దేశంలో వేడి తీవ్రతపై కేంద్రంలో చలనం

– రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
– యూపీలో 64 మంది మృతి, 450 మంది ఆసుపత్రిలో చేరిక
న్యూఢిల్లీ : దేశంలోని అనేక రాష్ట్రాల్లో వేడి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. పలు రాష్ట్రాల్లో ఉన్న వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్‌ అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. వేడి తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐఎండీ విభాగానికి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం తీవ్రంగా వేడి ప్రభావితమైన రాష్ట్రాలను సందర్శిస్తుందని మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. వేడి గాలులు, వాతావరణ పరిస్థితుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలను సూచించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)ను కూడా ఆదేశించినట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు. వేడి తీవ్రత ప్రభావం సాధారణ ప్రజలపై చూపకుండా ఉండేందుకు తగిన సూచనలు, సలహాలు చెప్పాలని ఐసీఎంఆర్‌ను కేంద్రం కోరింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, విదర్భ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనున్నది. రానున్న కొన్ని రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతవారణ శాఖ అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులు, వాతావరణ పరిస్థితి కారణంగా మరణాలు నమోదు కావడంతో కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గడిచిన నాలుగు రోజుల్లో దాదాపు 64 మంది వేడి తీవ్రతతో మృతిచెందారు. మరో 450 మంది ఆస్పత్రిలో చేరారు. బీహార్‌లో 44 మంది మృతిచెందారు.

Spread the love