ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
కార్పొరేట్ పెట్టుబడిదారులకు మోడీ సర్కార్ మోకరిల్లిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీడిత ప్రజలను,శ్రమ జీవులను చైతన్య పరుస్తూ వారిని వర్గ పోరాటాలో సమీకరిస్తూ, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం సి.పి.ఐ.(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ కృషి చేస్తున్నదని,మట్టి మనుషులను,శ్రమ జీవులకు విప్లవ రాజకీయాలు బోధించి పోరాట వీరులు గా మలిచే ప్రయత్నం నిరంతరం పార్టీ చేస్తున్నదని పేర్కొన్నారు.
నేడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మతాల పేరిట చిచ్చు రగిలించి,ఆ మంటల్లో స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ దేశ లౌకిక వ్యవస్థ విచిన్నానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం చెబుతున్న బేటి పడావో,బేటి బచావో నినాదాలు కేవలం ప్రకటనలకే పరిమితమైనవని తెలిపారు, మహిళలపై అత్యాచారాలు చేసి జైలుకు వెళ్లిన రేపిస్టులకు అండదండగా ఉంటూ వారు బెయిల్ పై రాగానే పూలదండలతో ఊరేగింపులు చేయటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న అత్యాచారం కేసులలో 45 శాతానికి పైగా బిజెపి దాని అనుబంధ సంస్థల నాయకుల పైనే నమోదు కావడం సిగ్గుచేటని అన్నారు. దేశంలోని రేపిస్టులకు, పేపర్ లీకేజీ దారులకు మోడీ ప్రభుత్వం అండగా ఉండటం చాలా దుర్మార్గమన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర మంత్రి మండలి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్న వారిని అర్బన్ నక్సల్స్ అంటూ,అక్రమ కేసులు నమోదు చేస్తూ అకారణంగా జైల్లో నిర్బంధిస్తూ, ప్రజాస్వామిక వాదులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం కాల రాస్తుందని, మనుధర్మం,సనాతన ధర్మం పేరుతో మతరాజ్యస్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్నదని, మరోవైపు దేశ సంపదను ఆదాని,అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశానికి, ప్రజలకు తీరని ద్రోహం తల పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రజలు పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు ,వలసలతో సతమతమంటూ ఆర్థికంగా చితికి పోతుంటే ప్రభుత్వాలు అసెంబ్లీ పార్లమెంట్ లలో పెట్టుబడిదారుల దోపిడీకి వత్తాసు పలికే చట్టాలు, సంస్కరణలు తీసుకువస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.
ఫాసిస్ట్ హిట్లర్, ముస్సోలినీ లను నేటి మోడీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ప్రజల ప్రజాస్వామిక హక్కులను క్రూరంగా అణచివేస్తున్నదని, హిందుత్వ శక్తుల నుండి మన రాజ్యాంగాన్ని,లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత దేశ ప్రజలందరిపైన ఉందని తెలిపారు. సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ పాయం చిన్న చంద్రన్న మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 421 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్తు కాలయాపన చేస్తున్నారని, అదేవిధంగా రైతులు మొక్కజొన్న,వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు,అవస్థలు ఆవేదనలను రాష్ట్ర ప్రభుత్వం చూడట్లేదని, రైతులకు సరిగా రుణమాఫీ జరగలేదని, కార్మికులకు కనీస వేతనాల ప్రకటన సమగ్రంగా లేదని, ప్రతి కర్మికునికి కనీస వేతనంగా 26,000 అమలు చేయాలని,ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,నిరుద్యోగ భృతి ఊసే లేదని,మహిళలకు 2500 కనుచూపుమేరలో లేదని,విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్ లేవని వెంటనే అవి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి “భారత విప్లవ పంథా”అనే క్లాస్ బోధించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు ముంజంపల్లి వీరన్న బిల్లా కంటి సూర్యం అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.పార్టీ డివిజన్ మండల గ్రామ నాయకులు జక్కుల యకన్న,దొడ్ల కేశవులు,టిరవీందర్,రాజేశ్వర్ రెడ్డి, ఆవుల కట్టయ్య,చింత నవీన్ ధరవత్ సంతోష్,దూదిమెట్ల లింగయ్య, అడ్డూరి రాజు,జవహర్లాల్,ధార లింగన్న పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, ఈర్ల వెంకన్న, జక్కుల ఐలన్న,కళాధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.



