‘బీజేపీ-ఆరెస్సెస్‌ హీనసంస్కృతి’

ఈ నెల 8న ఈసీఐఎల్‌ చౌరస్తాలో అఖిల భారత శాంతి సంఘం పాలస్తీనాకు సంఘీభావంగా, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేయగా, దాన్ని చూసి ఒకరు పోస్ట్‌ పెట్టారు. అదేమిటంటే ”కాశ్మీర్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని మీరు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించటం విడ్డూరం” అని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మిత్రుడు ఆ పోస్ట్‌లో ప్రశ్నించారు. అవును నిజమే. కాశ్మీర్లో ఉగ్రవాదం ప్రజ్వరిల్లుతుండగా దానికి వ్యతిరేకంగా పోరాడింది భారత సైనికులు, ప్రజాతంత్రవాదులు. వాళ్లే అనేకమంది అక్కడి ఉగ్రవాదానికి బలయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక గతంలో నాయకులందరూ పనికిమాలిన వారు, మేము పూర్తిగా అణిచివేసి, శాంతియుత కాశ్మీర్‌ను మీకందిస్తామని భారత ప్రజలకు చెప్పారు. ఆనాడు కాశ్మీర్‌ ప్రజల ఆశలకనుగుణమైన 370 ఆర్టికల్‌ను సహించేది లేదంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దుచేసింది. కాశ్మీర్లో ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేయవచ్చని, భారతదేశం అంతా ఒకటేనని చెప్పింది. ఆ రూపంగా బడా పెట్టుబడిదారులకు, తమ తాబేదారులైన వారికి వేల ఎకరాలు సమర్పించుకున్నారు. ఇంకా అంతా శాంతి అని ఊదరగొట్టారు. బీజేపీ పాలన తొమ్మిదేండ్లు గడిచింది. అయినా నిత్యం దేశంలో ఏదో ఓచోట రావణకాష్టంలో మండుతూనే ఉంది. ఇది బీజేపీ ప్రభుత్వం వైఫల్యం కాదా? నేడు మణిపూర్‌లో రిజర్వేషన్ల చిచ్చుపెట్టి, ప్రజల్లో వైషమ్యాలు సృష్టించి, పరస్పరం దాడులు చేసుకొనే విధంగా నేడు అగ్నిగుండంగా మారిపోయింది. కాశ్మీర్‌ ఫైల్స్‌ అంటూ ఒక వర్గాన్ని టార్గెట్‌ చేసి సినిమాలు తీయడం, రెండో పక్క శాంతియుతంగా ఉన్న కేరళ ప్రజలకు ఉగ్రవాదం ముద్ర వేసి కేరళ స్టోరీ అనే పేరు మీద సినిమాలు తీసి ప్రజల్లో వైషమ్యాలు సృష్టించారు. ఎక్కడ అవకాశమున్న అక్కడ అంతా ప్రజలను మతాలుగాను, కులాలుగాను విభజించి భారతీయతకు మూలమైన ఐక్యతను దెబ్బకొడుతున్నారు. మతం అనేది వ్యక్తిగతం, మతోన్మాదం దుర్మార్గమైంది. దాన్ని రెచ్చగొట్టే వాళ్ళందరూ ఉగ్రవాదులే! ఆ ఉగ్రవాదాన్ని నేడు బీజేపీ ప్రభుత్వమే కొమ్ముకాసి పెంచి పోషిస్తున్నది. ప్రజాతంత్ర వాదులను, లౌకిక భావాలు కలిగిన వారిని హత్యలుచేయటం పరిపాటిగా మారింది. మతోన్మాదాన్ని, పాలకుల దుర్మార్గాలను వ్యతిరేకించే వారిని దేశద్రోహ కేసులను పెట్టి జైల్లో పెడుతున్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపు కుంటున్నారు.
పుల్వామా ఘటనను ఆసరాగా తీసుకొని రెండోసారి ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆ సంఘటనలో సైనికులకు విమానాల్లో పంపించే విధంగా కాకుండా రోడ్డు మార్గంలో ప్రయాణం చేయడం వల్ల 40మందిని కోల్పోయాం. పుల్వామా దాడిని ముందే పసిగట్టి ప్రధానమంత్రికి ఆనాటి గవర్నర్‌ వివరించినా మిన్నకుండి, సైనికులు అమరులైనాక దానిని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నారు. దాన్ని బయపెట్టిన ఆనాటి గవర్నర్‌ను ఇబ్బందుల పాలు చేశారు. మహిళలు ధరించే హిజాబ్‌ విషయాన్ని కూడా రాజకీయంగా మలుచుకున్నారు. రైతులపై దాడి చేసి సంవత్సరం పైగా పోరాటం చేస్తే, వందలాది రైతులు అమరులైన పట్టించు కోకుండా వ్యవహరించగా దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలకు తలవగ్గి దుష్ట చట్టాలు మూడింటిని రద్దు చేశారు. అయినా న్యాయమైన మద్దతు ధర చట్టాన్ని కోరగా, వెంటనే చట్టం చేస్తామని చెప్పి మోసగించారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ వారిదంత మహిళలను అణిచివేయాలనే లక్ష్యం కలిగినవారు. లైంగికదాడులు ఆ తర్వాత హత మార్చడం చేయాల్సిందే! చివరకు కాల్చివేయడం లాంటి హీనసంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. చివరకు ప్రపంచ క్రీడల్లోనే ఒలంపిక్‌లో సైతం పథకాలు సాధించిన మహిళా రెజరర్లను లైంగి కంగా వేధించటం బీజేపీ ఎంపీకే దక్కింది. దానికి వ్యతిరేకంగా పోరాడిన మహిళలపై కేసులు దుర్మార్గాలు చేసింది. అతని రక్షించుకుంటూ నేటి పాలకులు నిస్సి గ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ శాంతికోసం పోరాడుతున్న అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడితే అటువంటి వారికి బుద్ధి వస్తుందని నా భావన. అంతే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా పోరాడాల్సిందే!
– గొడుగు యాదగిరిరావు, 9490098660

Spread the love