పని చేయని మోడీ ప్రచారం

modi rahul– దేశవ్యాప్తంగా 151 యోజకవర్గాల్లో ప్రసంగాలు
– ఎన్డీఏ గెలిచింది 85 సీట్లే
– తగ్గిన మోడీ స్ట్రైక్‌ రేట్‌
– 56 శాతానికే పరిమితం
– కేరళ, తమిళనాడులో ప్రధాని ప్రభావం శూన్యం
– వెల్లడిస్తున్న గణాంకాలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా మోడీ మీదనే ఆధారపడిన బీజేపీకి షాకింగ్‌ ఫలితాలు వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఎంపీ స్థానాలు 303 నుంచి 240 వరకు పడిపోయాయి. దీంతో కేంద్రంలో స్వంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చతికలపడిపోయింది. ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాల అవసరం మోడీకి అనివార్యమైంది. దీనిని బట్టి చూస్తే మోడీ ప్రచారం బీజేపీకి కలిసిరాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పలు నియోజకవర్గాల్లో మోడీ పర్యటించి, సభలు, సమావేశాలు నిర్వహించినా.. ఫలితాలు ఆశించినంతగా రాలేదని ఎన్నికల ఫలితాలను రాజీకీయ విశ్లేషకులు చూపెడుతున్నారు. మార్చి 31 నుంచి మే 30 మధ్య.. మోడీ దేశవ్యాప్తంగా 151 నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహించారు. వీటిలో ఎన్డీఏ 85 స్థానాల్లో విజయం సాధించింది. 66 నియోజకవర్గాల్లో ఓటమిని చవి చూసింది. అంటే.. కాషాయకూటమి తరఫున మోడీ స్ట్రైక్‌ రేట్‌ 56 శాతం( గెలిచిన సీట్లు)గా ఉన్నది.
ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో(యూటీ) పర్యటించారు. ఆయన 66 నియోజకవర్గాల్లో.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తరఫున ప్రచారం చేశారు. అయితే, ఇండియా కూటమి 32 స్థానాల్లో విజయం సాధించింది. అంటే.. 48 శాతం సీట్లను ఇండియా కూటమి నెగ్గగలిగింది. అయితే, కాంగ్రెస్‌ తన లోక్‌సభ స్థానాలను బీజేపీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుచుకోవటం విశేషం. 2019 ఎన్నికలతో పోలిస్తే మోడీకి స్ట్రైక్‌ రేట్‌ ఈ సారి తగ్గింది. గత లోక్‌సభ ఎన్నికల్లో.. ప్రధాని మోడీ 103 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించగా.. ఎన్డీఏ 17 స్థానాల్లో మాత్రమే ఓడిపోయింది. స్ట్రైక్‌ రేట్‌ 85 శాతంగా ఉన్నది.
పెద్ద ఎదురుదెబ్బలు
మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, కేరళ, పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా, 2014 నుంచి పదేండ్ల పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న యూపీలో.. ఈ సారి మోడీ అత్యధిక బహిరంగ సభలను నిర్వహించారు. 23 నియోజకవర్గాల్లో ఆయన తిరిగితే.. దక్కింది కేవలం 10. అంటే, 13 స్థానాల్లో కాషాయకూటమి ఓటమిని మూటగట్టుకున్నది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన స్థానాల్లో ఆరింటిని మాత్రమే కాషాయకూటమి పోగొట్టుకున్నది. ఈ సారి ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లను కోల్పోవటం కాషాయపార్టీకి మింగుడుపడటంలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక యూపీి తర్వాత.. పశ్చిమ బెంగాల్‌కు మోడీ ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో 19 బహిరంగ సభలు నిర్వహించాడు. అయితే వాటిలో 12 స్థానాలలో బీజేపీ ఓడిపోయింది. మహారాష్ట్రలో ప్రధాని బహిరంగ సభలు నిర్వహించిన 18 నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓడిపోయింది. రాజస్థాన్‌లో మోడీ బహిరంగ సభలు నిర్వహించిన ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో మాత్రమే బీజేపీ కూటమి విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ క్లీన్‌ స్వీప్‌ చేసిన సమయంలో.. మోడీ రాష్ట్రంలో ఐదు బహిరంగ సభలు నిర్వహించారు.
పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి బీజేపీ కూటమికి మరొక ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల సీజన్‌లో మోడీ ఈ రెండు రాష్ట్రాలలో మూడు చొప్పున బహిరంగ సభలు నిర్వహించారు. అయితే అందులో ఐదు నియోజకవర్గాల్లో కూటమి ఓడిపోయింది. కేరళ, తమిళనాడులో.. ఐదు సమావేశాలు జరిగినప్పటికీ మోడీ స్ట్రైక్‌ రేట్‌ సున్నాగా ఉన్నది. తెలంగాణలో మోడీ ర్యాలీ నిర్వహించిన ఐదు నియోజకవర్గాల్లో మూడింటిలో ఎన్డీఏ ఓడిపోయింది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
బీహార్‌ (13), కర్నాటక (8)లలో మోడీ పర్యటించగా.. నాలుగింటిలో ఎన్డీఏ ఓటమి చెందింది.స్వంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ సాధించలేకపోయింది. ఇక్కడ ఆరు బహిరంగ సభలు జరిగినప్పటికీ బీజేపీ బనస్కాంతలో ఓడిపోయింది.

రాహుల్‌ గాంధీ దృష్టి సారించిన ప్రాంతాలు
రాహుల్‌ గాంధీ బహిరంగ సభల్లో ఎక్కువ భాగం ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆరు రారుబరేలీలో, రెండు వాయనాడ్‌లో జరిగాయి. రెండింటిలోనూ భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించాడు. యూపీలో, రాహుల్‌ గాంధీ బహిరంగ సభలు నిర్వహించిన 14 సెగ్మెంట్లలో ఆరింటిలో ఇండియా కూటమి ఓడిపోయింది. కేరళలో ఏడు నియోజకవర్గాల్లో ఏడు బహిరంగ సభలు నిర్వహించగా.. ఆయన పార్టీ కొట్టాయంలో కేరళ కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయింది. మోడీతో పోలిస్తే రాహుల్‌ గాంధీకి వంద శాతం స్ట్రైక్‌రేట్‌ ఉన్న రాష్ట్రాలు పంజాబ్‌, జార్ఖండ్‌లు కావటం గమనార్హం. ఇక 130 నియోజకవర్గాలను కలిగి ఉన్న బీహార్‌, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలలో రాహుల్‌ గాంధీ 14 సెగ్మెంట్లలో బహిరంగ సభలు నిర్వహించారు. వీటిలో ఆరింటిలో ఇండియా కూటమి ఓడిపోయింది. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ నాయకుడి ట్రాక్‌ రికార్డ్‌ అధ్వాన్నంగా ఉన్నది. అక్కడ రాహుల్‌ అనేక నియోజకవర్గాలలో 14 బహిరంగ సభలు నిర్వహించాడు. కానీ ఇండియా కూటమి ఒక్కటి కూడా గెలవకపోవటం గమనార్హం.

Spread the love