హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలులో సరికొత్త వివాదాలు

రాజేష్‌ కుమార్‌ దారియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ, గురుకుల బోర్డులు ఇటీవల ప్రకటించాయి. దానికనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్‌ 35, 3లను విడుదల చేసింది. అందులో కేవలం మహిళలకు మాత్రమే హారిజాంటల్‌ రిజర్వేషన్లు వర్తింప చేస్తామని పేర్కొన్నది. ఇదిలా ఉండగా హారిజాంటల్‌ తీర్పుగా భావించే రాజేష్‌ కుమార్‌ దారియ కేసును ఆధారం చేసుకుని ఆ తర్వాత వచ్చిన మరికొన్ని కేసులలో వచ్చిన తీర్పులను క్రోడీకరించి సర్వీస్‌ సబార్డినేట్‌ రూల్స్‌ 22, 22ఎలను సవరిస్తూ గత అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 77ను తీసుకువచ్చింది. దాని ద్వారా మహిళలకే కాకుండా వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, స్పోర్ట్స్‌ మెన్‌లకు కూడా హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకువచ్చిన సర్వీస్‌ సబార్డినేట్‌ రూల్స్‌ నే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ అమలు చేయబడుతున్నాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు ఆ రూల్స్‌ను సవరణ చేసిన తర్వాత హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అమలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము విడుదల చేసిన జీవోలతో విభేదిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మాత్రమే హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను వర్తింపచేస్తామని తెలుపుతుండగా,ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహిళలతోపాటు మిగతా కొన్ని వర్గాలకు కూడా హారిజాంటల్‌ రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు.దీంతో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలు విషయంలో విభిన్నత చోటు చేసుకోవడంతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చినట్లయింది.
కొందరు రాజకీయ ప్రయోజనాల కొరకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌కు వక్ర భాష్యం పలుకుతున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పులకే సరికొత్త నిర్వచనాలను ఇస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అబ్కారి శాఖ,వైద్య ఆరోగ్యశాఖలోనూ మహిళలను హారిజాంటల్‌ విధానంలోనే భర్తీ చేశారు. అంతేకాకుండా పోలీస్‌ రిక్రూట్మెంట్‌లోనూ ఎప్పటి నుండో మహిళలకు హారిజాంటల్‌ విధానాన్నే పాటిస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు టీఎస్పీఎస్సీ, గురుకుల బోర్డులు మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించిన వెంటనే ఓ బీఆర్‌ఎస్‌ మహిళానేత మహిళలకు వర్టికల్‌ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేయడం శోచనీయమని పలువులు న్యాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక వివక్ష, తరతరాలుగా అణచివేతకు గురై సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేష న్లను ఆర్టికల్‌ 15(4), 16(4)ల ప్రకారం వర్టికల్‌(నిలువు)గా అమలు చేస్తుండగా, సరైన ప్రాతినిధ్యం లేదనే ఉద్దేశంతో రూపొందించబడ్డ ప్రత్యేక రిజర్వేషన్లను హారిజాంటల్‌ (సమాంతరం)గా అమలు చేస్తున్నారు. అంటే ఇంతవరకు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు మాత్రమే నిలువు రిజర్వేషన్లను వర్తింప జేస్తుండగా మహిళలు, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్మెన్‌, స్పోర్ట్స్‌ కోటాలకు సమాంతర రిజర్వేషన్లను వర్తింపచేస్తున్నారు.
అయితే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈడబ్ల్యూఎస్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్త రిజర్వేషన్లకు తెరలేపింది. దీనిపై పలు కేసులు నమోదు కాగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను సమర్థిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల మైలురాయిగా పిలువ బడే ఇంద్ర సాహ్నీ కేసులో రిజర్వేషన్లు 50శాతం దాటకూడ దని తీర్పు ఉంది. సామాజిక వివక్షతకు నోచుకోనప్పటికీ అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని భావించి వారికి మాత్రమే ఈ రిజర్వే షన్లను వర్తింపజేస్తుండడం వల్ల వీటిని ప్రత్యేక రిజర్వేషన్లుగా పరిగణించాలని కొందరు వాదిస్తున్నారు. వీటిని దఅష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వే షన్ను హారిజాంటల్‌గా అమలు పరచాలని డిమాండ్‌ చేస్తు న్నారు. మరోవైపు అగ్రవర్ణా ల్లోని పేదల శాతాన్ని లెక్కిం చకుండా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వే షన్ల వాటాను పేర్కొనడాన్ని తప్పుపడుతూ మరికొందరు కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. రాజేష్‌ కుమార్‌ దారియా కేసులో ఇచ్చిన తీర్పు మేరకు మహిళలతోపాటు దివ్యాంగులు, స్పోర్ట్స్‌ మెన్‌, ఎక్స్‌ సర్వీస్మెన్‌ కోటాలను కూడా సమాంతరం గా భర్తీ చేయడంతో పాటు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అనేది సామాజిక రిజర్వేషనా? ప్రత్యేక రిజర్వేషనా? అనే విషయాన్ని తేల్చుటకు కోర్టులు ప్రత్యేక చొరవ తీసుకొని వేగవంతంగా లోతైన విచారణ జరపవలసిన ఆవశ్యకత ఉన్నదని పలువురు సామాజిక వేత్తలు, న్యాయనిపుణులు కోరుతున్నారు.
– భాస్కర్‌ యలకంటి, 8919464488

Spread the love