మారుతున్న మానవ సంబంధాలు

'Changing Human Relations' ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపద వస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారిపోయాయి ఏది జరిగినా మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాలు కొరకు మాత్రమే మానవ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఒకరితో మనం కలిసి ఉంటే మనకు వారు ఏ విధంగా ఉపయోగపడతారు అనే ఆలోచన సమాజంలో పెరిగిపోయింది. చివరికి కుటుంబ సభ్యుల అనుబంధాలు కూడా ఆర్థిక సంబం ధాలుగా మారిపోవడం చాలా బాధాకరం. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేవారు. ఆ కుటుంబంలో ఉండే పెద్దవారు కుటుంబ సభ్యులకు వారికి తెలియ కుండానే వ్యక్తిత్వ వికాస బోధన చేసేవారు. వారి ప్రవర్తన చూసి పిల్లలు నేర్చుకునే వారు. భవిష్యత్తులో సమాజంలో ఏ విధంగా ఉంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారో వారికి దిశ నిర్దేశం చేసేవారు. నేటి ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌ ఏర్పడ్డాయి. ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారడానికి ప్రధాన కారణాలు తను మాత్రమే ఎదగాలని వ్యక్తిగత స్వార్థం, సామాజిక స్పృహ లోపించడం, సోషల్‌ మీడియా, ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉండడం వంటివి.
ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల వల్ల వారిద్దరి మధ్య మానవ సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియా ప్రభావానికి లోనై ప్రజలు భౌతికంగా సంభాషించడం మానేసి చాలా రోజులైంది. వారి హావభావాలకు వేదికగా సోషల్‌ మీడియాని ఉపయోగించు కుంటున్నారు. వారికి సంతోషం వచ్చినా బాధలు వచ్చినా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఫేస్బుక్‌, ట్విట్టర్‌, యూ ట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సాధనాలలో ఎక్కువ సమయం గడుపుతూ భౌతికంగా వ్యక్తుల మధ్య ఉండే సంభాషణలు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలకు దూరమవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఉండే స్నేహితులే వారికి నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారు. తద్వారా భౌతికంగా విద్యార్థి దశలో, ఉద్యోగంలోనూ సామాజిక జీవనంలో కూడా స్నేహితులకు దూరమవుతున్నారు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ వాటిలో వచ్చే లైకులు, కామెంట్లను చూసి సంబరపడిపోతున్నారు. అవి రాకపోతే బాధపడుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. ప్రత్యక్ష అనుభూతులకు దూరమవుతున్నారు. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టుల్లో నిజాలు గోరంతయితే దాన్ని కొండంతగా చూపించే పద్ధతికి అలవాటు పడుతున్నారు.ఊహలోకంలో విహారిస్తున్నారు. అదే సర్వస్వం అనుకుంటున్నారు.
ఇది వ్యక్తి సమగ్ర అభివృద్ధికి, వికాసానికి గొడ్డలి పెట్టులాంటిది. స్టేట్‌ ఆఫ్‌ మొబైల్‌ -2023 ప్రకారం భారతీయులు ప్రతిరోజు 4.9గంటల పాటు స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్న వారిలో ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో భారతీయులు ఉన్నారు. దేశజనాభాలో 470.1 మిలియన్ల మంది ప్రజలు సోషల్‌ మీడియాలో రోజు యాక్టివ్‌గా ఉంటున్నారు. భారతీయ జనాభాలో యాక్టివ్‌గా సోషల్‌ మీడియా ఉపయోగిస్తున్న ప్రజలు 33.4శాతం. వీరు సగటున 2.6గంటలు ప్రతీ రోజు సోషల్‌ మీడియాలో గడుతున్నారు. ఇది గమనించిన రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో సోషల్‌ మీడియా వేదిక ద్వారానే అత్యధిక ప్రచారం చేయనున్నాయి. ఎన్నికల టైంలో ప్రజలు ఇంకా ఎక్కువ కాలం సోషల్‌ మీడియాలో గడిపే అవకాశం ఉంది. ప్రజల అవసరాలను గమనించిన సోషల్‌ మీడియా కంపెనీల యజమానులు వారి కాసులపంట పండించు కుంటున్నారు. కోట్ల రూపాయలకు పడగెత్తుతున్నారు.
ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలవారుగా రూపొందడంలో తల్లిదండ్రులు, సమాజం, నేర్చుకునే విద్య, చదివే పుస్తకాలు, చేసే వృత్తి పాటించే నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. వీటన్నిటికీ దూరమై కేవలం సోషల్‌ మీడియా లోనే వారి జీవితాన్ని గడుపుతూ పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందలేకపోతున్నారు. ప్రేమ ఆప్యాయత అనురాగాలకు దూరమవుతున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా బతుకుతున్నారు. సోషల్‌ మీడియా వల్ల అన్ని అనర్థాలే ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కొన్ని సందర్భాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సామాజిక మాధ్యమాల్లో అందరూ స్పందించి వారికి సహాయం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను సమస్యల పరిష్కా రానికి వాడుతుండడం గమనార్హం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విద్యార్థులకు విషయ అవగాహన కల్పించడం కోసం కూడా సామాజిక మాధ్యమాలు ఉపయోగ పడుతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులకు, ఉద్యోగులకు ఏదైనా సజనాత్మక ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి మిత్రులతో చర్చించి దానికి పరిష్కారం కనుగొనేవారు. కానీ ప్రస్తుతం ఏ సందేహం వచ్చినా ఏ ఆలోచన వచ్చినా దానికి సంబంధించి గూగుల్‌, యూట్యూబ్లో వెతకడం పరిపాటిగా మారింది.
బాల్యంలోనే విద్యార్థులకు నైతిక విలువలు, మానవ సంబంధాలు, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన, వీటిని విద్యా విధానంలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్యార్థులను, యువకులను ధనార్జక యంత్రాలుగా కాక మానవీయత కలిగిన వారుగా, మంచి పౌరులుగా రూపొందించాల్సిన బాధ్యత సమాజం పైనా ఉంది. అదే రేపటితరానికి మార్గదర్శకమవుతుంది.
పాకాల శంకర్‌గౌడ్‌
9848377734

Spread the love