‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అంటారు ప్రపంచ మేధావి, తత్త్వవేత్త కార్ల్‌మార్క్స్. మానవాళి హక్కుల సాధన కోసం, దోపిడీ – అణచివేతల నుండి రక్షణ కోసం… ఆయన సూత్రీకరించిన సిద్ధాంతం నేటికీ, ఏనాటికీ సజీవమైనది, ఆచరణ యోగ్యమైనది. పాల కుల, యజమానుల నియంతృత్వ ధోరణులు, విశృంఖల పోకడలు, దోపిడీ విధానాలు పెచ్చరిల్లుతున్న తరుణంలో వాటి నుండి విముక్తి కోసం, హక్కుల సాధన కోసం ఉద్యమాలు ఊపందుకుంటాయి, ఉవ్వెత్తున ఎగసిపడతాయి. ఇది చరిత్ర చెప్పిన, చెబుతున్న నిత్య సత్యం.
భారత రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా ప్రసాదిస్తున్నది. అధికరణం 19 (1)(బి) అందుకు అవసరమైన సంఘాలను, రాజకీయ సంస్థలను ఏర్పాటు చేసుకొనే అవకాశాన్ని కలిగిస్తున్నది. ప్రదర్శనలు, ఆందోళనలు, బహిరంగ సభల ద్వారా ప్రభుత్వాల చర్యలను, పాలకుల విధానాలను ప్రశ్నించడానికి, దీర్ఘకాలిక ఉద్యమాలను రూపొందించడానికి శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తున్నది రాజ్యాంగంలోని 19(1)(సి) అధికరణం. ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా, కొన్ని వర్గాలకు మేలు చేకూర్చాలన్న తాపత్రయంతో పాలకులు తీసుకునే ఎలాంటి నిర్ణయాలనైనా ప్రశ్నించే అవకాశం ప్రజలకు ఉండాలి. సదరు నిర్ణయాలను సరిచేసుకోవాలనీ, విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేసే అధికారం, అందుకు అవసరమైన పోరాటాలను నిర్మించుకునేందుకు సానుకూల వాతావరణం ఉండాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2), 19(3)ల ప్రకారం సహేతుకమైన పరిమితులకు లోబడి మాత్రమే నిరసనలు ఉండాలనీ, పరిమితులను అధిగమించే పోరాటాలకు అనుమతులివ్వరాదనే నిబంధనలను ఉన్నమాట వాస్తవమే. అయితే… వీటిని సాకుగా చూపుతూ ప్రజాస్వామ్యబద్ధంగా, నిబంధనలకు లోబడి, న్యాయబద్ధమైన నిరసనలను, సామాజిక ప్రయోజనాల కోసం, హక్కుల సాధన కోసం చేసే పోరాటాలను సైతం అణచివేసే ప్రయత్నాలు చేయడం అమానుషం.
ఈ మధ్య కాలంలో చూస్తే… పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2019లో అస్సాంలో మొదలైన నిర సనలు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, కేరళ రాష్ట్రాలకు విస్తరించాయి. ఢిల్లీలోని షహీన్‌బాగ్ వద్ద చేప ట్టిన పోరాటం ఉదృతంగా సాగింది. ఎన్‌ఆర్‌సికి వ్యతి రేకిస్తూ ఉద్యమం దేశమంతటా వ్యాపించిన తరుణంలోనే కోవిడ్ మహమ్మారి మనదేశంలోకి ప్రవేశించడం, దాన్ని నియంత్రించే లక్ష్యంతో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఈ పోరాటాన్ని నిలుపుదల చేయడం అనివార్యమైంది. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2021లో ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతుల పోరాటం అద్వితీయమైనది. 13నెలల పాటు సాగిన ఈ పోరాటాన్ని అణచివేయడానికి పాలకులు శతవిధాలా ప్రయత్నించింది. ఇనుపకంచలు వేయడం, రోడ్లను తవ్వడం, ఉద్యమకారులు ఖలిస్తానీ తీవ్రవాదులంటూ దుష్ప్రచారం చేయడం ఘోరమైనచర్య. కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా… అవి పోరాటాన్ని కట్టడి చేయలేక పోయాయి. చివరకు ప్రధాన మంత్రిగారే వచ్చి, ఇకనైనా పోరాటాన్ని ముగించాలనీ, వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తున్నామని స్వయంగా ప్రకటించడం రైతు ఉద్యమానికి లభించిన ఓ గొప్ప విజయం. ప్రజా పోరా టాలకు దక్కిన ఓ అపూర్వ గౌరవం. ఐదువేల మంది రైతులతో 2023 మార్చిలో నాసిక్ నుండి మొదలుకొని ముంబై వరకు చేసిన ‘లాంగ్ మార్చ్’ మరో అద్భుతమైన పోరాటంగా నిలిచింది. మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి, రైతు సంఘాలతో చర్చలు జరిపింది. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి భరోసానిచ్చింది.
వెనుకబాటుకు గురవుతున్నామనే భావనతో… నూతన రాష్ట్ర ఏర్పాటే సరైన పరిష్కారమనే భావనతో కొనసాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మేధావులు ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు సబ్బండవర్ణాలను మిళితం చేసింది, పోరాటంలోకి నడిపించింది. సకల జనుల సమ్మెగా మారి ఊరూరా, పల్లె పల్లెనా ఉరకలేస్తూ కదం తొక్కుతూ కదిలిన పోరాటంతో ప్రభుత్వాలు దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వక తప్పలేదు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ”మన వనరులు మనకు మాత్రమే” అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆ లక్ష్యం నుండి క్రమంగా దూరం జరుగుతూ వచ్చారు. ‘సొంత రాష్ట్రంలో పరాయి పాలన’ అంటూ నాడు దెప్పిపొడిచివారే నేడు ‘మన రాష్ట్రంలో మనది కానిపాలన’తో విసుగు పుట్టిస్తున్నారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామనే హామీనిచ్చి, అధికారంలోకి వచ్చాక క్రమంగా ఉద్యోగులను తొలగిస్తూ, వారి ప్రయోజనాలను పక్కన పెడుతూ కనీసం ఒకటవ తారీఖున వేతనాలు కూడా చెల్లించలేనంత పరాయివారుగా భావిస్తున్నారు. ”స్వరాష్ట్రం సాధించాక అందరి ఆకాంక్షలను నెరవేరుస్తూ పాలన సాగిస్తాం. నిరసనలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతోంది అంటూ చెప్పిన గొప్పలు, చేసిన మాటలు నేడు నీటి మూటలుగా మిగిలిపోయాయి. అక్కడ ధర్నాలు లేని రోజంటూ లేకుండా పోయిందనేది కాదనలేని వాస్తవం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మి కులు, కర్షకులు కాంట్రాక్టు ఉద్యోగులు, స్కీం వర్కర్లు ఇలా ప్రతినిత్యం ఎవరో ఒకరు తమ హక్కుల సాధన కోసం ఉద్య మిస్తున్న సంగతి తెలియంది కాదు. పోరాటం చేస్తే ఉద్యోగాల నుండి ఊడబీకుతామనే బెదిరింపులు, ఉద్య మాలు చేయడానికి హక్కే లేదంటూ బుకాయింపులు, నిరసనలు మాని విధుల్లో చేరితేనే మీ సమస్యలు పరిష్కారి స్తామంటూ మాయమాటలు చెబుతూ పోరాటాలను నిర్వీ ర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేసే క్రమంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ, నిర్బంధిస్తూ పోరాట లక్ష్యాలను నేరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉద్యమాలను అణచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, అంతే బలంగా పోరాటాలు నిర్మిస్తూ పాలకుల విధానాలను ఎండగట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బలమైన పోరాటాలకు పాలకులు సైతం తలొగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెలన్నర రోజులు నిరవధికంగా సాగిన వీఆర్‌ఏల సమ్మె విజయవంతమైంది. దాదాపు 20వేల మందితో చలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, కదం తొక్కిన అనంతరం, మంత్రిగారు చర్చలు జరిపి, వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేయాలని నిర్ణయించడం శుభ పరిణామం. నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయ కుండా దాటవేస్తున్న సందర్భంలో… సమ్మెకు దిగి, 16 రోజుల పాటు పోరాడిన అనంతరం సానుకూల ఫలితమే వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా తమను రెగ్యులర్ చేయాలని పోరాటాలు, ఆందోళనలు చేస్తున్న కాంటాక్ట్ లెక్చ రర్లను అర్థరాత్రి జీఓతో, ఆగమేఘాల మీద క్రమబద్ధీకరణ చేయడం ముదావహం. ఈ పోరాటాల స్ఫూర్తితో అణచివేతకు గురవుతున్న జాతులు – వర్గాలు, హక్కులు కోల్పోతున్న జనాలు ఉద్యమాలకు పూనుకోవాలి. వివిధ రూపాల్లో, వేరువేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఒకే సమ స్యకు సంబంధించిన ఉద్యమాలన్నింటినీ ఏకఛట్రం కిందకు తీసుకురావాలి. అంశాలవారీగా వివిధ సమూహాలుగా కొనసాగుతున్న పోరాటాలన్నీ సంఘటితమవ్వాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, సమిష్టి హక్కుల కోసం, వ్యవస్థల మనుగడ కోసం పోరాటాలను నిర్మించాలి. పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, పిడికిలెత్తి నినదిస్తూ, మున్ముందుకు సాగిపోవాలి. ప్రభుత్వాలు కూడా వారి సమస్యల్ని పరిష్కరించాలి.
వరగంటి అశోక్
9493001171