ఎన్‌బీటీసీ నిర్దేశిత ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలి

– ధరల పట్టికను ప్రదర్శించాలి
– లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు
– రక్తనిధి కేంద్రాలకు డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ వార్నింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రక్తనిధి కేంద్రాలు (బ్లడ్‌ బ్యాంకులు) వివిధ రకాల సేవలకు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నట్టు తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ చేస్తున్న దాడుల్లో నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేస్తూ పట్టుబడుతున్న ఘటనలు వెలుగు చూశాయి. మరోవైపు నిర్దేశించిన ధరలపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని కూడా బ్లడ్‌ బ్యాంకులు దోపిడీకి అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌ రెడ్డి బ్లండ్‌ బ్యాంకులను హెచ్చరిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ ఫ్యూషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ బీటీసీ) వివిధ రకాల సేవలకు ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్లడ్‌ బ్యాంకులకు వేరు వేరుగా ప్రాసెసింగ్‌ ఛార్జీలను నిర్ణయించింది. ఉదాహరణకు ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త సరఫరాకు ప్రాసెసింగ్‌ ఛార్జెస్‌ కింద రూ.1,100గా నిర్ణయిస్తే, ప్రభుత్వేతర రక్తనిధి కేంద్రాల్లో దాని ధరను రూ.1,550గా నిర్ణయించారు. అదే రకంగా మిగిలిన సేవల విషయంలో కూడా ధరలను ఖరారు చేశారు.
వీరికి ఉచితం
తరచూ రక్తమార్పిడి అవసరమైన తలసేమియా, హిమోఫిలియా, సికిల్‌ సెల్‌ ఎనిమియా తదితర రోగులకు రక్తనిధి కేంద్రాలు ఉచితంగా బ్లడ్‌, బ్లడ్‌ కాంపొనెంట్స్‌ ను ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీరి నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయడానికి వీల్లేదు.
డిస్‌ ప్లే తప్పనిసరి
ఆయా బ్లడ్‌ బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఛార్జీల వివరాలతో కూడిన పట్టికను డిస్‌ ప్లేలో పెట్టాలి. బ్లడ్‌, బ్లడ్‌ కాంపొనెంట్స్‌ కొనుగోలుదారులకు ఆ పట్టిక స్పష్టంగా కనిపించేలా ఉండాలని ఔషధ నియంత్రణ మండలి స్పష్టం చేసింది.
చర్యలు తప్పవు
నిర్దేశించిన ఛార్జీల కన్నా అధికంగా వసూలు చేసినా, ధరల పట్టికను డిస్‌ ప్లేలో పెట్టకపోయినా చట్టపరమైన చర్యలు తప్పవని డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ కమలాసన్‌ రెడ్డి హెచ్చరించారు. ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్న బ్లడ్‌ బ్యాంకులపై ప్రజలు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-599-6969లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్‌ పని చేస్తుంది.

Spread the love