దేశ ఆర్థిక మూలాలను శాసిస్తున్న విదేశీ మారక ద్రవ్యనిల్వలు

ప్రపంచీకరణ ప్రహసనంతో అంతర్జాతీయంగా అనుసంధానమవుతున్న ప్రపంచ ఆర్థిక మార్కెట్లు, నూతనంగా ఉద్భవిస్తున్న ఆర్థిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్య పెట్టుబడి ప్రవాహాల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల అంశం ఇటీవల కాలంలో ఆర్థిక వ్యవస్థలో అనేకసార్లు చర్చనీయాంశమయింది. వివిధ దేశాలలో ఆర్థిక, బ్యాంకుల సంక్షోభాలు, రుణ పరపతి విధానాల ప్రకటనలు పొంచివున్న ఆర్థిక మాంద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విధానాల రూపకల్పన, నిర్వహణ, పారదర్శకత వంటి అంశాలలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్‌ (బిఐఎస్‌), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వంటివి ఫారిన్‌ రిజర్వ్స్‌ అంశంపై వివిధ దేశాలు ఒక అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌లో ఇమిడి ఉండేలా కొన్ని చర్యలు చేపడుతున్నాయి. విదేశీ మారక నిల్వలు దేశంలో తరిగి పోతున్నాయని, అవి ఇటీవల రెండేండ్ల కనిష్టస్థాయికి చేరాయని పలు నివేదికలు వెల్లడిం చాయి. దేశంలో విదేశీ మారక నిల్వలు 5,24,520 మిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి. డాలర్‌తో రూపాయి విలువ సంవత్సరకాలంలోనే 12శాతం క్షీణించి అత్యధిక కనిష్ట స్థాయికి చేరి రూపాయి విలువ డాలర్‌కు 83గా నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో, పతనమవుతున్న రూపాయి విలువను పరిరక్షించ డానికి రిజర్వ్‌ బ్యాంక్‌ డాలర్లను విక్రయించడం వంటి చర్యలు కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వల క్షీణతకు కారణం అనేది ఒక ప్రధాన విశ్లేషణ. ఫలితంగా రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఫారెక్స్‌ నిల్వలలో భారీ తగ్గుదల చోటుచేసుకుంది. ఆర్థిక వ్యవస్థల ఆరోగ్యకర గమనా నికి వ్యవస్థలో విదేశీ మారక ద్రవ్య నిధుల లభ్యత కొలమానంగా భావించే విధాన రూపకల్పనతో దేశ ఆర్థిక వ్యవస్థలను ప్రపంచీకరణ ప్రామాణీకరించింది. కరెన్సీ మారకపు రేటును ప్రభావితం చేయటంతో సహా మార్కెట్‌లో పెట్టుబడిదారులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించ డం, మార్కెట్‌ పనితీరును ప్రభావితం చేయడంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తున్నాయి. దేశ స్థూల జాతీయోత్పత్తిలో బహిర్గ తంగా ఉన్న రుణాల శాతం, నికర అంతర్జాతీయ పెట్టు బడుల శాతం, రిజర్వ్‌లో స్వల్పకాలిక రుణాల శాతం, కరెంట్‌ ఖాతా లోటు వంటి అంశాలు ఫారెక్స్‌ నిధుల ఒడిదుడుకుల గమనానికి ప్రభావితం అవుతున్నాయి.
తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వల స్థాయిని నిర్ధారించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మూడురకాల సాంప్రదాయ విధానాలను రూపొందించింది. మొదటిది, ఒక దేశం దిగుమతులు చేసుకునే వస్తుసేవలకు చెల్లింపులు చేసుకునేందుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్య నిల్వల ప్రాతిపదిక. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మూడు నెలల కాల వ్యవధి చెల్లింపులకు సరిపడా నిల్వలు ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరమనే విధానం. ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న స్పెక్యులేటివ్‌ వ్యాపార ధోరణిలో ఇది అంతగా ఉపయుక్తం కాకపోవచ్చు.
రెండవది, చెల్లించవలసి ఉన్న మొత్తం స్వల్ప కాలిక విదేశీ రుణాల విలువకు సరిపడా మారక నిల్వలు కలిగి ఉండడం మరోపద్ధతి. స్వల్పవ్యవధికి సంబంధించిన లావాదేవీలకు ఇది ప్రయోజనకరం. మూడవది, మొత్తం ప్రజల వద్ద చెలామణిలో ఉన్న, డిపాజిట్‌ రూపంలో ఉన్న బ్రాడ్‌మనీలో 20శాతం రిజర్వ్‌కు సరిపడే నిష్పత్తిలో మారక నిల్వలు ఉండేలా చూసే పద్ధతి. రిజర్వ్‌ బ్యాంక్‌ అధ్యయనాల ప్రకారమే రిజర్వ్‌లు బ్రాడ్‌ మనీలో 20శాతం స్థాయికన్నా తగ్గిపోయిన సందర్భాలుండటం ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరం.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యనిల్వల పెంపుదలకు ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ అనేక చర్యలను ప్రకటించవలసి వచ్చింది. గవర్నమెంట్‌ బాండ్స్‌, కార్పొరేట్‌ బాండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన విధి విధానాలను సరళతరం చేయడంతో పాటు ఎన్‌ఆర్‌ఐల నుంచి డిపాజిట్స్‌ను ఆకర్షించేందుకు బ్యాంకులకు సంబంధించి అనేక నియమాలను కూడా సులభతరం చేసింది.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు విదేశీ కరెన్సీరూపంలో ఉన్న ఆస్తులు. వీటిని దేశీయ కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది. ఇవి విదేశీ కరెన్సీ బాండ్స్‌, ట్రెజరీ బిల్లులు, ఇతర గవర్నమెంట్‌ సెక్యూరిటీలు, బంగారం నిల్వల రూపంలో ఉంటాయి. ఎక్కువ విదేశీ మారక నిల్వలు అమెరికన్‌ డాలర్‌ రూపంలో నిల్వలుగా ఉండటం గమనార్హం. అయితే ఇవి బ్రిటిష్‌ ‘పౌండ్‌’, యూరోపియన్‌ ‘యూరో’, చైనీస్‌ ‘యువాన్‌’, జపనీస్‌ ‘యెన్‌’ రూపాలలో కూడా కలిగి ఉంటాయి. విదేశీ మారక నిల్వలు కేవలం దిగుమతుల చెల్లింపుల పరిధికే పరిమితం కాకుండా దేశ ద్రవ్య పరపతి విధాన ప్రక్రియపై కూడా క్రియాశీలక ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపారాన్ని సంతులనం చేయడానికి, దేశీయ కరెన్సీ మారకం విలువను స్థిరంగా ఉంచేందుకు, స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పాదుకొల్పటంలో కూడా ఇవి నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఒక దేశం ఎగుమతుల ద్వారా సముపార్జించే ఆదాయం దిగుమతుల కన్నా ఎక్కువ మేరకు ఉన్నపుడు విదేశీ మారకపు ద్రవ్య నిల్వలలో వృద్ధి నమోదవుతుంది. కరెంట్‌ ఖాతా మిగులు వలన కూడా దేశంలో విదేశీ మారక నిల్వల పెరుగుదలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ దిశగా గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా కూడపెట్టిన విదేశీ మారకపు ద్రవ్య నిల్వలలో చైనా, జపాన్‌, స్విట్జర్‌ల్యాండ్‌ ప్రపంచంలోనే అత్యధిక విదేశీ కరెన్సీ నిల్వలు కలిగిఉన్న దేశాలుగా ఆవిర్భవించటం గమనార్హం.
మార్చి 31, 2022 నాటికి ఫారెక్స్‌ నిల్వలు 607.31 బిలియన్ల స్థాయికి చేరినప్పటికీ, దీనికి భిన్నంగా సరుకుల వర్తకపులోటు 1.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, ఇతర దేశాలలో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు నిల్వలు, పర్యాటకం వంటి పరిశ్రమల ఆదాయం ఆర్థిక వ్యవస్థకు జమ అవుతుండగా, రుణాలపై వడ్డీ, రాయల్టీలు, డివిడెండ్‌ చెల్లింపులు, లైసెన్స్‌ ఫీజులు, విదేశీ ప్రయాణాలు, ఇతర ఆర్థిక సేవలకు చెల్లింపుల స్థాయిలో కూడా గణనీయమైన వృద్ధి నమోదయింది. ఈ సంవత్సరం ఏప్రియల్‌ 2వ తేదీన 606.475 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఫారెక్స్‌ రిజర్వ్‌లు సెప్టెంబర్‌ 23 నాటికి 537.5 బిలియన్‌ డాలర్ల స్థాయికి తగ్గిపోయినాయి. ఇటీవల ఒకదశలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 23 నెలల కనిష్ట స్థాయికి పడిపోయినాయి. ఫారెక్స్‌ నిల్వలలో మెజారిటీ వాటా కలిగిన విదేశీ కరెన్సీల విలువ 652.7 కోట్ల డాలర్లు తగ్గి 49,211 కోట్ల డాలర్లకు పడిపోయింది. బంగారం నిల్వలు కూడా 133 కోట్ల మేర తగ్గి 3,830 కోట్ల డాలర్లుకు పరిమితమైనాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద దేశ ప్రత్యక్ష డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డిఆర్‌) విలువ 5కోట్ల డాలర్ల మేర తగ్గి 1778కోట్ల డాలర్ల స్థాయికి దిగజారింది. ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థాయి 2.4కోట్ల డాలర్లు క్షీణించింది. అంతర్జాతీయ కరెన్సీల స్థాయితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ మాసాంతానికి అమెరికన్‌ డాలర్‌ 14.5శాతం మేరకు బలపడి వృద్ధి చెందగా ఇదే సమయంలో భారతదేశ రూపాయి 7.4శాతం క్షీణించింది. అక్టోబరు మాసంలో మొత్తం ఫారిన్‌ రిజర్వ్‌లలో సింహభాగంగా ఉన్న ఫారిన్‌ కరెన్సీ ఎసెట్స్‌ (ఎఫ్‌సిఎ) 3.59 బిలియన్‌ డాలర్లు తగ్గి 465.08 బిలియన్లుగా ఉన్నాయి. రూపాయి విలువ 83 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో కరెన్సీ క్షీణతను కాపాడడానికి రిజర్వ్‌ బ్యాంకు 100 బిలియన్ల విదేశీ నిల్వలను వినియోగించింది. పరిస్థితిని అంచనావేసి విదేశీ ద్రవ్య మార్కెట్‌లో కల్పించుకోవలసి వస్తుందన్న ఆర్‌బిఐ అంచనా పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతం.
ఆర్థిక రంగంలో అనేక విపత్తులకు విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటు కారణమవుతోంది. సహజ వనరులు, బంగారం వంటి నిల్వలు ఉన్నప్పటికీ విదేశీ మారక ద్యవ్యానికి ఉన్న లిక్విడిటీ వీటికి ఉండడు. త్వరితగతిన అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు నిర్వహించే పరిస్థితులలో స్థబ్ధత ఏర్పడి దేశీయ కరెన్సీ పట్ల విశ్వవిపణిలో విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు ఏర్పడుతాయి. దేశీయ కరెన్సీ విలువను నిలకడగా ఉంచడానికి, తమ దేశ కరెన్సీ విలువను డాలర్‌ మారకపు విలువతో పోల్చినపుడు పడిపోకుండా చూసుకోవడానికి, ద్రవ్య లభ్యతను వ్యవస్థలో చెలామణి లో ఉంచడానికి, అంతర్జాతీయ పెట్టుబడీ దారులకు వారి పెట్టుబడు లకు, ద్రవ్య లబ్దతకు అవసరమైన విశ్వాసాన్ని, భరోసాను కల్పించడానికి, అంతర్జా తీయంగా చెల్లింపులు సులభతరం చేయడానికి, వాణిజ్య, ఇతర రుణాల పరిష్కారానికి, పలు రంగాల అభివృద్ధికి పెట్టుబడులు సమకూర్చ డానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు కీలకంగా మారి వివిధ దేశాల ఆర్థిక మూలాల గమనాన్ని శాసించే స్థాయికి చేరాయి.
ఉత్పత్తి, వాటి వినియోగం ప్రాతిపదికగా అనుసంధానమైన ఆర్థికాభివృద్ధికి భిన్నంగా, లాభాపేక్షే ధ్యేయంగా ఉన్న ద్రవ్య పెట్టుబడి, స్పెక్యులేటివ్‌ కరెన్సీ మార్కెట్లతో ముడిపడి ఆర్థిక వ్యవస్థ మూలాలను నిర్మించాలనుకోవటం ఊహాజనిత భ్రాంతి మాత్రమే. ఆర్థిక మూలాల పటిష్టతకు స్వీయ నియంత్రణ మార్గాలను అన్వేషించకుండా, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్ధేశిత విధానాల ప్రాతిపదికన విదేశీ మారక ద్రవ్య నిల్వల సంక్షోభం నుండి పయట పడాలనుకునే విధానాలకు స్వస్థిపలకటం తక్షణ కర్తవ్యం.

జి. కిషోర్‌
9440905501

Spread the love