నా కుమార్తె కమ్యూనిస్ట్‌గా మారింది

– తనతో విభేదాలు బాదిస్తున్నాయి
– ధనవంతులపై ఆమెకు కోసం : ఎలన్‌ మస్క్‌ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుల్లో ఒక్కరైన టెస్లా, ట్విట్టర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ తన కూతురు ఏకంగా సోషలిస్ట్‌ నుంచి కమ్యూనిస్ట్‌గా మారిపోయిందన్నారు. మస్క్‌ కుమారుడు జేవియర్‌ పుట్టుకతో పురుషుడిగా పుట్టినప్పటికీ.. 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయిగా తన లింగాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత తనకు తండ్రి ఎలన్‌ మస్క్‌తో ఎలాంటి సంబంధం ఉండకూడదని చట్టపరంగా తన పేరును కూడా మార్చకుంది. గతేడాది తన తండ్రితో కానీ, ఆయన ఆస్తితో కానీ తనకు సంబంధం లేకుండా తన పేరు మార్చుకోవడానికి అనుమతినివ్వాలని కోర్టుకెక్కింది. మస్క్‌ కూతురు తన అసలు పేరు జేవియర్‌ అలెగ్జాండర్‌ మస్క్‌ తీసేసి వివియన్‌గా మార్చుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె మస్క్‌కు దూరంగా ఉంటోంది. ఈ పరిణామాలు తనను ఎంతో భాధించాయని ఎలన్‌ మస్క్‌ తాజాగా తన జీవిత చరిత్ర ఆధారంగా రాసుకున్న వాల్టర్‌ ఐసాక్సన్‌ పుస్తకంలో వెల్లడించారని తెలుస్తోంది. ఆ పుస్తకం సెప్టెంబర్‌ 12న విడుదల కానున్నప్పటికీ.. అందులోని ఓ సారాంశాన్ని ‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ వార్త సంస్థ తాజాగా ప్రచురించింది. ”నా కుమార్తె సోషలిజం నుంచి పూర్తిగా కమ్యూనిజం వైపు మళ్లింది. తను ధనవంతులు చెడ్డవారని భావించే స్థితికి చేరుకుంది. కన్నబిడ్డతో విబేధాలు నన్నెంతో బాధించాయి. కూతురితో సఖ్యత కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తను నాతో ఉండేందుకు అంగీకరించలేదు. నా మొదటి కుమార్తె మరణం కంటే జెన్నాతో విభేదాలే నన్ను ఎక్కువ బాధించాయి. నాకు ఇంతగా వేదన మిగిల్చింది మరొకటి లేదు. ఆమె అలా మారడానికి తను చదువుకున్న పాఠశాలనే కారణం. తిరిగి ఆమెతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. కానీ ఆమె నాతో కాస్త సమయం కూడా గడపడానికి ఇష్టపడలేదు.” అని ఎలన్‌ మస్క్‌ తన పుస్తకంలో రాసుకున్నారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది.

Spread the love