కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్‌ సామగ్రి తరలింపు

నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
నియోజకవర్గంలోని పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని సెక్టార్లవారీగా సంబంధిత పోలింగ్‌ స్టేషన్లకు భద్రత నడుమ సిబ్బందిని తరలించడం జరిగిందని 119-భద్రాచలం ఎస్‌టీ నియోజకవర్గం అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి/ఆర్డీవో దామోదర్‌ రావు అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన సామగి సెక్టర్ల వారీగా పోలీసు బందోబస్తుతో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సోమవారం జరిగే ఎంపీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మారుమూల మండలాల చర్ల, దుమ్ముగూడెం సెక్టార్లకు సంబంధించిన పోలింగ్‌ స్టేషన్లకు ప్రత్యేక పోలీస్‌, సిఆర్పిఎఫ్‌ బలగాల సెక్యూరిటీతో ముందుగా పంపించడం జరిగిందని అన్నారు. ప్రతి సెక్టార్‌ రూటులవారీగా పోలింగ్‌ స్టేషన్లను బట్టి సిబ్బందిని చేరవేయడానికి బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, 176 పోలింగ్‌ స్టేషన్లకు గాను 25 మంది సెక్టర్‌ అధికారులు, 120 మంది మైక్రో అబ్జర్వర్లు, ప్రతి పోలింగ్‌ స్టేషన్కు పీఓలు, ఏపీవోలు, ఓపిఓలు, రిజర్వుగా పోలింగ్‌ సిబ్బందితో 844 మందిని నియమించినట్టు తెలిపారు. ఎన్నికల విధులకు వెళ్లే పోలింగ్‌ స్టేషన్లకు ఎండాకాలంను దృష్టిలో పెట్టుకొని గ్లూకోస్‌, డిపాకెట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు పంపిణీ చేసినట్టు తెలిపారు. అలాగే పోలింగ్‌ స్టేషన్లలో కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని, పోలింగ్‌ స్టేషన్లలో నియమించబడ్డ సిబ్బందికి ముందుగా పోలింగ్‌ మెటీరియల్‌ ఇవ్వడం జరిగిందని, వారు సామగ్రి సరిచూసుకున్న అనంతరం రాజకీయ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడం(స్ట్రాంగ్‌ రూమ్‌) సిల్‌ తీసి ఈవీఎం మిషన్లను పోలింగ్‌ సిబ్బందికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్లో పోలింగ్‌ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, సంబంధిత పోలింగ్‌ సిబ్బంది వారి వారి పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్న తర్వాత నేడు జరిగే ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సాయంత్రం వరకు పూర్తి చేసుకోవాలని, 13వ తేదీ ఉదయం 5:30 గంటలకు పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో మార్క్‌ ఫోల్‌ నిర్వహించాలని, అనంతరం సెక్టరల్‌ ఆఫీసర్ల సమక్షంలో ఈవీఎం మిషన్‌ సిల్‌ వేసి ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలని సాయంత్రం పోలింగ్‌ అయిపోయే సమయంలో ఓటర్లు గనక ఉంటే ప్రత్యేకంగా తయారు చేసిన స్లిప్పులను అందించి ఓటింగ్‌ ప్రక్రియ అయిపోగానే సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకొని భద్రత నడుమ సెక్టర్‌ ఆఫీసర్ల సమక్షంలో తిరిగి తీసుకురావాలని అన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఏ చిన్న సమస్య వచ్చినా సొంతంగా నిర్ణయం తీసుకోవద్దని, ఏ సమస్య ఉన్న సంబంధిత సెక్టరల్‌ అధికారికి, ఏఆర్‌ఓకి తెలియజేయాలని అన్నారు. పోలింగ్‌ ఏజెంట్ల ద్వారా టెండర్‌ ఓటు, ఛాలెంజ్‌ ఓటు గురించి సమస్య వస్తే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో పోలింగ్‌ స్టేషన్లలో సిగలింగ్‌ వ్యవస్థ సరిగా లేని దగ్గర ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రతి రెండు గంటలకు ఒకసారి అన్ని పోలింగ్‌ స్టేషన్ల నుండి సంబంధిత సెక్టరల్‌ అధికారులు, పురుషులు, స్త్రీలు వేరువేరుగా పోలింగ్‌ సరళినీ తప్పనిసరిగా ఏఆర్‌ఓకి తెలియజేయాలని అన్నారు. సెక్టరల్‌ అధికారుల నుండి మొదలుకొని పీఓలు, ఏపీవోలు, ఓపీఓలు, పోలింగ్‌ స్టేషన్లో వివిధ పనులకు నియమించిన సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉండి పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, నయాబ్‌ తహసీల్దార్‌ ఎలక్షన్‌ మహీధర్‌, రెవెన్యూ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love