– మార్చి 23,24 తేదీల్లో రాష్ట్ర సదస్సు
– ఈ నెల 21-28 వరకు ఎన్పీఆర్డీ వార్షికోత్సవ వారోత్సవాలు
– వాడవాడల్లో జెండా ఆవిష్కరణలు, రక్తదాన శిబిరాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా వికలాంగుల సాధికారత, విద్యా, స్వయం ఉపాధి, ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య తెలిపారు. మార్చి 23,24తేదీల్లో హైదరాబాద్ లో మహిళా వికలాంగుల తొలి సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యక్షలు జెర్కొని రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ మహిళా వికలాంగుల స్థితిగతులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంఘాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో 1975 నుంచి ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. మహిళలు, మహిళా వికలాంగులపై వేధింపులు, లైంగిక దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్న అంశాలను అమలు చేయటం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది మహిళా వికలాంగులున్నారని తెలిపారు. ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందం పత్రంలోని ఆర్టికల్ 3,6లలో మహిళా వికలాంగుల హక్కులు పొందుపరచినా అమలు కావటం లేదని పేర్కొన్నారు. మహిళా వికలాంగుల్లో వివాహం కానీ వారి సంఖ్య సాధారణ మహిళలతో పోల్చితే నాలుగు రెట్లు అధికంగా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతి అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని గుర్తు చేశారు. మహిళా మానసిక వికలాంగులు 70శాతం లైంగిక దూరక్రమణకు గురవుతున్నారన్నారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3(బి),(డి)మహిళా వికలాంగులు వినియోగించుకోవడం లేదని తెలిపారు. వారి హక్కులు, రక్షణ కోసం ఎన్పీఆర్డీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. మహిళా వికలాంగులపై వేధింపులు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశవారు. మహిళా వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. పెండ్లి కానీ మహిళా వికలాంగులకు ప్రభుత్వమే హోమ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ ఏర్పడి 14ఏండ్లు పూర్తి అవుతున్న సందర్బంగా ఈ నెల 21నుంచి 28వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ నెల 21న అన్ని వాడల్లో సంఘం జెండాలు ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్త దాన శిబిరాలు, పండ్ల పంపిణి వంటి సేవా కార్యక్రమలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షలు బి స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పి బాలేశ్వర్, జె దశరథ్, వి ఉపేందర్, రాష్ట్ర కమిటి సభ్యులు కె లలిత, ఎ భుజంగరెడ్డి, ఎ లింగయ్య, ఎ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.