Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడిపల్లి టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారి నిబంధనలు అమలు చేయాలి

మేడిపల్లి టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారి నిబంధనలు అమలు చేయాలి

- Advertisement -

– రహదారిపై అప్పాల భూమేష్ యాదవ్ వినూత్న నిరసన
నవతెలంగాణ – మల్హర్ రావు
: కాటారం మండల పరిధిలోని ఎన్‌హెచ్-353సి మేడిపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారుల నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేసి, ప్రయాణికులకు అవసరమైన అన్ని కనీస సౌకర్యాలను తక్షణమే కల్పించాలని స్థానిక యువ నాయకుడు అప్పాల భూమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టోల్‌ప్లాజా వద్ద తన కారును రోడ్డుకు అడ్డంగా నిలిపి ప్లకార్డుతో వినూత్న నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోల్ రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టోల్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. టోల్‌ప్లాజా వద్ద ఉచిత తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఫస్ట్‌ఎయిడ్ కేంద్రం, అత్యవసర అంబులెన్స్, క్రేన్, తగిన సిబ్బంది వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నప్పటికీ అవి అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

టోల్ కౌంటర్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోతుండటంతో పాటు, వంద మీటర్లకు మించి క్యూలు ఏర్పడినా అదనపు లేన్లు ప్రారంభించకపోవడం జాతీయ రహదారి నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో టోల్‌ప్లాజా వద్ద సైడ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరదనీరు సమీప గ్రామాల్లోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టోల్ వసూళ్లలో చూపుతున్న శ్రద్ధను రహదారి నిర్వహణ, డ్రైనేజీ నిర్మాణం, వర్షపు నీటి పారుదల, ప్రయాణికుల భద్రత వంటి అంశాల్లో కూడా చూపాలని డిమాండ్ చేశారు. టోల్ వసూలు చేస్తున్న రహదారులను నాణ్యంగా నిర్వహించడం, గుంతలను వెంటనే పూడ్చడం, ప్రయాణికుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టడం టోల్ యాజమాన్యం బాధ్యత అని స్పష్టం చేశారు. ఎన్‌హెచ్ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలు, ప్రజాసంఘాలతో కలిసి ‘టోల్ ఫ్రీ ఉద్యమం’ చేపట్టి టోల్ వసూళ్లను అడ్డుకుంటామని అప్పాల భూమేష్ యాదవ్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -