39 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

Congress first list with 39 people– వయనాడ్‌ నుంచి మరోసారి రాహుల్‌
– తెలంగాణ నుంచి నలుగురికి అవకాశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు 39 మందితో కాంగ్రెస్‌ మొదటి జాబితా విడుదల చేసింది. మొత్తం నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ.వేణుగోపాల్‌, చత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ భగేల్‌, కీలక నేత శశిథరూర్‌, డీకే. సురేష్‌, సుధాకరణ్‌ పేర్లతో పాటు… పార్టీకి బద్దులుగా ఉన్న నేతలకు చోటు కల్పించింది. శుక్రవారం ఢిల్లీలోని అక్బర్‌ రోడ్‌లో గల ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతలు అజరు మాకెన్‌, పవన్‌ ఖేరాలతో కలిసి కేసీ వేణుగోపాల్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. గురువారం జరిగిన కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) సమావేశంలో 39 పేర్లను ఖరారు చేసినట్లు వెల్లడించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌ ను నిర్ణయిస్తాయని అన్నారు. లోక్‌సభలో మెజారిటీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లు కేటాయింపు చేసినట్టు తెలిపారు. మార్చి 11న మరోసారి కాంగ్రెస్‌ సీఈసీ సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఆ భేటీ మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్‌ చేస్తామని ్తఎలిపారు.
తెలంగాణ నుంచి 4 గురికి చోటు
తెలంగాణ నుంచి మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా… మొదటి జాబితాలో కాంగ్రెస్‌ సీఈసీ నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో మహబూబ్‌ నగర్‌ -చల్లా వంశీచందర్‌ రెడ్డి, మహబూబాబాద్‌ – బలరాం నాయక్‌, జహీరాబాద్‌- సురేశ్‌ షట్కర్‌, నల్లగొండ-కందూరు రఘువీర్‌ రెడ్డికి అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం వంశీ చందర్‌ రెడ్డి తన సీటును త్యాగం చేసి, ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అందులో భాగంగానే తనకు ఎంపీ సీటు ఇస్తామని సీఎం రేవంత్‌, పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చి, ఆ మాటను నిలుపుకుంది. ఇక నల్లగొండ నుంచి పార్టీ సీనియర్‌ నేత, జానా రెడ్డి తన కుమారుడికి సీటు దక్కించుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. గతంలో భారీ మెజార్టీతో గెలిచిన మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌ కు అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. బంజారా వర్గానికి చెందిన బలరాం నాయక్‌ 2009లో దాదాపు 69 వేల మెజార్టీతో గెలుపొందారు. మారిన పరిస్థితుల కారణంగా 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఇక జహీరాబాద్‌ నుంచి మాజీ ఎంపీ సురేశ్‌ షట్కర్‌ తన సీటును కాపాడుకున్నారు. 15వ లోక్‌ సభకు ఆయన ప్రాతినిథ్యం వహించారు.
మార్చి 11న రెండో జాబితా
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై గురువారం భేటీ అయిన సీఈసీ దాదాపు ఆరు రాష్ట్రాలు, నార్త్‌ ఈస్ట్‌ స్టేట్స్‌కు చెందిన సుమారు 60 స్థానాలపై చర్చించింది. ఇందులో తెలంగాణ నుంచి సింహ భాగంగా తొమ్మిది నుంచి 11 సీట్ల పై చర్చ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే… చాలా చోట్ల పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ సింబల్‌ పై పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం, ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉండటం, పలు చోట్లు సీనియర్లు పోటీ పడుతోన్న కారణంగా మొదటి జాబితాలో పలు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌ లో పెట్టినట్టు తెలిసింది. గురువారం ప్రకటించిన నలుగురి అభ్యర్థుల్లో ఇద్దరు మాజీ ఎంపీలు, మరో ఇద్దరు పార్టీని నమ్ముకొని ఉన్నవారే కావడం గమనార్హం. 9-11 స్థానాల్లో నాలుగు నియోజక వర్గాలకు అభ్యర్థులు ఖరారు కాగా… మార్చి 11న విడుదల కానున్న రెండో జాబితాలో మరికొంత మంది పేర్లు ప్రకటించనున్నారు. ఇందులో ప్రధానంగా పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, మల్కాజ్‌ గిరి, చేవెళ్ల సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌, భువనగిరి, సికింద్రాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ నియోజక వర్గాలకు తుది జాబితాలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
రెండో జాబితాపై మున్షి, సీిఎం సుదీర్ఘ మంతనాలు
రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థుల కసరత్తుపై ఢిల్లీలో సీఎం ఎ. రేవంత్‌ రెడ్డి బిజీబిజీగా గడిపారు. సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన సీఎం రాత్రి హస్తినలోనే బస చేశారు. సీఈసీ భేటీ అనంతరం రాత్రి 9 గంటలకు తన క్వార్టర్స్‌ చేరుకున్న సీఎం అర్థరాత్రి వరకు పార్టీ కీలక నేతలతో చర్చలు జరిపారు. అలాగే శుక్రవారం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా మున్షితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, సీనియర్లు పోటీ పడుతోన్న స్థానాలపై అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో ఉండబోయే అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేసినట్టు సమాచారం. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి వాహనంలోనే దీపా మున్షి ఎయిర్‌ పోర్ట్‌కు వరకు వెళ్లారు. కాగా, సీఎం రేవంత్‌, దీపా మున్షిని నాగర్‌ కర్నూల్‌ సీటు ఆశిస్తోన్న మల్లు రవి సైతం భేటీ అయ్యారు.
దక్షిణాది టార్గెట్‌
కాంగ్రెస్‌ సీఈసీ భేటీలో కాంగ్రెస్‌ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎలాంటి వివాదాలు, పొత్తులకు ఇబ్బందులు కాకుండా… పార్టీ సీనియర్‌ నేతలు, పార్టీకి బద్దులుగా ఉండేవారికి అవకాశం కల్పించింది. అలాగే ప్రస్తుతం పార్టీకి ఆయువు పట్టుగా నిలిచిన రాష్ట్రాలపైనే ఫోకస్‌ పెట్టింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసినట్టు జాబితాను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ, దక్షిణాదిలో ఆశించిన ఫలితాలను సాధించడంలో అనేక పర్యాయాలు విఫలమైంది. బీజేపీ వ్యూహాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా… మొదటి జాబితాలో పార్టీకి బలమున్న తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, కర్నాటక, కేరళపై ఫోకస్‌ చేసింది. కేరళ నుంచి 16, కర్ణాటక నుంచి 7, చత్తీస్‌గఢ్‌ నుంచి 6, తెలంగాణ నుంచి 4, లక్ష్య దీప్‌ నుంచి 1, నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాలైన మేఘాలయ నుంచి 2, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర నుంచి ఒక్కో స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణ అభ్యర్థులు వీరే
మహబూబ్‌ నగర్‌ – చల్లా వంశీచందర్‌ రెడ్డి
మహబూబాబాద్‌ – బలరాం నాయక్‌
జహీరా బాద్‌ – సురేశ్‌ షట్కర్‌
నల్లగొండ -కుందూరు రఘువీర్‌ రెడ్డి
మొదటి జాబితాలో ముఖ్యనేతలు
వయనాడు – రాహుల్‌ గాంధీ (కేరళ)
అళప్పుజ – కేసీ.వేణుగోపాల్‌( కేరళ)
తిరువనంతపురం -శశిథరూర్‌(కేరళ)
ఎర్నాకుళం – హిబి ఇడెన్‌ (కేరళ)
బెంగళూరు(రూరల్‌) -డి కె సురేశ్‌ (కర్నాటక)
రాజ్‌ నందగావ్‌ – భపేశ్‌ బఘేల్‌ (ఛత్తీస్‌గడ్‌ మాజీ సీఎం)

Spread the love