Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయందేశంలో 78 శాతానికి రుతుపవనాల లోటు

దేశంలో 78 శాతానికి రుతుపవనాల లోటు

- Advertisement -

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ అనుకున్న స్థాయిలో అవి విస్తరించలేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలోని 78శాతం భౌగోళిక ప్రాంతంలో రుతుపవనాల లోటు ఉందని, ఆయా ప్రాంతాల్లో ఇంకా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైనట్టు పేర్కొంది. ఈ లోటును ఐఎండీ రెండు వర్గాలుగా వర్గీకరించింది. అందులో 64 శాతం సాధారణ లోటు కేటగిరీలో ఉండగా, మరో 14 శాతం భారీ లోటుగా స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి జులై వరకు కొనసాగితే ఖరీఫ్ సాగు, జలాశయాల మట్టాలు, నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది. వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గానే కదులుతున్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే వారంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడా గాలి వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు చేరవచ్చని తెలిపింది. జులై 6 వరకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే కొద్ది రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖాండ్‌ , బీహార్, ఉ‌త్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఆగ్నేయ రాజస్తా న్‌లోని మిగిలిన ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

ఇలానే కొనసాగితే ఇబ్బందులే
రుతుపవనాలు స్థిరంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ముఖ్యంగా ఖరీఫ్ విత్తనాలు నాటే కాలం కొనసాగుతున్నందున, ఈ వర్షపాత లోటు నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఇది జులై వరకు కొనసాగితే మరింత ఆందోళనకరమని పర్యావరణవేత్త రాజేష్ పాల్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలం పాటు వర్షపాత లోటు కొనసాగితే ఖరీఫ్ పంటల విత్తనాలు నాటడం ఆలస్యం కావచ్చని, ఫలితంగా విత్తనాల మొలకశక్తిపై ప్రభావం పడవచ్చని అన్నారు. దీంతో నేలలో తేమ తగ్గి, రైతులు నీటిపారుదలపై మరింత ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. అయితే, భారతదేశపు రుతుపవన వర్షపాతంలో అధిక భాగం జులై, ఆగస్టు నెలల్లోనే కురుస్తుందని, మొత్తం రుతుపవనాల పనితీరు ఈ కీలకమైన నెలల్లోని వర్షపాతంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారాయని, రాబోయే వారంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఓఎండీ) తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్నా టక, కేరళ, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో విస్తారంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, ఢిల్లీ ఇంకా నైరుతి రుతుపవనాల పూర్తి రాక కోసం ఎదురుచూస్తోంది. గత కొన్ని రోజులుగా రాజధానిలో అక్కడక్కడా మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి.

దక్షిణ భారతదేశంలో చురుకుగా రుతుపవనాలు
ఈ వారం దక్షిణ భారతదేశం అంతటా చురుకైన రుతుపవన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కేరళం, తెలంగాణ, కోస్తా కర్నాటక, ఉత్తర కర్నాటక, దక్షిణ కర్నా టక, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇంకా చాలా దక్షిణ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లో కర్నా టక, దాని పరిసర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని, అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, భారీ, ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇండ్లలోనే ఉండాలని ఐఎండీ సూచించింది. నీటితో నిండిన రోడ్లు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, నదులు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని నివాసితులను కోరారు. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -