తప్పొకరిది… శిక్ష కుటుంబానికి..!

Bulldozerమధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన ప్రవేశ్‌ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం… ఇటీవల అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది. నిరసనల్లో పాలుపంచు కున్నారని గతంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి కూల్చివేతలు జరిగాయి. ఉత్తరాఖండ్‌లో హత్యకేసులో నిందితులకు సంబంధించి వ్యాపార సముదాయాన్ని ప్రభుత్వం నేలమట్టం చేసింది. అయితే ఇలాంటి కూల్చివేతలకు అక్రమ నిర్మాణాలు అని ముద్రవేస్తున్న ప్రభుత్వాలు… కోర్టులకు సైతం ఆక్రమణలంటూ సమాచారాన్ని ఇస్తున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం చేసిన తప్పుకు శిక్ష అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఇది నాణానికి ఒకవైపైతే… ఇండ్లను కూల్చివేయడంతో సదరు నిందితుల కుటుంబాల బాధలు వర్ణనాతీతం.’బుల్డోజర్‌ శిక్ష’ను అమలుచేసే ముందుకు సదరు ఫ్యామిలీ మెంబర్స్‌ గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం బాధాకరం.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యాక ఈ ‘బుల్డోజర్‌ జస్టిస్‌’ స్టార్ట్‌ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అది క్రమంగా మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, అస్సాం ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. మొదట మాఫియా, క్రిమినల్స్‌ ఇండ్లను ప్రభుత్వాలు కూల్చడం ప్రారంభించి ఆ తర్వాత వివిధ రకాల నిరసనల్లో పాల్గొన్న సామాన్య వ్యక్తుల ఇండ్లపై కూడా బుల్డోజర్లు నడిపించడం స్టార్ట్‌ చేశారు. అయితే ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి కూల్చివేతలు ఎక్కువగా జరిగాయి. ముందుగా ఇలాంటి చర్యలకు పాలకులు ఒక మతానికి సంబంధించిన వారిని టార్గెట్‌గా చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి చట్టవ్యతిరేక కూల్చి వేతలపై పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే వీటిని ఆక్రమణలుగా ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు తెలిపాయి. దీంతో ‘కూల్చివేతలనేవి చట్టానికి లోబడి ఉండాలని… అవి ప్రతీకారం తీర్చుకునేలా ఉండకూడదు’ అని యూపీ ప్రభుత్వాన్ని గతంలోనే సుప్రీం కోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా అస్సాంలో విచారణ ముసుగులో ఐదుగురు నిందితుల ఇండ్లపై బుల్డోజర్‌ నడిపించినందుకు గౌహాతి కోర్టు అస్సాం పోలీసు సూపరింటెండెంట్‌ను మందలించింది. అయితే ఆ తర్వాత లైంగిక దాడులు, హత్యల్లాంటి నేరాలు చేసిన వారి ఇండ్లనూ కూల్చడం ప్రారంభిóంచారు. బీజేపీ పాలిస్తున్న నాలుగైదు రాష్ట్రాల్లో ఇలాంటి న్యాయాన్నే అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్షపడాలి. దీనికోసం పోలీసులు, న్యాయస్థానాలు నిరంతరం పని చేస్తూనే ఉన్నాయి. నేర నిర్థారణ అనేది చట్ట పరమైన ప్రక్రియ ద్వారానే జరగాలి. వారికి శిక్ష విధించవలసింది న్యాయస్థానమే తప్ప అధికారంలో ఉన్న రాజకీయ నాయకులో, అధికారులో కాదు. అయితే నిందితులను గుర్తించడం, ఆధారాలు సేకరించడం, కేసు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టడం వంటి సుదీర్ఘ ప్రక్రియ వల్లనే, న్యాయంపై అధికశాతం ప్రజల్లో అవిశ్వాసం ఏర్పడుతున్నదని, అందుకే తమ ప్రభుత్వం ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ మార్గాన్ని ఎంచుకున్నదని ఆయా రాష్ట్రాల పాలకులు బహిరంగంగానే చెబుతున్నారు. చట్టప్రకారం నిందితులకు సరైన శిక్ష పడకపోతే బాధితులకు న్యాయం జరగదని సోషల్‌ మీడియా ద్వారా తెగ ప్రచారం చేస్తున్నారు. ఇండ్లను కూల్చివేసిన తర్వాత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల ప్రకటనలు సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరు తప్పుచేసినా ఇలాంటి ట్రీట్‌మెంట్‌ ఉంటుందని స్వయంగా పాలకులే హెచ్చరిస్తుండడం రాజ్యాంగంపై, చట్టాలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నది. అంతేకాకుండా ప్రజల ప్రాథమిక హక్కులకు తీవ్ర భంగం కలుగుతున్నది. మరోవైపు కూల్చివేతలు జరుగు తున్నప్పుడు కొందరు అధికారులు వాటిని తమ ట్వీట్లలో నేరానికి విధించిన శిక్షగా పేర్కొంటుండడం గమనార్హం. బుల్డోజర్లతో వెంటనే గుణపాఠం చెప్పాలన్న యావలో, చట్టపరంగా వ్యవహరించాల్సిన కర్తవ్యానికి ప్రభుత్వాలు నీళ్లొదులుతున్నాయి. చివరకు తాము చేసిన చట్టాలను సైతం సరైన రీతిలో అమలుచేసే సహనాన్ని కోల్పోతున్నాయి.తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
మధ్యప్రదేశ్‌లో నిందితుడు ప్రవేశ్‌ తల్లిదండ్రులు తమ ఇంటిని కూల్చొద్దని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. రాజకీయ కక్షలతో పాత వీడియోను వైరల్‌ చేశారని, ఇంటిని కూల్చివేస్తే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లాలని నిందితుడి సోదరి చెప్పినా పట్టించుకోలేదు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన నిరసనల్లో జావెద్‌ మహమ్మద్‌ అనే వ్యక్తి ఇంటిని కూల్చి వేయగా, అది అతని భార్య పేరున ఉన్నదని, ఆమె కుటుంబం నుంచి బహుమతిగా వచ్చినట్లు తేలింది. ఈ ఇంటిపై ఎలాంటి వివాదాలు లేకున్నా కూల్చివేయడం చట్టవిరుద్ధమని ఆ కుటుంబం వాపోయింది. దిల్లీలోని జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాలంటూ ఇండ్ల కూల్చివేత బాధితులకు కన్నీళ్లనే మిగిల్చింది. అన్ని పత్రాలున్నప్పటికీ తన జ్యూస్‌ షాప్‌ను ధ్వంసం చేశారంటూ గణేశ్‌ కుమార్‌ గుప్తా అనే చిరు వ్యాపారి వాపోయారు. బుల్డోజర్లతో ఓ చిన్నపాటి ఇంటిని కూల్చేస్తుంటే అందులో నివసించే ఓ మహిళ విలవిల్లాడిపోయింది. కూల్చి వేయొద్దంటూ అధికారులను బతిమాలింది. అయినప్పటికీ కనికరం చూపని అధికారులు… చూస్తుండగానే ఆమె సామగ్రిని జేసీబీలతో ఎత్తి ట్రాక్టర్‌లోని మట్టిలో పడేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించినా ఇండ్లనూ కూల్చి వేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి చర్యల ద్వారా కోర్టు బయటే పాలకులు నేరాలను నిర్ధారించినట్లవుతున్నది. దీంతో నిందితులకే కాకుండా వారి కుటుంబాలకు సైతం శిక్షలు వేసినట్లవుతున్నది. ఒక వ్యక్తి చేసిన నేరానికి ఒక కుటుం బానికి సామూహికంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఇలాంటి చర్యలకు రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో చోటులేదు. ఇదిలా ఉంటే ఇండ్లను కూల్చివేయడం ద్వారా సదరు నిందితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నిలువ నీడ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. నివాస గృహాన్ని కలిగి ఉండటమనేది ప్రాథమిక హక్కుగా గతంలోనే పలు కేసుల్లో కోర్టు తీర్పులుండగా ఎలాంటి తప్పు చేయకున్నా ఆ కుటుంబాలు ఆ హక్కును కోల్పోతున్నాయి.
సెల్‌:9640466464
ఫిరోజ్‌ ఖాన్‌

Spread the love