– బీజేపీకి మేమిచ్చే సమాధానం ఇదే
– కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటర్వ్యూ
మోడీ వర్సెస్ ఎవరు అని బీజేపీ ప్రశ్నిస్తే ‘మోడీ వర్సెస్ కామన్ మ్యాన్’ అనే సమాధానమిస్తానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 2022 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 81 ఏండ్ల ఖర్గే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ‘ది వీక్’ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే రామాలయ ప్రారంభోత్సవం, మోడీ నిరంకుశత్వ పాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి ఎదురవుతున్న ప్రమాదాలు తదితర అంశాలపై తనదైన రీతిలో స్పందించారు. ఆ ఇంటర్వ్యూలోని విశేషాలు…
‘మోడీ వర్సెస్ ఎవరు’ అనే ప్రశ్నకు ప్రతిపక్షాలు ఏం సమాధానమిస్తాయి?
మోడీ నియంత, నిరంకుశుడు. అటువంటి ఆయన లేదా ఆయన వందిమాగధులు అడుగుతున్నారు ‘మోడీ వర్సెస్ ఎవరు?’ అని. ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం ఉంది. ఎన్నికల తర్వాత కూటమి పార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకుంటాయి. ఇలాంటివి చాలా సార్లు జరిగాయి. జనతా పార్టీ హయాంలో మొరార్జీ దేశారు ఆవిర్భవించారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ ఆ విధంగా ప్రధానులైనవారే. ‘మోడీకి పోటీ ఎవరు’ అని బీజేపీ ప్రశ్నిస్తే ‘మోడీకి పోటీ సామాన్యుడు’. ఇదే మా సమాధానం.
మీరు , కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. మిమ్మల్ని హిందూ వ్యతిరేకి అనడానికి బిజెపికి ఆస్కారమిచ్చినట్లు మీరు భావించట్లేదా?
ఇది ప్రభుత్వ కార్యమా? ట్రస్ట్ ఫంక్షన్ కాదా? అలాంటప్పుడు మోడీ ఆ క్రెడిట్ ఎందుకు తీసుకుంటున్నారు? అలాగే, మీరు భారత రాష్ట్రపతికే చోటివ్వలేదు. అటువంటిది అంటరాని నాయకుడైన నాకు ప్రధాన మంత్రి దగ్గర చోటిస్తారా? రాజకీయాల కోసం మీరు ( మోడీ అండ్ కోను ఉద్దేశించి) నా వైపు, సోనియా గాంధీ వైపు వేలు పెడుతున్నారు.
మీరు నా ప్రజలను ఏ దేవాలయాలలోకి అడుగు పెట్టనివ్వరు. తాగునీరు కూడా ముట్టుకోనివ్వరు. పల్లెటూళ్ళలో వాళ్ళకి చదువు చెప్పనివ్వరు. మా చిన్నపిల్లలు గుర్రం మీద ఊరేగింపుగా వెళితే మీరు వారిని కిందకి లాగి కొడతారు. అలాంటి వారు మమ్మల్ని అడుగుతున్నారు, ‘ రామ మందిరం ప్రారంభోత్సవానికి మీరు ఎందుకు రాలేదని?
నేను గుల్బర్గాలో భారీ బుద్ధ విహార్‌ను నిర్మించాను. నా సొంత నియోజకవర్గంలో ప్రజలు భిన్నమైన విశ్వాసాలు కలిగినవారున్నారు. ఎమ్మెల్యేగా 90 హనుమాన్ ఆలయాలు నిర్మించాను. ఒకటి కాదు, రెండు కాదు తొంభై. మేం మత వ్యతిరేకులం కాదు.
2024 లోక్‌సభ ఎన్నికల ప్రాముఖ్యత ఏమిటి?
ప్రతి ఎన్నిక కొన్ని సవాళ్లను ముందుకు తెస్తుంది. ప్రతి ఎన్నిక భిన్నంగా ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూస్తున్న 14వ లోక్‌సభ ఎన్నికలివి. గత పదేండ్ల మోడీ ప్రభుత్వం దేశానికి పెద్ద విపత్తు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం 26 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయగలిగితే, ఈ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను ఉచిత రేషన్‌తో జీవించే స్థితికి నెట్టింది. నిరుద్యోగ సమస్య చూడండి. 83 శాతం మంది నిరుద్యోగులు 34 ఏండ్లలోపు యువకులే. నోట్ల రద్దు ప్రహసనం సరేసరి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనధరలు ఎన్ని వందల రెట్లు పెరిగాయో చూస్తున్నాం. కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ఈ ఎన్నికల్లో మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి?
రాజ్యాంగం , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం మా ముందున్న అతి పెద్ద సవాల్. ఈ రెండు లక్ష్యాల సాధనకు పోరాడుతున్నాం. అందుకే ‘ఇండియా బ్లాక్’ ఏర్పాటు చేసి, పొత్తులు పెట్టుకున్నాం.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 300 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. ట్రిపుల్-డిజిట్ మార్క్‌ను చేరుకోవడానికి మీకు చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ అవసరం కదా?.
మాకు చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ అవసరమన్నదాంతో నేను అంగీకరిస్తున్నాను, అయితే మనం పరిస్థితికి అనుగుణంగా పోరాడాలి. ఈసారి మాకు వనరులు లేవు, కానీ మా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో, యూ ట్యూబ్, ఇతర మీడియా ద్వారా తమ వంతు కషి చేస్తున్నారు. మేము మనసులో ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో, దానిని సాధిస్తాము.
మోడీ కా గ్యారెంటీ’కి కాంగ్రెస్ న్యాయమే సమాధానమా?
మోడీ కా గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదు. గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోడీ ఇచ్చిన హామీ ఏమైంది? ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. అది ఎక్కడికెళ్లింది? అహ్మదాబాద్ నుంచి ముంబయికి బుల్లెట్ రైలు నడుపుతామన్న హామీని కూడా ఆయన నెరవేర్చలేకపోయారు. ఎన్నికల ముందు చెప్పకపోయినా, యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) పథకం, ఆహార హక్కు, విద్య హక్కు, సమాచార హక్కు , ఆరోగ్య మిషన్ వంటివి తెచ్చాము.. మోడీ ఏం చేశారు? ఇచ్చిన హామీలన్నిటిని తుంగలో తొక్కారు..
మీ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ ముద్రను కలిగి వుందని మోడీ ఆరోపించారు. దీనిపై మీరేమంటారు?
1940ల తొలినాళ్లలో వీరు ముస్లిం లీగ్‌తో జతకలిశారు. ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముస్లిం లీగ్‌తో చేతులు కలిపారు. అలాంటి వాళ్లు మమ్మల్ని నిందిస్తున్నారు. మహిళలకు ప్రయోజనం కల్పించడం, స్త్రీ శక్తి ఇవన్నీ ముస్లింలీగ్ ఎజెండానా?శ్రామికులకు సరైన వేతనాలు ఇవ్వడం కూడా ముస్లిం లీగ్ ఎజెండానేనా? యువత కోసం 30 లక్షల ఖాళీలను భర్తీ చేసి వారికి అప్రెంటిస్‌షిప్ ఇస్తామనడాన్ని కూడా ఆయన ముస్లిం లీగ్ అజెండా అని చెప్పారు. కిసాన్ (రైతు) కి సహాయం చేయడం కూడా ముస్లిం లీగ్ అజెండానేనా? మోడీ నియంతలా వ్యవహరించాలనుకుంటున్నారు. ఇదే వైఖరి కొనసాగితే భవిష్యత్తులో అస్సలు ఎన్నికలే ఉండవు. ఆయన రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఆయన ఇప్పటికే ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్, ఆదాయపు పన్ను శాఖను పెద్దయెత్తున దుర్వినియోగం చేస్తున్నారు.
దక్షిణాదిపై బీజేపీ ప్రత్యేకంగా కేంద్రీకరించడాన్ని మీరు ఎలా చూస్తారు?
ఆయన (మోడీ) తన పార్టీ పునాదిని విస్తరించాలనుకుంటున్నారు.. ప్రధానిగా ఆయనకు చాలా వనరులు ఉన్నాయి. అందుకే దాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు.. ఆయనకు పాలనపై శ్రద్ధ లేదు. నిజంగా శ్రధ్ద ఉంటే మారణకాండతో అల్లాడిన మణిపూర్‌లో పర్యటించేవారు. మారణ కాండ సాగిన ఆ ఆరేడు మాసాల్లో ఆయన 14 దేశాలను సందర్శించారు. కానీ ఒక్క రోజైనా మణిపూర్ వెళ్లారా? ఆయన 300కు పైగా ఎన్నికల ప్రసంగాలు, ప్రారంభోత్సవాలు చేశారు. కానీ ఆయన మణిపూర్ వెళ్లి మాట్లాడలేరు. ‘నా నిర్ణయం దఢమైనది’ అని, ‘నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది’ అని చెబుతారు. మణిపూర్‌లో ‘నేను పోరాడతాను, నేను నిన్ను రక్షిస్తాను’ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు?
కాంగ్రెస్ మ్యానిఫెస్టో పౌరసత్వ సవరణ చట్టంపై మౌనంగా ఉంది. ఎందువల్ల?
మేం మ్యానిఫెస్టోలో అన్నింటినీ చేర్చలేము. ఎన్నికల కోసమే కొందరు ఇలా చేస్తున్నారు. మేము అలా చేయము. చట్టం ద్వారా దాదాపు 30,000 మంది లబ్ది పొందుతారని ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ భారతీయ పౌరసత్వం పొందడానికి ఇతర ఏర్పాటు విధానాలను కలిగి ఉన్నారు .జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి వచ్చాయి. ఫలితం 30 సంవత్సరాలు పనిచేసిన ఆర్మీ అధికారి డిటెన్షన్ క్యాంపులో పెట్టారు. అసోంలో దాదాపు 20 మంది పారామిలటరీ జవాన్లను ఎన్‌ఆర్‌సీ నుంచి తప్పించారు. ఒక దళిత ఎమ్మెల్యేను కూడా ఎన్‌ఆర్‌సీ నుంచి తప్పించారు. దీనిని ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది ?