జులైౖ 4న దేశవ్యాప్త బంద్‌

Nationwide Bandh on 4th July– నీట్‌, యూజీసీ నెట్‌ పేపర్‌ లీకులకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్‌, యూజీసీ నెట్‌ పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ జులై 4న దేశవ్యాప్తంగా విద్యార్థులు బంద్‌ను పాటించాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్‌ బిస్వాస్‌ ప్రకటన విడుదల చేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో తన అసమర్థతను ప్రదర్శిం చిందని, తీవ్ర అవకతవకలు, వ్యత్యాసాలతో నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేసిందని తెలిపారు. జూన్‌ 4న ప్రకటించిన నీట్‌-యూజీ పరీక్ష ఫలితాలు పారదర్శకతకు విరుద్ధంగా ఉన్నాయని, పేపర్‌ లీక్‌ల ఫిర్యాదులు వెల్లువెత్తా యని పేర్కొన్నారు. దాని తరువాత లక్షలాది మంది విద్యార్థులు హాజరైన యూజీసీ నెట్‌ పరీక్షను పేపర్‌ లీక్‌ కారణంగా పరీక్ష తరువాత రద్దు చేశారని తెలిపారు. దీంతో వచ్చే వారంలో షెడ్యూల్‌ చేసే సీఎస్‌ఐఆర్‌ నెట్‌ను ఎన్టీఏ వాయిదా వేసిందని ఈ జాప్యంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొ న్నారు. అంతేకాక నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినే షన్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈ) నేరుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద కూడా పేపర్‌ లీకేజీలు, అక్రమాలకు సంబంధించిన ఎపీసోడ్‌ లను పేర్కొంటూ చివరి నిమిషంలో నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయిం చిందని పేర్కొన్నారు.
సీయూఈటీ, నీట్‌వంటి కేంద్రీకృత పరీక్షలు విద్యను ప్రయివేటీకరించడాన్ని, కోచింగ్‌ సెంటర్ల సంస్కృతిని పెంపొందించడాన్ని ప్రోత్సహిస్తున్నా యని, అట్టడుగు విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా చేసిందని, దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘వన్‌ నేషన్‌, వన్‌ ఎగ్జామ్‌’ అనే ముసుగులో మొత్తం పరీక్షా వ్యవస్థ కుప్పకూలిందని, విద్యార్థుల విద్యా భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని విమర్శించారు.
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) 25 మంది కంటే తక్కువ శాశ్వత సిబ్బందితో 25 పరీక్షలను నిర్వహిస్తుందని, అందువల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితిని గుర్తించకుండా, కొంత మంది వ్యక్తులపై నిందలు మోపడంతో కేంద్ర విద్యా శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్టీఏ, విద్యా మంత్రిత్వ శాఖ వైఫల్యానికి పూర్తిగా అసమర్థులని, అసమర్థులైన ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులతో పని చేయడమే ఇందుకు కారణమని చెప్పారు.
ఉన్నత విద్యలో మాత్రమే కాకుండా, పాఠశాల విద్య పరిస్థితి దారుణంగా ఉందని, బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ పాలనలో గత దశాబ్ద కాలంలో సంబంధిత శాఖలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గడం, ఉపాధ్యాయుల కొరత, స్థూల నమోదు నిష్పత్తి తగ్గాయని పేర్కొన్నారు. ”2018-19, 2021-22 మధ్య దేశంలో మొత్తం పాఠశాలల సంఖ్య 15,51,000 నుండి 14,89,115కి తగ్గాయి. 61,885 పాఠశాలలు మూసివేశారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుదల, మరోవైపు ప్రయివేట్‌ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. ఇది అట్టడుగు వర్గాలకు పెద్ద ప్రశ్నగా మారింది” అని తెలిపారు. ఈ పరిస్థితిలో దేశంలో విద్య, ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ జూలై 4న దేశవ్యాప్త బంద్‌ను నిర్వహించనుందని, విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తారని, ప్రతి రాష్ట్రం, దేశ రాజధానిలో మార్చ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ బంద్‌లో విద్యార్థి లోకం పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
డిమాండ్లు
1. ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలి
2. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.
3. ఇటీవల నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.
4. పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్‌ స్కోర్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి.
5. ఇప్పటికే ఉన్న అడ్మిషన్‌ విధానాలను కేంద్రీకృత ప్రవేశ పరీక్షలతో భర్తీ చేసే ప్రయత్నాల నుంచి ఉపసంహరించుకోవాలి.
6. టీఐఎస్‌ఎస్‌ ముంబయి, ఐఐటీ ముంబయి నుంచి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ వరకు – విద్యార్థి సంఘ నేతలపై వేట, యూనివర్శిటీల్లో స్వేచ్ఛా వ్యక్తీకరణ, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడాన్ని ఆపాలి.
7. పాఠశాలల మూసివేతను ఆపాలి.

Spread the love