గృహ అమ్మకాల్లో 6 శాతం పతనం
2023 జనవరి తర్వాత అత్యంత కనిష్ట స్థాయి..
అన్‌రాక్ రీసెర్చ్ రిపోర్ట్
ముంబయి : ప్రజల కొనుగోలు శక్తి, దేశ ఆర్థిక ప్రగతిలో కీలక సూచీగా భావించే గృహాల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. డిమాండ్ లేకపోవడంతో ఇప్పటికే నిర్మించిన ఇళ్లు, అపార్టుమెంట్‌లలో ఫ్లాట్లు, విల్లాల నిల్వలు పేరుకుపోవడంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం చోటు చేసుకుంది. ఐటి రంగంలో అనిశ్చితితో ఉద్యోగాల కల్పన అమాంతం తగ్గిపోవడం, ఉన్న ఉద్యోగాలు పోవడానికి తోడు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అంతరాయాలు గృహ అమ్మకాలను దెబ్బతీశాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అన్‌రాక్ రీసెర్చ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా జరిగిన గృహాల విక్రయాలు 2023 జనవరి నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయని వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ప్రస్తుత ఏప్రిల్-జూన్ కాలంలోమొత్తం 90,715 నివాస యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదయిన 96,285 యూనిట్లతో పోలిస్తే ఇది 6 శాతం తక్కువ కావడం ఆందోళకరం.
మార్చితో ముగిసిన త్రైమాసికంలోని 1.02 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోల్చితే ఏకంగా 11 శాతం క్షీణించాయి. మార్కెట్లో డిమాండ్ బలహీనపడటంతో డెవలపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆచితూచి అడుగులు వేయాలని బిల్డర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి త్రైమాసికంతో పోల్చితే జూన్ త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టులు 16 శాతం తగ్గాయి. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు నగరాలు కలిసి మొత్తం విక్రయాల్లో 48 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే కోల్‌కతాలో 10 శాతం, హైదరాబాద్‌లో 2 శాతం, బెంగళూరులో 1 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. మరోవైపు పుణెలో అత్యధికంగా 15 శాతం విక్రయాలు తగ్గాయి. 2026 మార్చి త్రైమాసికంలోని అమ్మకాలతో పోల్చితే అన్ని నగరాల్లోనూ విక్రయాలు క్షీణించాయి.
10 శాతం పెరిగిన నిల్వలు..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న గృహాల అమ్ముడుపోని నిల్వలు (ఇన్వెంటరీ) ఏడాదికేడాదితో పోల్చితే 10 శాతం పెరిగి 6.16 లక్షల యూనిట్లను దాటింది. బెంగళూరులో గృహాల ఇన్వెంటరీ అత్యధికంగా 34 శాతం పెరిగింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లలో ఇన్వెంటరీ స్థాయిలు పెరిగాయి. మరోవైపు ధరలు ఎగిశాయి. ఎన్‌సిఆర్ పరిధిలో ధరలు 13 శాతం, బెంగళూరులో 8 శాతం చొప్పున పెరిగాయి. ఏడు నగరాల్లో ధరల పెరుగుదల కేవలం 1 శాతానికే పరిమితమై మందకొడిగా సాగుతోంది. ‘పశ్చిమాసియా యుద్ధ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ప్రీమియం హౌసింగ్, ఐటి రంగం బలంగా ఉన్న నగరాల్లో డిమాండ్ కొంత మేరకు స్థిరంగా ఉంది. యుద్ధ పరిస్థితులు, ఐటి రంగంలో ఎఐ సంబంధిత అనిశ్చితి కారణంగా చాలా మంది కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.’ అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా రియాల్టీ మందగమనం
- Advertisement -
- Advertisement -



