సమ్మెబాటలో మధ్యాహ్న భోజన కార్మికులు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాన్న భోజనం మంటలు చెలరేగుతున్నాయి. చాలీచాలని వేతనాలు, పెట్టుబడికి సరిపడా డబ్బులు రాక పోవడం, పెంచిన వేతనాలు చెల్లించక పోవడంతో సోమవారం నుండి మూడు రోజుల పాటు వంట కార్మికులు మధ్యాహ్న భోజనానకి విరామం ప్రకటించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు కుటుంబ పోషణ భారంగా మారటం వల్లనే చాలా మంది పేదలు పిల్లలని బడికి పంపకుండా పనులు చేయిస్తూ ఉన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులందరూ చదువు కోవటంతోపాటు పోషకాహారలోపాన్ని నివారిం చటం దీనిలక్ష్యం. కాని ప్రభుత్వం నిర్లక్ష్యంతో లక్ష్యాలు నీరుగారుతున్నాయి. పథకం మొక్కుబడిగా అమలవుతోంది. మధ్నాహ్న భోజనం కాస్త మిథ్యాహ్న భోజనంగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాల్లలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు అధికారులు గణాంకాలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. సగం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సరిగ్గా అందడం లేదని తెలుస్తోంది. రోజు రోజుకూ కూరగాయలు, కందిపప్పు, వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కార్మికులకు 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు రూ.5.45 చొప్పున, 6 నుంచి 8వ వరకు విద్యార్థులకు రూ.8.17, 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.10.67 చొప్పున చెల్లిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు, ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం గిట్టుబాటు కావడంలేదని కార్మికులు చెబుతున్నారు. అందుకే మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు వారు వెనుకాడుతు సమ్మెకి దిగారు. పాఠశాలలకు మధ్యాహ్న భోజనం కార్మికులు రావటంలేదు. ఆయా చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి స్థానిక మహిళా సంఘాల సభ్యులతో వంట చేయిస్తున్నారు. విద్యార్థులకు నామమాత్రంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నా మోనూ మాత్రం అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు కాకపోయినా చాలా ఏళ్లుగా పనిచేశామన్న భావనతో మధ్యాహ్న భోజనం పథకాన్ని నెట్టుకొస్తున్నారు. రోజూ వివిధ రకాల కూరగాయలతో వంటలు చేయాల్సి ఉన్నా ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో పలచని పప్పు, కిచిడీ, నీళ్లచారునే ఎక్కువగా వడ్డిస్తున్నారు. భోజనం సరిగ్గా లేక విద్యార్థులు పూర్తిగా తినక పస్తులుంటున్నారు. దీంతో సాయంత్రం 4.45గంటల వరకు అలాగే ఉండాల్సి రావటంతో ఆకలితో అలమటిస్తున్నారు.
మోనూ ప్రకారం విద్యార్థులకు వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందజేయాలి. కోడిగుడ్లు అందించిన రోజు మధ్యాహ్న భోజనం కార్మికులకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై అదనంగా రూ.5 చెల్లిస్తుంది. ప్రస్తుతం కోడిగుడ్డు ధర రూ.6 నుండి 7 ఉంది. దీని ధర అధికంగా ఉండటంతో నిర్వాహకులు ముందుకు రావటం లేదు. ఈ కారణంగా ఎక్కడా అమలు కావటంలేదు. ప్రభుత్వం రూ.5చెల్లిస్తూ వారానికి మూడు రోజులు కోడిగుడ్డు అందించాలని చెప్పటం ఎంతవరకు సమంజసమనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలోనూ తరుగు వస్తున్నది. కొన్ని సార్లు ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వంట నిర్వాహకులు మధ్యాహ్న భోజనం అందించే ప్రయత్నం చేస్తున్నా కొన్నిచోట్ల వంట కార్మికులు ముందుకు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక మహిళ సంఘాల సభ్యులతో విద్యార్థులకు భోజనం అందించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నా, మధ్యాహ్న భోజనం అమలు కావడంలేదు. కొన్ని చోట్ల ఇంటి నుంచే భోజనం తెచ్చుకుని మధ్యాహ్నం తింటున్నారు. మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాలు ఏమాత్రం వారికి గిట్టుబాటు కావడం లేదు. విద్యార్థులకు అన్నం, పప్పుతో భోజనం అందిస్తున్నారు. మెనూ అమలు చేయడం వారికి కష్టంగా మారింది. బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. అప్పులు తెచ్చి సరుకులు కోనుగోలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అలాగే వారికి నెలనెలా బిల్లును సకాలంలో చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదివరకు అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన ద్వారా జీఓ నెంబర్‌ 8 ప్రకారం ఏరియర్స్‌ చెల్లించాలని, ప్రమాద బీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని అడుగు తున్నారు. వంట షెడ్లు, పాత్రలు మౌలిక సదుపాయాలు కల్పించాలని, గుడ్లకు అదనపు బడ్జెట్‌ కేటాయించాలని, గ్యాస్‌ సబ్సిడీ ద్వారా అందించి, కాటన్‌ వస్త్రాల యూనిఫాంలు ఇవ్వాలని విన్నవిస్తున్నారు అలాగే రాజకీయ వేధింపులు ఆపాలని, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్‌ల ద్వారా ప్రభుత్వం రుణాలు ఇప్పించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు డిమాండ్‌ చేస్తూ సమ్మెబాట పట్టారు. విద్యార్థులతో ముడిపడి ఉన్న వీరి సమస్యతో పాటు న్యాయమైన వీరి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

కామిడి సతీష్‌రెడ్డి
9848445134

Spread the love