ఆహార భద్రత,ఉపాధికి ఉద్యమం

Movement for food security and employment– నిరుద్యోగాన్ని పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే
అమరావతి : ఆహార భద్రత, పట్టణ ఉపాధి హామీ చట్టం కోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, జగన్‌ ప్రభుత్వాలు ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగంలోని లక్షలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మూడు రోజులపాటు జరిగిన ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసంఘటిత రంగంలో మహిళలు పెరుగుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో కోతలు పెడుతోందని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో పది కోట్ల జాబ్‌ కార్డులు తగ్గిపోయాయని చెప్పారు. ప్రభుత్వం జాబ్‌ కార్డులను డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫారంతో లింక్‌ చేస్తోందని, అయితే, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సరిగ్గా పనిచేయని విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ప్రభుత్వం ‘ఉపాధి’ బడ్జెట్‌ను తగ్గించి గ్రామీణ భారతదేశంలో ఏదో ఒక రకమైన పనిని పొందే హక్కును కూడా ప్రజలకు లేకుండా చేస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందని మోడీ గొప్పలు చెబుతున్నా, వాస్తవం దానికి భిన్నంగా ఉందన్నారు. దేశంలో తలసరి ఆదాయం అత్యల్పంగా ఉందని తెలిపారు. తలసరి ఆదాయంలో ప్రపంచంలో మన దేశం 142వ స్థానంలో ఉందని వివరించారు. గ్రాడ్యుయేట్లలో దాదాపు 50 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రయివేటీకరణ కారణంగా అనేకమంది ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు జరుగుతున్న కుట్రలను ఖండించారు.
మహిళల్లో రక్తహీనత
ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో మహిళలు రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని మరియం థావలే తెలిపారు. దేశంలో రక్తహీనత పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) తెలిపిందని గుర్తు చేశారు. ఆ సర్వే నివేదిక ఇచ్చినందుకు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ డైరెక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేయడమే కాకుండా సర్వే రిపోర్టు ఇవ్వడం ఆపివేయాలని నిర్ణయించడం శోచనీయమన్నారు. నిజాలు ఎవరికీ తెలియరాదనే ఆ పని చేసిందని విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, ఏపీలో 14 రకాల నిత్యావసర వస్తువులను చౌకధర దుకాణాల ద్వారా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం రేషన్‌ షాపుల్లో ఐదు కేజీల బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకులను 2024 ఎన్నికల్లో ఓడించకపోతే సాధారణ ప్రజలు నష్టపోతారని తెలిపారు. మీడియా సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు పికె.శ్రీమతి, కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి, విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి పాల్గొన్నారు.

Spread the love