అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు
అథ్లెటిక్స్ స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు
క్రీడా రంగంలో ములుగు జిల్లా సత్తా చాటుతుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ములుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. క్రీడాకారుల కోసం అథ్లెటిక్స్ స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. బుధవారం ములుగు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, భారత ఒలింపిక్ సంఘం, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, కలెక్టర్‌తో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ములుగు జిల్లా మారుమూల ప్రాంతం అయినప్పటికీ క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందన్నారు. జిల్లాకు చెందిన అనేక మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి దేశ విదేశాల్లో ములుగు ఖ్యాతిని చాటుతున్నారని తెలిపారు. పేదరికం, వెనుకబడిన పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలోని పిల్లల్లో ఉన్న ప్రతిభ అపారమని, వాలీబాల్, ఆర్చరీ వంటి క్రీడల్లో ములుగు జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన చరిత్ర ఉందన్నారు. క్రికెట్ సహా ఇతర క్రీడల్లో కూడా విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అథ్లెటిక్స్ స్టేడియం ఏర్పాటు కోసం వచ్చిన ప్రతిపాదన మేరకు రూ.4 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయించామని, భవిష్యత్తులో అవసరమైన అదనపు సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు శారీరకంగా ధృడంగా ఉండటంతో పాటు క్రీడలపై పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బానోతు రవిచందర్, డీఈవో సిద్ధార్థరెడ్డి, డీఎస్పీ రవీందర్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పగడాల వెంకటేశ్వరరెడ్డి, పీడీలు, పీఈటీలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడా రంగంలో ములుగు జిల్లా సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



