ప్రక్షాళనలో భాగంగా నూతన కమిటీలు

ప్రక్షాళనలో భాగంగా నూతన కమిటీలు– బలోపేతం కోసం బీఆర్‌ఎస్‌ నిర్ణయం
– కీలకాంశాలపై అధ్యయనం కోసం రీసెర్చ్‌ వింగ్స్‌
– ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలపై సమీక్షకు ప్రత్యేక టీమ్‌లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షల అనంతరం ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ అధిష్టానం.. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఉన్న పలు కమిటీల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సీనియర్లు, ముఖ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఎంపీ ఎన్నికల సన్నద్ధత కోసం ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను పూర్తి చేసిన గులాబీ పార్టీ.. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తోంది. వీటికి సమాంతరంగా నూతన కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా నైపుణ్యాలున్న యువత ద్వారా సోషల్‌ మీడియా టీమ్‌లను బలోపేతం చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రంగంలోకి దిగారు. రెండు మూడు జిల్లాల్లో సమావేశాలను సైతం నిర్వహించారు. దీంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు వీలుగా మీడియా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై కార్యకర్తలు, నాయకులకు శిక్షణనిచ్చేందుకు వీలుగా ‘రీసెర్చ్‌ వింగ్స్‌’ను ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిపుణులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు వీలుగా పార్టీలోని ఉన్నత విద్యావంతులు, మేధావులు, విశ్లేషకులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటిపై లోతైన అధ్యయనం, పరిశీలన అనంతరం, ఆయా కమిటీలు, టీమ్‌లను, బాధ్యులను అధికారికంగా ప్రకటిస్తారని తెలంగాణ భవన్‌ వర్గాలు తెలిపాయి.
రావులకు తెలంగాణ భవన్‌ బాధ్యతలు…
మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌ బాధ్యతలను మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డికి అప్పగించారు. ఆయనకు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, సీనియర్‌ నేతలు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తోడ్పాటునందిస్తారు. టీడీపీలో సీనియర్‌ నేతగా ఉండి, ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించిన రావుల… ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నిర్వహణలో సుదీర్ఘకాలం క్రియాశీలక పాత్ర పోషించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
తెలంగాణ భవన్‌ను కూడా ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ తరహాలోనే నడపాలని భావిస్తున్న గులాబీ బాస్‌…
రావులకు ఉన్న అనుభవాన్ని ఆ మేరకు ఉపయోగించుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు తెలంగాణ భవన్‌ బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటి వరకూ ఆ బాధ్యతల్లో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి ఉన్న సంగతి విదితమే. దీంతోపాటు తెలంగాణ భవన్‌లో టీ-న్యూస్‌ను నిర్వహించటాన్ని తప్పుబడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ ఛానల్‌ యాజమాన్యానికి నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆ ఛానల్‌ను పూర్తిగా ఖాళీ చేయించి, మొత్తం భవనాన్ని పార్టీ కార్యకలాపాలకే వినియోగించుకోవాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.

Spread the love