ఇంజినీరింగ్‌ ప్రిన్సిపాళ్ల విద్యార్హతలపై విచారణ చేపట్టాలి : డీవైఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంజినీరింగ్‌ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్ల విద్యార్హతలపై విచారణ చేపట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్‌ పరిధిలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా సరైన విద్యార్హత లేని వ్యక్తులను యాజమాన్యాలు ప్రిన్సిపాళ్లు గా నియమిస్తున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీలపై సమగ్ర విచారణ జరిపించి సంబంధిత కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏటా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ర్యాటిఫికేషన్‌ పేరుతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, యాజమాన్యాల పైరవీలకు తలొగ్గి అనుమతులిస్తున్నారని తెలిపారు. ఫలితంగా నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారని పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యాల బాధ్యతా రాహిత్యం మూలంగా విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో తనిఖీల సందర్భంగా ర్యాటిఫికేషన్‌ కోసం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే వాటిల్లో కేవలం పది మంది లోపు మాత్రమే అర్హతలు ఉన్నట్టు గుర్తిస్తున్నారని తెలిపారు. ఏఐసీటీఈ నిబంధన ప్రకారం 15 ఏండ్ల బోధనానుభవంతో పాటు పీహెచ్‌డీ కలిగి ఉంటేనే ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేసేందుకు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేరుమోపిన ఇంజినీరింగ్‌ కళాశాలలన్నీ ఏఐసీటీఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తూ నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Spread the love