ఎన్‌ఎస్‌ఏటీ స్కాలస్టిక్‌ టెస్ట్‌ను ప్రకటించిన నారాయణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎన్‌ఎస్‌ఏటీ-2023) 18వ ఎడిషన్‌ను ప్రకటించింది. దేశంలోని ఏడు నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్‌ఎస్‌ఏటీ పరీక్షలో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి విలువైన బహుమతులను అందించడం దీని ఉద్దేశం. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్‌ఎస్‌ఏటీలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.కోటి కంటే ఎక్కువ నగదు అవార్డులను గెలిచే అవకాశముందని తెలిపారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 300లకుపైగా నగరాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ నిర్వహిస్తామని, విద్యార్థులు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చని వివరించారు. గతేడాది నిర్వహించిన పరీక్షలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ ఏడాది మూడు వేల పాఠశాలల విద్యార్థులకు చేరువవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు అనుకూలమైన, ఆహ్లాదరకమైన వాతావరణాన్ని కల్పిస్తామని వివరించారు. సమగ్ర సిలబస్‌తోపాటు సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యాన్ని పెంపొందిస్తామని తెలిపారు. వందశాతం స్కాలర్‌షిప్‌ అందుబాటులో ఉన్నందున ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

Spread the love