మోడీ వాదన ఎండమావి లాంటిదే

Modi's argument is like a mirage– ప్రధానిపై సానుకూలత అంతంత మాత్రమే : తేల్చి చెప్పిన ‘గ్లోబ్‌స్కాన్‌’ సర్వే
– భారత్‌ పేరు ప్రతిష్టలను ఆయన పెంచలేదు
– ఆ దేశాల్లో పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ దేశాల్లో భారత్‌ పేరు ప్రతిష్టలు ఇనుమడించాయంటూ అధికార బీజేపీ ఎన్ని కథనాలు వండివారుస్తున్నప్పటికీ వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని తాజా అధ్యయనం తేల్చింది. 2014కు ముందే భారత్‌కు అంతర్జాతీయంగా మంచి పేరు ఉండేదని, ఇప్పుడది ఎండమావిగా మారిందని ఆ అధ్యయనం తెలిపింది. ‘గ్లోబ్‌స్కాన్‌’ అనే సంస్థ మార్చి 29-ఏప్రిల్‌ 8 తేదీల మధ్య అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో ఓ సర్వే నిర్వహించింది. భారత్‌తో తమ దేశాల సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే ముందుగా అక్కడ మానవ హక్కులకు, ప్రజాస్వామ్యా నికి రక్షణ లభించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది కుండబద్దలు కొట్టారు.
హత్యాయత్నాలపై ఆందోళన
భారత్‌కు తమ దేశాల నుంచి పారిశ్రామిక, ఇతర వాణిజ్య పెట్టుబడులు రావాలంటే ముందుగా ఆ దేశంలో మానవ హక్కులకు రక్షణ కల్పించడం అవసరమని 90 శాతం మంది స్పష్టం చేశారు.
అమెరికా, కెనడా పౌరులను హతమార్చేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు భారత పౌరులుగా మారడానికి అవరోధంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టంపై సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు అభ్యంతరం తెలిపారు. ముస్లింలు మినహా బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ నుండి మన దేశానికి వచ్చిన మతపరమైన మైనారిటీ శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించారు. వారు భారత్‌లో ఆరు సంవత్సరాలు నివసించి ఉండాలని, 2014 డిసెంబర్‌ 31 నాటికి దేశంలో ప్రవేశించి ఉండాలని షరతు పెట్టారు. ఈ చట్టాన్ని 2019లోనే పార్లమెంట్‌ ఆమోదించినప్పటికీ ఈ సంవత్సరం మార్చిలో అమలు చేశారు.
పీఎంఓ ఆదేశాల మేరకే ఆ కథనాలు
మీడియాపై సెన్సార్‌షిప్‌ విధించడం, బలప్రయోగం చేయడం, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం సాగించడం వంటి చర్యల కారణంగా ప్రపంచ వేదికపై భారత్‌ పేరు ప్రతిష్టలను, గౌర వాన్ని మోడీ నాట కీయంగా పెంచారన్న అభిప్రాయం కలిగిందని సర్వే నివేదిక తెలిపింది. ‘ప్రధాన మంత్రి కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు అందించాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో మోడీ పాత్రపై స్టోరీలు రూపొందించడం కోసం అవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఇవి అంతర్జాతీయ కవరేజీపై కొంత ప్రభావం చూపి ఉండవచ్చు. ఎందుకంటే విదేశాల్లోని మీడియా సంస్థలు తరచూ తమ న్యూఢిల్లీ ప్రతినిధుల నుండి సమాచారాన్ని సేకరిస్తుం టాయి. వారిని జాతీయ మీడియా వాతావరణం ప్రభావితులను చేసింది’ అని సర్వే నివేదిక వ్యాఖ్యానించింది.
ప్రధానిపై సానుకూలత తక్కువే
‘మోడీ ఎండమావి’ పేరిట రూపొందించిన ఈ సర్వేను మంగళవారం విడుదల చేశారు. నెదర్లాండ్స్‌లోని గ్రానింజెన్‌ యూనివర్సిటీ, లండన్‌  యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌కు చెందిన విద్యావేత్తలు దీనిని నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో బ్రిటన్‌కు చెందిన 10 శాతం మంది, అమెరికాకు చెందిన 22 శాతం మంది మాత్రమే మోడీ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. అమెరికా యువతలో ఈ సానుకూలత మరింత తగ్గింది. సర్వేలో పాల్గొన్న అమెరికా యువతలో 9 శాతం మాత్రమే మోడీకి మద్దతు తెలపడం గమనార్హం.
భారత్‌ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయి
భారత ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల రీత్యా ప్రపంచ దేశాల్లో దాని పేరు ప్రతిష్టలు ఇనుమడించాల్సిన అవసరముందని ప్రధాని మోడీ సరిగానే చెప్పారని నివేదిక రూపకర్తల్లో ఒకరైన జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఇర్ఫాన్‌ నూరుద్దీన్‌ తెలిపారు. ‘అయితే భారత్‌ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేశానని మోడీ చెప్పుకోవడం తప్పని మా సర్వేలో తేలింది. వాస్తవానికి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం విషయాల్లో భారత్‌ పనితీరు బాగా లేకపోవడం దాని ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని మా సర్వే వెల్లడించింది’ అని ఆయన చెప్పారు.
‘యూగవ్‌’ ఏం చెప్పింది?
‘యూగవ్‌’ సంస్థ నుండి మార్చిలో తీసుకున్న సమాచారాన్ని కూడా ఈ సర్వేలో చేర్చారు. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో మోడీకి ప్రజాదరణ ఏమీ లేదని, అక్కడి వారికి ఆయన గురించి పెద్దగా తెలియదని ‘యూగవ్‌’ సర్వే తెలిపింది. పైగా ఈ రెండు దేశాల ప్రజలు అయిష్టత చూపే నేతల జాబితాలో మోడీ కూడా ఉన్నారు. ‘యూగవ్‌’ అనేది బ్రిటన్‌ ఇంటర్నెట్‌ ఆధారిత మార్కెట్‌ పరిశోధనా సంస్థ. సర్వేలో పాల్గొన్న బ్రిటీష్‌ ఇండియన్లలో 52 శాతం మంది మోడీ పట్ల సానుకూలత చూపలేదు. కేవలం 35 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతు తెలిపారు.

Spread the love