నల్ల చట్టాలతో మోడీ దగా

Modi lied with black laws–  బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా 16న గ్రామీణ బంద్‌, సమ్మె : కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
– ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రధాని మోడీ నల్ల చట్టాలతో దేశంలోని రైతుల్ని మోసం చేశారని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎమ్‌.కోదండరెడ్డి విమర్శించారు. అన్నదాతల ఆందోళనతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించిన మోడీ…ఆ తర్వాత సంబంధిత బిల్లులను వెనక్కి తీసుకోలేదని విమర్శించారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రైతు, కార్మిక, కూలీ సంఘాలు నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డి అధ్యక్షతన వివిధ రైతు, కార్మిక, కూలీ సంఘాలు సమావేశమయ్యాయి. ఈనెల 16న నిర్వహించతలపెట్టిన గ్రామీణ బంద్‌, సమ్మె తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ… రైతు తన భూమిని కార్పొరేట్‌ కంపెనీలకు కౌలుకు ఇచ్చిన తర్వాత అతని పరిస్థితేంటని ప్రశ్నించారు. గోదాముల్లో నిల్వలు ఉండొద్దనే చట్టాన్ని కూడా మోడీ ఎత్తేశారని విమర్శించారు. అదానీ, అంబానీకి లాభం చేసే పనిలో ప్రధాని ఉన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ…బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలు, రైతులను, కార్మికులను హత్య చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను రక్షించుకునేం దుకు అందరం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించబోమే మహాధర్నాకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాల్‌రాజు, ఐఎన్‌టీయూసీ నేత నాగయ్య మాట్లాడుతూ గ్రామీణ బంద్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.
మేడిగడ్డ అవినీతిపై ఊరూరా ప్రచారం టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌
మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతిపై ఊరూరా ప్రచారం నిర్వహిస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ చెప్పారు. ప్రాజెక్టు కుంగుబాటుకు గురైతే, దాన్ని పరిశీలించేందుకు ఆనాటి బీఆర్‌ఎస్‌ సర్కారు అనుమతి ఇవ్వలేదన్నారు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించలేదని విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో నెలకొన్న అవినీతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్యం రాకపోతే రాష్ట్రం కుక్కులు చింపిన విస్తరి అయ్యేదని వ్యాఖ్యానించారు. .

Spread the love