్టేందుకు దారులు వేసింది. ఆయన అందించిన స్ఫూర్తితోనే పలు తరాలు విద్యావంతులు కాగలిగారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో 50వేలకు పైగా పుస్తకాలు చదివిన ఆరుగురు మేధావుల్లో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కూడా ఒకరు. అలాగే ప్రపంచ ప్రసిద్ధి పొందిన లండన్‌ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివిన ఒకరిద్దరిలో అంబేద్కర్‌ కూడా ఒకరు. అట్లా ఆరులక్షల పేజీలు చదివి, లక్ష పేజీల సాహిత్యాన్ని సష్టించడం బాబా సాహెబ్‌కు ఉన్న జ్ఞానతష్ణకు నిదర్శనమని చెప్పవచ్చు.
రాజ్యాంగ నిర్మాత
భారత దేశానికి స్వతంత్య్రం లభించిన తరువాత ఈ దేశాన్ని పాలించడానికి ఒక సమగ్ర రాజ్యాంగం కావాలని రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. అలా ఒక బందం విదేశాల్లో ఉన్న మేధావులను సైతం సంప్రదించింది. అప్పుడు ఆ విదేశీ మేధావులు నెహ్రూ అండ్‌ టీమ్‌కు చెప్పిన మాట ‘మీ దేశంలోనే ప్రపంచ జ్ఞానాన్ని చదువుకున్న అంబేద్కర్‌ వంటి స్కాలర్‌ ఉండగా మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారని’ ప్రశ్నించారు. దీంతో రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్‌ కమిటీకి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ఎన్నుకున్నారు. ఇవాళ భారత రాజ్యాంగానికి ఇంతటి విలువ, గౌరవం కలుగడానికి బాబా సాహెబ్‌ అంబేద్కరే కారణం. డ్రాఫ్టింగ్‌ కమిటీలో కొంతమంది సభ్యులు ఉన్నప్పటికి వారంతా అగ్రకులాలకు చెందిన వారు కావడంతో ఒక అంటరాని వాడు డ్రాఫ్టింట్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటే మేమేందుకు రాజ్యాంగం కోసం పని చేయాలని కక్షగట్టారు. రాజ్యాంగ రచనను ముందుకు పోకుండా ఆరోగ్యాలు బాగోలేవని అబద్దాలు చెప్పారు. అయినా సరే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మాత్రం అకుంఠిత దీక్షతో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో రాజ్యాంగం మొదటి డ్రాఫ్ట్‌ను తయారు చేశారు. ఇందుకోసం ఆయన తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోలేదు. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. భారత దేశ సామాజిక, భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు సరిపోయే రాజ్యాంగాన్ని బాబాసాహెబ్‌ రూపొందించారు. ఈ రాజ్యాంగం దేశంలో సమూల మార్పులకు కారణమైంది.
బ్రిటీష్‌ ఇండియా పాలనలో ఎన్నికలు జరిగితే అందులో ఓటు హక్కు కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే ఉండేది. దీనిని మార్చుతూ అంబేద్కర్‌ కుల, మత, ప్రాంత, ఆర్థిక, పేద భేదాలకు అతీతంగా వయోజనుడైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కును కల్పించాడు. ‘ఒక ఓటు ఒకే విలువ’ అనే చారిత్రాత్మక నినాదాన్ని అమలు చేశారు. ఇందుకోసం 1932లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో అటు బ్రిటీష్‌ వారితో పాటు ఇటు గాంధీ వంటి నేతలతో సైతం అంబేద్కర్‌ ఎంతో పోరాడారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలన్న బాబా సాహెబ్‌ తీర్మానాన్ని గాంధీ తప్పుబట్టారు. నిరసనగా ఎర్రవాడ జైలులో ఆమరణ దీక్షకు దిగారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకత్వం అంతా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ఒత్తిడి చేశారు. గాంధీ ప్రాణాలకు ఏమైనా అయితే అది మీ మీదికే వస్తుందంటూ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడ్డారు. అట్లా దళితులకు తాము మాత్రమే ఓటేసుకునే నియోజకవర్గాలు లేకుండా చేసిన ఒప్పందమే ‘పూనా ఒప్పందం’. బాబా సాహెబ్‌ కలలుగన్న దళిత రాజ్యాధికారాన్ని గాంధీ అండ్‌ కంపెనీ ఆ విధంగా ఆరోజు అడ్డుకోగలిగారు. అయినా సరే బాబా సాహెబ్‌ మాత్రం తన ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎక్కడా వదులుకున్నదే లేదు. రాజ్యాంగ రచన ద్వారా ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేశారు. లేకుంటే ఈ దేశం ముక్కలు చెక్కలై అగ్రవర్ణ ధనికుల చేతిలో తోలుబొమ్మగా మారేది. అలాంటి పటిష్ట రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌.
హక్కుల ప్రదాత
అంబేద్కర్‌ భారత రాజ్యాంగం రాయడానికంటే ముందు మనువాదమే రాజ్యాంగంగా ఈ దేశంలో అమలులో ఉండేది. ఓటు హక్కు కేవలం అగ్రవర్ణాలకే ఉండేది. అలాంటి సమయంలో అందరికీ హక్కు ఉండాలన్న ప్రతిపాదనను రాజ్యాంగ పరిషత్‌లో బాబా సాహెబ్‌ తీసుకొచ్చారు. అది నచ్చని జాతీయ నాయకులు అనేకమంది ఆనాడు సభలో ఉన్నారు. ముఖ్యంగా సర్దార్‌ వల్లభారు పటేల్‌, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి నేతలు ‘పొలం దున్నేవాడికి ఓటెందుకు… వారేమైనా పార్లమెంట్‌కు వచ్చి దున్నుతారా?’ అంటూ ఎద్దేవ చేశారు. అయినా సరే బాబా సాహెబ్‌ మాత్రం ఈ దేశంలో ఉన్న ప్రజలకు పాలకులను ఎన్నుకునే అవకాశం ఉండాలి, అప్పుడే అది ప్రజాస్వామ్య దేశం అవుతుంది. లేకుంటే మళ్లీ రాజరిక పాలనే కొనసాగుతుందని గట్టిగా వాదించాడు. అట్లా బాబా సాహెబ్‌ చేసిన అద్వితీయమైన కషి వల్లనే ఇవాళ సామాన్య ప్రజలు సైతం ధైర్యంగా తమకు నచ్చిన పాలకుడిని ఎన్నుకుంటున్నారు.
అంబేద్కర్‌ అంటే చాలామంది అగ్రవర్ణాలతో పాటు విద్యావంతులు సైతం ఆయన కేవలం దళిత నాయకుడనే ప్రచారం చేస్తారు. మరి ఈ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలని కొట్లాడిన విషయాన్ని మాత్రం విస్మరిస్తారు. అంతే కాదు అంబేద్కర్‌ కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడే ఈ దేశంలో ఎనిమిదిగంటల పని విధానం ఉండాలని పోరాడి సాధించారు. అంతే కాదు ప్రతీ ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు, ఆస్తి కూడబెట్టుకునే హక్కు, రాజ్యాన్ని పాలించే హక్కు ఉండాలని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచాడు. అంతకు ముందు శూద్రులకు, అతిశూద్రులకు ఈ హక్కులేవి లేనే లేవు. అలాంటి దారుణమైన పరిస్థితుల మీద ఒకే ఒక్క కలంపోటుతో తిరగబడి తలరాతలు మార్చిన మహాశయుడు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌. ఇట్లా ఈ దేశ ప్రజలందరికీ హక్కులు ప్రసాదించిన బాబా సాహెబ్‌ను, ఆ హక్కులు పొందుతున్నవారు ఏనాడో విస్మరించారు. చరిత్రను తెలుసుకోకపోవడం వల్ల అంబేద్కర్‌ను కేవలం దళితులకు పరిమితం చేసి కుదించి మొక్కుబడిగా గౌరవిస్తున్నారు తప్ప ఆయన ఈ దేశానికి చేసిన మేలును మరిచిపోతున్నారు.
వజ్ర సంకల్ప వ్యక్తిత్వం!
మహారాష్ట్రలోని చైత్యభూమిలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ దర్జాగా ఒక కుర్చీలో కూర్చున్న విగ్రహం ఉంది. దాని మీద ‘నా జీవిత సంఘర్షణే నా సందేశం’ అనే కొటేషన్‌ ఉంటుంది. ఆ ఒక్కమాట చాలు అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి. ఆయన చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఈ దేశంలో నోరులేని కోట్లాదిమంది తరుపున ఒకే ఒక్కడై గర్జించాడు. తనను ఎందరు ఎన్ని తీర్ల ఇబ్బందుల పాలు చేసినా, ఎంతగా అవమానించినా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ పంటి బిగువన అన్నింటినీ భరించాడు. తన వల్ల అయ్యే ప్రతీ పనిని చేసుకుంటూ వెళ్లాడు. అంతేతప్ప ఏనాడు రాజీ పడ్డదే లేదు. అలాంటి లొంగని తనం, దఢమైన వ్యక్తిత్వం ఆయన సొంతం.
నీకు నీ ప్రయోజనాలు ముఖ్యమా? నీ దేశ ప్రయోజనాలు ముఖ్యమా అంటే ఆయన నిస్సందేహంగా దేశప్రయోజనాల వైపే నిలబడ్డాడు. అట్లా ఈ దేశం కోసం ఎంతో చేసినా సరే సంకుచిత మెదళ్ల పరదాలు బాబా సాహెబ్‌ విశాల గుణాన్ని చూడలేకపోతున్నాయి. కష్టకాలాల్లో కంగిపోవడం, అవకాశాల కోసం అర్రులు చాచడం బాబా సాహెబ్‌కు తెలియవు. సమయం వచ్చినప్పుడు జాతి ప్రయోజనాల వైపు నిలబడడం, అనుకున్నది సాధించేందుకు అహరహం శ్రమించడం మాత్రమే ఆయన నమ్ముకున్నాడు. అంతేతప్ప పదవులు, అధికార దర్పం, భద్రజీవితం వంటి వాటికి లొంగిపోలేదు. ముఖ్యంగా నైతిక విలువల విషయంలో ఒక జీవన తాత్వికతను చాటి చెప్పేలా జీవించాడు. స్వార్థం అన్నమాటను కించిత్‌ కూడా దరిచేరనివ్వకుండా ప్రజాసంక్షేమమే పరమ ధ్యేయంగా జీవించాడు. అందువల్లనే ఆయన ఇవాళ కోట్లాదిమంది ప్రజలకు స్ఫూర్తిగా మారాడు. పాత విలువల స్థానంలో ప్రత్యామ్నాయ విలువలను ప్రభోధించాడు. బోధించడమే కాదు ఆచరించి చూపించాడు.
చారిత్రక పోరాటాల స్ఫూర్తి ప్రదాత!
బాబా సాహెబ్‌ తన జీవిత కాలమంతా కులవ్యవస్థ మీద పోరాడుతూనే జీవించాడు. కులాన్ని నిర్మూలిస్తే తప్ప ఈ దేశం బాగుపడదనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయన ఎక్కడున్నా పేదల విముక్తే ధ్యేయంగా పని చేశారు. వందేళ్ల క్రితమే మూక్‌ నాయక్‌ పత్రికను స్థాపించి నోరులేనివారి తరుపున గళమెత్తాడు. కులాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలో తానే స్పష్టంగా చెప్పి వెళ్లాడు. రాజ్యాధికారం కంటే ముందు ఈ దేశ ప్రజలకు మానసిక పరివర్తన అవసరమని చాటి చెప్పాడు. అందుకోసం ఎన్నో ఆత్మగౌరవ పోరాటాలు చేశాడు. వాటిలో 1927లో చేసిన మహర్‌ చెరువు పోరాటం అన్నింటికంటే ముఖ్యమైంది. దళితులు కనీసం చెరువు నుండి తాగునీరు ముట్టరాదన్న బ్రాహ్మణీయ మనువాద సంస్కతిపై ఇది తిరుగుబాటు పోరాటం. దీనికి నాయకత్వం వహించింది బాబా సాహెబే. ‘మనల్ని అంటరాని వారు అంటున్నారు కదా, సామూహికంగా వెళ్లి మహర్‌ చెరువులోని నీరుతాగుదాం రండి’ అంటూ పిలుపునిచ్చాడు. వేలాదిగా తరలివచ్చారు జనం. అట్లా బాబా సాహెబ్‌ నేతత్వంలో జరిగిన ఈ ఆత్మగౌరవ పోరాటం చరిత్ర నుదుటన చెరగని సంతకంగా మిగిలింది. ఈ దేశ ఛాందస మనువాద ఫాసిజం సిగ్గుతో తలదించుకునేలా బాబా సాహెబ్‌ ఆ పోరాటాన్ని ముందుండి నడిపించారు. విషాదం ఏమిటంటే ఆ పోరాటం జరిగి వందేళ్లు దగ్గరవుతున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో దళితులను ఊరుమ్మడి బావి లేదా చెరువు నీరు కూడా తాగనివ్వని కులవివక్షత ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఏది ఏమైనా న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం ఆత్మగౌరవంతో పోరాడి సాధించుకోవాలన్న బాబా సాహెబ్‌ స్ఫూర్తి ఇక్కడ గమనించదగింది. ఆచరించదగింది.
అలాగే బహుజనుల బానిసత్వానికి మూలం వైదిక మత గ్రంధాల్లో ఉందన్నాడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌. అందుకే వాటిని తగలబెట్టాలని కూడా పిలుపునిచ్చాడు. సమస్యకు మూలం కనుగొనాలి. పరిష్కారం అక్కడి నుండి రాబట్టాలి. ఇది బాబా సాహెబ్‌ పని విధానం. ఆయన చేసిన సుదీర్ఘ అధ్యయనంలో ఈ దేశానికి వలసొచ్చిన ఆర్యులు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసమే ఈ హిందూ పురాణ ఇతిహాసాలను రచించారని గుర్తించాడు. అందుకే ఆ ఆర్యన్‌ దేవుళ్లను పూజించవద్దని, వారి గ్రంధాలను పఠించి ఆచరించొద్దని సమాజానికి పిలుపునిచ్చాడు బాబా సాహెబ్‌. అందులో భాగంగా తాను ఎంచుకున్న పోరాటమే ‘మనుస్మతి దహనం’. మనిషిని మనిషిగా చూడనివ్వని మూర్ఖపు అమానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మనుస్మతిని తగలబెడితే తప్ప ఈ దేశంలో మార్పు రాదని చాటిచెప్పాడు బాబాసాహెబ్‌. 1927 డిసెంబర్‌, 25న తన అనుచరులతో కలిసి మనుస్మతిని తగలబెట్టి ఈ దేశ బహుజనులు చేయాల్సిన పని ఏమిటో చేసి చూపించాడు. అట్లా ఆత్మగౌరవ సాంస్కతిక పోరాటాల ద్వారానే ఈ దేశంలో మార్పు వస్తుంది, కులవ్యవస్థ కూలిపోతుందని బాబా సాహెబ్‌ ఎలుగెత్తి చాటాడు. దానిని ఆచరణలో చేసి చూపించాడు. ఇలా ఒకటేమిటి బాబా సాహెబ్‌ జీవితమంతా పోరాటాలతోనే గడిచింది. న్యాయంగా దక్కాల్సిన హక్కులకు అడ్డుపడుతున్న మనువాద కులవ్యవస్థను అడుగడుగునా తిరస్కరిస్తూనే ముందుకు సాగాడు. భావి పోరాటాలకు అతడు వేగుచుక్కలా నిలిచాడు.
త్యాగాల చిరునామా అతడే!
బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ భౌతిక రూపాన్ని చూస్తే చాలా గంభీరంగా ఉంటుంది. పైగా సూటు, బూటుతో కూడుకున్న ఆహార్యం మరింత హుందాతనాన్ని ఇస్తుంది. దీనిని చూసి చాలా మంది బాబా సాహెబ్‌ గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టి పెరిగినట్టు భ్రమిస్తారు. కానీ, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవితమంతా కష్టాల కన్నీటిమయం. ఆయన బాల్యంలో కుల అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నాడో ఆర్థిక ఇబ్బందులు కూడా అంతే ఎదుర్కొన్నాడు. కనీసం ఇంట్లో పడుకోవడానికి జాగ కూడా లేకుంటే రాత్రంతా చదువుతూనే కూర్చుండే వాడు. తెలతెల్లవారుతుండగా వారి తండ్రి లేదా కుటుంబ సభ్యులు పనులకు వెళ్తే ఖాళీ అయిన ఆ జాగాలో బాబా సాహెబ్‌ నిద్రించేవాడు. అలాగే లండన్‌తో పాటు కొలంబియా యూనివర్సిటీలో మంచినీళ్లు తాగి కడుపు నింపుకొని చదివేవాడు. ఒక సందర్భంలో పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. తన భార్య రమాబాయికి ఉత్తరం రాశాడు. తన దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపమన్నాడు. ‘నా దగ్గర కొద్ది డబ్బులే ఉన్నాయి. పైగా మన అబ్బాయి జ్వరంతో ఉన్నాడు, హాస్పటల్‌కి తీసుకువెళ్లకపోతే మన కొడుకు దక్కడండి’ అని ప్రత్యుత్తరంలో తెలిపింది రమాబాయి. అందుకు బాబా సాహెబ్‌ మరో ఉత్తరంలో ‘రమా… నువ్వు మన అబ్బాయిని హాస్పటల్‌కు తీసుకెళ్లకుంటే పోయేది మన కొడుకు ప్రాణమే. అదే నా చదువు ఆగిపోతే ఈ దేశంలో రేపు చాలా మంది బిడ్డలు చచ్చిపోతారు’అని రాశాడు. అలా ఈ సమాజంలో అట్టడుగున ఉన్నవారి కోసం సొంత బిడ్డలను చంపుకున్న త్యాగం బాబా సాహెబ్‌ది.
అంతేకాదు తాను మినిస్టర్‌ అయ్యాక ఈ దేశంలో మహిళలకు అన్నింట్లో పురుషుడితో సమానంగా హక్కులు ఉండాలని పోరాడాడు. పార్లమెంట్‌లో అందుకోసం ‘హిందూకోడ్‌ బిల్లు’ తెచ్చాడు. కానీ, అది అగ్రవర్ణ నేతల కారణంగా వీగిపోయింది. దీంతో కలత చెందిన బాబా సాహెబ్‌ ఏకంగా తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేశాడు. ప్రజలే ముఖ్యమని భావించి కేంద్ర మంత్రి పదవిని సైతం తణప్రాయంగా వదిలేసిన త్యాగశీలి బాబా సాహెబ్‌. ఎందుకంటే ఏ దేశ అభివద్ధి అయినా ఆ దేశ మహిళల చైతన్యం ద్వారానే కొలుస్తాను అన్నాడు బాబా సాహెబ్‌. అందుకే తాను మహిళా పక్షపాతిగా నిలబడ్డాడు. ఇవాళ మహిళా బిల్లు మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నవాళ్లు, బాబా సాహెబ్‌ హిందూకోడ్‌ బిల్లు తెచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారనేది ప్రశ్న. ఇట్లా బాబా సాహెబ్‌ జీవితమంతా త్యాగాలతోనే గడిచింది. ప్రజా సంక్షేమమే ముఖ్యమని భావించినప్పుడు తాను తన కుటుంబాన్ని సైతం లెక్కచేయలేదు. అందుకే ఆయన త్యాగం ముందు ఈనాటి రాజకీయ నేతలు ఎవ్వరూ కూడా సాటి రారనేది పచ్చి వాస్తవం.
చరిత్రను తిరగరాసిన మేధావి
అంబేద్కర్‌ చేసిన మేధో శ్రమ అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఇదే అంబేద్కరిజం. ఆయన ఈ దేశవిముక్తి కోసం ఎంతో దూరదష్టితో ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ముఖ్యంగా తన రచనలు, ప్రసంగాల ద్వారా ఈ జాతులను చైతన్య పరచాలని సంకల్పించాడు. అందుకు ఎంతో నిబద్ధతతో అనేక విషయాలను అధ్యయనం చేసి పరిశోధనాత్మకంగా చరిత్రను పునర్‌ వ్యాఖ్యానించాడు. సింధూ హరప్ప నాగరికత నుండి భారత స్వాతంత్య్రోద్యమ ఘట్టాల దాకా ప్రతీ సామాజిక, రాజకీయ సందర్భాన్ని తనదైన దష్టికోణంతో విశ్లేషించాడు. అయితే ఈ విలువైన రచనలను బ్రాహ్మణ మేథో వర్గం అంతగా వెలుగుచూడకుండా చేయాల్సిన కుట్రలన్నీ చేశాయి. ఇక ఇప్పుడు గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా మాత్రం అంబేద్కర్‌ రచనలు చదవడం అనేది ప్రతిష్టాత్మక పనిగా మారింది. ప్రతీ సమస్యకు బాబా సాహెబ్‌ ఆనాడు ఏం చెప్పాడని చూడాల్సిన అనివార్యత ఆయన రచనలు కలిగిస్తున్నాయి. అందుకే అరుంధతీరాయి అంబేద్కర్‌ కులనిర్మూలన గ్రంథానికి ముందుమాట రాస్తూ ”ఒక్క అంబేద్కర్‌ చాలు.. ఈ భారత దేశానికి” అంది. అంటే అంతటి లోతైన అధ్యయనం బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ది. కాలాతీతంగా నిలబడగల శక్తి ఆయన రచనలకు ఉన్నాయన్నది కాదనలేని సత్యం. అందుకే ఆయన రచనలు చదువుకున్న వారెవ్వరూ ఆయనను విస్మరించలేరు. అట్లా బాబా సాహెబ్‌ను చదువుకున్న ప్రపంచ దేశాలు ఇవాళ ఆయన కషిని వేనోళ్ల కొనియాడుతున్నాయి. కొలంబియా యూనివర్సిటీలో ఏకంగా ఆయన విగ్రహం నెలకొల్పారు. ఇది అరుదైన ఘనత. అమెరికా వంటి ఒక అగ్రరాజ్యంలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు దక్కిన సమున్నదత గౌరవం. ఇక ఆయన పుట్టిన ఏప్రిల్‌ 14ను సైతం ‘వరల్డ్‌ నాలెడ్జ్‌ డే’గా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు ఐక్యరాజ్య సమితి సైతం పేర్కొంది. ఆయన జయంతి వేడుకలను అధికారికంగా పలు దేశాలు నిర్వహిస్తున్నాయంటే దానికి ఆయన మేధో సంపత్తి, జ్ఞాన ఉత్పత్తే కారణం. బాబా సాహెబ్‌ 1956 అక్టోబర్‌ 29నాడు ఐదు లక్షల మందితో బౌద్దాన్ని స్వీకరించాడు. అందుకు కారణం స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతత్వం విలువలకు నిలయంగా బౌద్ధమతం వర్థిల్లడమే.
ఏది అసలైన నివాళి..?
బాబా సాహెబ్‌ ఈ దేశం కోసం ఎంతో చేశారు. ముఖ్యంగా గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. ఇవాళ అది ప్రమాదంలో పడే పరిస్థితులు దాపురించాయి. క్రమంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్రలు నిత్యకత్యం అవుతున్నాయి. కావున ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి. మన ఇళ్లల్లో పవిత్ర మత గ్రంథాలు ఉన్నట్టు రాజ్యాంగం కూడా ఉండాలి. ఇక బాబా సాహెబ్‌ రచనలను, ప్రసంగాలను చదవాలి. ఆయన స్ఫూర్తిని గడపగడపకు తీసుకెళ్లాలి. పాలకులు విగ్రహాలు పెట్టి చేతులు దులుపుకోవచ్చు. పౌర సమాజం మాత్రం ముందు బాబా సాహెబ్‌ను గురించి లోతుగా తెలుసుకునేందుకు కషి చేయాలి. ఆయన అందించిన స్ఫూర్తితో ఈ దేశాన్ని ముందుకు నడపాలి. అందుకు లౌకిక ప్రజాస్వామిక శక్తులంతా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. కలిసికట్టుగా ఒక గొప్ప భరోసాను బాబా సాహెబ్‌ మార్గంలో రేపటి తరాలకు అందించాల్సిన చారిత్రక అవసరం మన ముందు ఉంది. సనాతనం పేరుతో ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఓట్ల కోసం మతాన్ని రాజకీయంగా మార్చే దుష్టశక్తులను ప్రతిఘటించడమే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు మనం అందించే నిజమైన నివాళి. ఆ మహా త్యాగ శిఖరానికి జేజేలు. పూలే, అంబేద్కర్ల స్ఫూర్తితో ఆత్మగౌరవ పోరాటాలు వర్థిల్లాలి.
– డా||పసునూరి రవీందర్‌
77026 48825 
మహా జ్ఞాని బాబాసాహెబ్‌

ఆలోచన ఆకాశమంత
జ్ఞానం అందనంత
ఎవరికైనా సాధ్యమా
బాబాసాహెబ్‌ అంత…

నిచ్చెన మెట్ల కులపీడన
సర్వం బ్రహ్మ సష్టియన్న
కుహనా సంస్కతుల ఎదురు దాడులు

సిద్ధార్థ, ఫూలే, పెరియార్‌, నారాయణగురు…
అడుగు జాడలు
మార్క్స్‌, హెగెల్‌, గెలీలియో, డార్విన్‌…
నిత్య సత్య శోధన

దోపిడీ దురహాంకార దుష్టుల
గుండెలు పిండంగా…

సర్వశక్తులొడ్డి
సాటి లేని, పోటి లేని
ధీటైన సమాధానం
మా బాబా సాహెబ్‌

జ్ఞానానికే ప్రతీక
సపరిత్యాగ సంఘసంస్కర్త
సామాజిక న్యాయ నిర్ణేత
ప్రపంచ అగ్ర రాజ్యాంగ నిర్మాత
ఇజం నేర్పిన భారతరత్న
మా బాబా సాహెబ్‌

విశ్వ సత్యమెరిగిన విశ్వంభర
అవని మెచ్చిన అవనీష
సహదయ భాష్కర
సర్వే జన భవదీయ
సమైక్య స్వరాగ
సుజ్ఞాన చిరాగ
మా బాబా సాహెబ్‌

ఓ స్వరాజ్య స్వాప్నిక!
మీ అడుగు జాడలే మా జ్ఞాపిక
మిము విడిచి మేము లేమిక
మిము విడిచి మేము లేమిక
– మహేష్‌ దుర్గే, 9700888972

Spread the love