పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
ఇంధన ధరల పెంపును ఖండించిన సీపీఐ(ఎం)
కేంద్రం తీరుపై ఆగ్రహం.. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపు
కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రోల్, డీజీల్, సీఎన్‌జీ ధరలు పెంచడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వేతనాల్లో పెరుగుదల లేకపోవడం, లోతైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలపై ఇది మరింత భారాన్ని మోపుతుందని పేర్కొంది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం… పెట్రోల్, డీజీల్‌పై లీటరుకు రూ.3, సీఎన్‌జీపై కిలోకు రూ.2 మేర ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. ఇప్పటికే దేశప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిలకడ లేని వేతనాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ‘అండర్ రికవరీ’లు ఎదుర్కొంటున్నామని చెప్తున్న వివరణను సీపీఐ(ఎం) తప్పుదారి పట్టించే వాదనగా అభివర్ణించింది. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఇవే కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయని గుర్తు చేసింది.
‘అండర్ రికవరీ’ అనే పదం అసలు నష్టాలను సూచించదని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన సమయంలో ప్రజలకు ఆ లాభాలను అందించకుండా కేంద్రం భారీ ఆదాయాన్ని సంపాదించిందని సీపీఐ(ఎం) ఆరోపించింది. ఇప్పుడు అంతర్జాతీయ ధరల్లో మార్పులు వచ్చిన వెంటనే ఆ భారాన్ని సామాన్య ప్రజలపై మోపుతున్నదని విమర్శించింది. ఇంధన ధరల పెంపు ప్రభావం రవాణా రంగానికే పరిమితం కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. నిత్యవసర వస్తువులు, వ్యవసాయ అవసరాలు, ప్రాథమిక సేవల ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రత్యేకించి సీఎన్‌జీ ధరల పెంపు ఆటో డ్రైవర్లు, రవాణా కార్మికులు, తక్కువ ఖర్చుతో ప్రజారవాణాపై ఆధారపడే లక్షలాది మందిపై నేరుగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా ఈ ధరల పెంపు ప్రకటనను ప్రభుత్వం ఆలస్యం చేసిందని కూడా ఆరోపించింది. పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పెంచిన ఇంధన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగాలన్ని పార్టీ తన అన్ని యూనిట్లకు పిలుపునిచ్చింది.



