డెడ్‌ స్టోరేజీకి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు

Nagarjunasagar project for dead storage– ప్రస్తుత జలాశయం నీటిమట్టం 510.30 అడుగులు
– హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాపై తీవ్రప్రభావం
– ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకూ పొంచివున్న ముప్పు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న నాగార్జున సాగర్‌ జలాశయం ప్రమాదకర స్థితికి చేరింది. గతేడాది అనుకున్న స్థాయిలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో నాగార్జునసాగర్‌ జలాశయం కనిష్ట నీటిమట్టానికి చేరువలో ఉంది. ఆయకట్టు కింద ఖరీఫ్‌, రబీ సీజన్‌లో ప్రభుత్వం క్రాఫ్‌ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు వేసవి కాలం కావడంతో కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ జంట నగరాలు, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నెల 1వ తేదీ నుండి వారం రోజుల పాటు తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసింది. మరోవైపు ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేస్తున్నది. సాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజీకి చేరువలో ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌ అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పటికే శ్రీశైలం అడుగంటి పోయింది. ఈ లోపల వర్షాలు పడకుంటే రాబోయే మూడు నెలల పాటు తాగునీటి అవసరాలు ఎలా తీర్చాలనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
హైదరాబాద్‌ తాగునీటి సరఫరాపై తీవ్రప్రభావం
నాగార్జునసాగర్‌ జలాశయం శుక్రవారం సాయంత్రానికి కనిష్ట నీటిమట్టానికి చేరువలో ఉంది. సాగర్‌ జలాశయం గరిష్ట నీటిమట్టం 590.5050 అడుగులు కాగా కనిష్ట నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 510.30 అడుగులుగా ఉంది. దీంతో హైదరాబాద్‌కు తాగు నీటి విడుదలకు ఇబ్బందిగా మారనుంది. సాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డిప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్‌కు తాగునీటిని అందించడం వీలవుతుంది. తగ్గితే మాత్రం అక్కడి పంపులు నడపడం సాధ్యం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలకుగాను 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో 510 అడుగుల కంటే నీటిమట్టం తగ్గితే అది హైదరాబాద్‌ తాగునీటి సరఫరాపై తీవ్రప్రభావం చూపనుంది.

Spread the love