నాడు అచ్ఛేదిన్‌.. నేడు..?

నాడు అచ్ఛేదిన్‌.. నేడు..?– ప్రతిపక్ష దూషణే కాషాయపార్టీ టార్గెట్‌
– మోడీ ప్రసంగాలకు ప్రజల నుంచి లభించని స్పందన
– పూటకోమాటతో సర్వత్రా విమర్శలు
– దిక్కుతోచని స్థితిలో మోడీ బృందం
– భయంతో 2047 అంటూ కొత్త పల్లవి
– ఆరు విడతలైనా ‘థీమ్‌’ దొరకక బీజేపీ సతమతం
లోక్‌సభ ఎన్నికలు ముగింపుకొచ్చాయి. ఏడు దశల్లో కేవలం చివరి దశ మాత్రమే మిగిలి ఉన్నది. ఒకపక్క కాంగ్రెస్‌కు రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ల పరంపర కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. కానీ బీజేపీకి మాత్రం సరైన ‘థీమ్‌’ దొరకలేదు. ప్రధాని మోడీ ‘సబ్‌కా సాథ్‌-సబ్‌కా వికాస్‌’ నినాదం ఎత్తుకోగానే ప్రతిపక్షాలు, ప్రజల నుంచి రాకెట్‌ స్పీడ్‌తో వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కరువై, సహనం నశించి తిట్ల దండకాన్ని ఎత్తుకుంటున్నారు. హిందూత్వ, పాకిస్థాన్‌, చైనా, దేశభక్తి వంటి అంశాలు ప్రస్తావిస్తే… ముందు దేశ ప్రజలకు మీరేం మేలు చేశారో చెప్పండంటూ నిలదీతలు ఎక్కువయ్యాయి. దీనితో మోడీ-మోడీ భజనపరుల నోళ్లు మూతపడి కిం…కర్తవ్యం అనే డైలమాలో పడ్డారు.
న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఆరు దశలు ముగిశాయి. ఇక చివరి దశ మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆయా పార్టీలు ఏడో దశలో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్‌, బీజేపీలు తమ మ్యానిఫెస్టోలను విడుదల చేసి ఎన్నికల రణక్షేత్రంలో తలపడుతున్నాయి. సాధారణంగా, ప్రతిపక్షానికి ఎన్నికల ప్రచారమనేది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే అవుతుంది. కాబట్టి కాంగ్రెస్‌ అదే దారిలో పయనిస్తూ బీజేపీ వైఫల్యాలను ఎండగడుతు న్నది. గత పదేండ్లలో కేంద్రంలోని మోడీ పాలనలో దేశం తిరోగమనంలోకి వెళ్లిందనీ, అనేక వివాదాస్పద నిర్ణయాలు అమలులోకి వచ్చాయని హస్తం పార్టీ ఆరోపిస్తున్నది. ఒక విధంగా చూసుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఒక అడుగు ముందే ఉన్నదనీ, ప్రజల్లో ఉంటూ తీవ్రంగా ప్రచారం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదేండ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ.. తన పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి, కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, మోడీ వాటిని పక్కనపెట్టేసి..ఇండియా ఫోరంను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. పాకిస్తాన్‌లో పార్థనలు చేస్తున్నారనో..ముజ్రాలు చేస్తున్నారంటూ ప్రధాని హౌదాను మరిచి చేస్తున్న వ్యాఖ్యలు ఓటర్లలో స్పందన రావటంలేదు. దీనికి తోడు బీజేపీ పాలనలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 2014కు ముందు కేంద్రంలో అప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దానికి తోడు ‘అచ్ఛేదిన్‌’ అనే నినాదంతో ప్రధాని అభ్యర్థిగా మోడీ ప్రచారం చేశారు. అలాగే, ’56 అంగుళాల ఛాతీ, పాకిస్తాన్‌ – చైనా వంటి దేశాలను శత్రు దేశాలుగా చిత్రీకరించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా దాడి, ఆ తర్వాత బాలాకోట్‌పై భారత సైన్యంతో ఎదురుదాడి చేపించామని అప్పటి మోడీ సర్కారు తీవ్రంగా ప్రచారం కల్పించుకున్నది. ‘జాతీయ భద్రత’ అనే అంశం తెరపైకి వచ్చింది. దీనికి అధిక ప్రచారాన్ని కల్పించిన మోడీ సర్కారు.. ప్రజల్లో భావోద్వేగాన్ని రగిలించి కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.ఈసారి అలాంటి అవకాశాలేమీ లేకపోవడంతో ఏమి తోచని బీజేపీ.. ఎప్పటిలాగే కాంగ్రెస్‌పై ఎదురుదాడి, ఆ పార్టీలో గతంలో జరిగిన విషయాలను దేశానికి వ్యతిరేకంగా జరిగాయని చూపించటం, ‘మోడీ కీ గ్యారెంటీ’ అని చెప్పటంతోనే సరిపెట్టుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా, నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలో తీవ్రమైన తప్పులు చేశారని మోడీ ఎదురుదాడికి దిగుతున్నారని గుర్తు చేస్తున్నారు.
ప్రధాని స్థాయిలో పూటకోమాటతో మోడీ చెబుతున్న తీరుపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడు పదుల వయస్సు దాటాక… చెప్పిందే మర్చిపోయే గుణం వస్తుందని, ఇప్పుడు మోడీ మీట్‌ ది ప్రెస్‌లో అదే చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మోడీకి భయం పట్టుకున్నదనీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందేమోనన్న అనుమానంతోనే ఆయన టార్గెట్‌ ‘2047’ ను పెట్టుకున్నారని అంటున్నారు.

Spread the love