నోరూరించే…

mouthwateringవేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడివైపే. మామిడికాయలు తినకుండా వేసవి సీజన్‌ ముగియదు. పచ్చిమామిడితో చేసే అనేక రకాల వంటకాలు ఆహార ప్రియులను నోరూరిస్తూనే ఉంటాయి. మామిడితో రకరకాల నిల్వ పచ్చళ్లు తయారు చేస్తారు. పచ్చళ్లు, పప్పే కాకుండా మామిడి కాయతో చేసే రకరకాల వంటల పరిచయం మీ కోసం…
పులిహోర
కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, సగం కప్పు పచ్చి మామిడికాయ తురుము, పావు కప్పు కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, సగం స్పూను మిరియాలు, నాలుగు పచ్చి మిర్చి, నాలుగు ఎండు మిర్చి, సగం స్పూను ఆవాలు, ఒక స్పూన్‌ మినపప్పు, ఒక టేబుల్‌ స్పూను శనగపప్పు, పావు స్పూను పసుపు, రెండు టేబుల్‌ స్పూన్ల జీడిపప్పు, పావు కప్పు పల్లీలు, రెండు కరివేపాకు రెబ్బలు, తాలింపుకు సరిపడా నూనె.
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి స్టవ్‌ మీద పెట్టి పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మిరియాలు, మినపప్పు, జీడిపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, మామిడి తురుము, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని అన్నం పైన వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ, కొబ్బరి పులిహోర రెడీ.
చట్నీ :
కావలసిన పదార్థాలు : మామిడికాయ- ఒకటి, మినపప్పు-ఒక చెంచా, శనగలు- ఒక స్పూన్‌, మెంతులు – పావు చెంచా, ఎండుమిర్చి – నాలుగు, పచ్చిమిర్చి – రెండు, ఆవాలు – ఒక స్పూన్‌, ఇంగువ కొంచెం, వెల్లుల్లి రెండు, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి తగ్గట్టుగా, జీలకర్ర కొద్దిగా.
తయారీ విధానం : స్టౌవ్‌ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో నూనె వేయాలి. తర్వాత శనగలు, మినపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు ఎండు మిర్చి వేసి వేయించాలి. కారంగా కావాలంటే నాలుగు పచ్చి మిర్చి కూడా వేసి వేయించుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్‌ తీసుకుని అందులో వేయించిన మసాలాలు, జీలకర్ర, వెల్లుల్లి, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద బాండీపెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దాని తర్వాత మిక్సీ పట్టుకున్న పదార్థాలు వేయాలి. కాసేపు వేయించాలి. రుచికరమైన మామిడికాయ చట్నీ సిద్ధంగా ఉంది.
మ్యాంగో వడ
కావలసిన పదార్థాలు : పచ్చి మామిడి తురుము – ఒక కప్పు, మినప్పిండి – రెండున్నర కప్పులు, క్యారెట్‌ తురుము – పావు కప్పు, శెనగపప్పు – రెండు టేబుల్‌ స్పూన్లు, పెరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి సరిపడ, ఉల్లి ముక్కలు – కొద్దిగా, జీలకర్ర, వాము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం : ముందుగా ఒక పాత్రలో మినప్పిండి, పచ్చి మామిడి తురుము, క్యారెట్‌ తురుము, పెరుగు, కారం, గరం మసాలా, చాట్‌ మసాలా, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, వాము, నువ్వులు వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కలుపుకుని.. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో వడల్లా వేసుకుని వేయించాలి. వాటిని సాస్‌లో లేదా చట్నీతో తినొచ్చు లేదా పెరుగులో నానబెట్టుకుని ఆవడల్లా తిన్నా బాగుంటాయి.
షరబత్‌
కావాల్సిన పదార్ధాలు: పచ్చి మామిడి కాయ ఒకటి, పుదీనా -టేస్ట్‌కు సరిపడా, చక్కెర – ఒక కప్పు, నల్ల ఉప్పు -ఒక స్పూన్‌, వేయించిన జీలకర్ర పొడి -ఒక టేబుల్‌ స్పూన్‌, మిరియాల పొడి -అర స్పూను, ఉప్పు -రుచికి సరిపడా, ఐస్‌ స్క్యూబ్స్‌ – మూడు, నీరు- 2 లీటర్లు
తయారీ విధానం: ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకుని శుభ్రం చేసుకోవాలి.. తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పుదీనా ఆకులను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వేలిగించి.. పాన్‌ పెట్టి.. మామిడి ముక్కలను వేసుకుని కొంచెం సేపు మరిగించాలి. అనంతరం పంచదార, ఉప్పు, నల్ల ఉప్పు, మిరియాలు, వేయించిన జీలకర్ర పొడి వేసి.. పుదీనా ఆకులూ వేసుకుని చిన్నమంటలో 20 నిమిషాలు మరిగించాలి. తర్వాత స్టౌ మీద నుంచి దించి.. మామిడి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని.. మిక్సీలో వేసి.. గ్రైండ్‌ చేయాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. దాదాపు 15 రోజులు నిల్వ ఉంటుంది. తాగే ముందు.. ఒక గ్లాసులో తయారు చేసుకున్న మామిడి సిరప్‌, ఐస్‌ క్యూబ్స్‌, కొన్ని పుదీనా ఆకులు వేసుకుని తగినంత నీరు కలుపుకోవాలి. అంతే పుల్లపుల్లని టేస్టీ టేస్టీ మామిడి షరబత్‌ రెడీ.. ఇది చల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది.
మ్యాంగో చికెన్‌ కర్రీ..!
కావలసిన పదార్థాలు: చికెన్‌ 500 గ్రాములు, ఉల్లిగడ్డలు – రెండు, మామిడి కాయ – ఒకటి (తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్‌ రెండు స్పూన్లు, లవంగాలు కొద్దిగా, పచ్చిమిర్చి నాలుగైదు, ఎండు మిర్చి – నాలుగైదు, పసుపు – ఒకస్పూను, కారం – ఒక స్పూను, గరం మసాలా పొడి -రెండు స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు.
తయారీ విధానం : వెల్లుల్లి, అల్లం, పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు కలిపి పేస్ట్‌ను తయారు చేయండి. మీరు బ్లెండర్‌ని ఉపయోగించవచ్చు లేదా చేతితో రోలులో రుబ్బుకోవచ్చు. తర్వాత చికెన్‌ను ఈ పేస్ట్‌తో మెరినేట్‌ చేసి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి అందులో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఇది మంచి వాసన, కొద్దిగా గోధుమ రంగులోకి వచ్చాక అందులో మారినేట్‌ చేసి పెట్టుకున్న చికెన్‌ వేసి ఉండికించుకోవాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి చికెన్‌ బాగా ఉడికాక.. తరిగిన మామిడికాయ ముక్కలను వేయాలి. మూతపెట్టి చిన్న మంట మీద 8-10 నిమిషాలు ఉడికించాలి. మామిడికాయ, చికెన్‌ కర్రీ రడీ.

Spread the love