నెమలి కన్నుల శోకం…

.

(”కాళ్లు కడిగి నెత్తిన సల్లుకుంటే –
కిరీటం కింద పడతదా!
అహంకారం తలకెక్కినకాడ-
అంటరానితనం పోతదా!!”)

కడకడలకు మూలమూలకు ఓకరింత లోకానికి
వొచ్చొరలపొంటి పంచలకు నెట్టిన
మెరిగే పరిగే పరిగడుపులం
కలోగంజో తాగి కాలానికి ఎదురెక్కే
ఎండిన డొక్కలోలే మండే ల్యాత పొద్దులం
కొండ కోనలు అఖండ
అస్తిత్వపు ఆదిస్వరాల
జీవనదల నవ్వుల ఊటసెల్మేల
అలల మీద ఉయ్యాలలూగే
రేలా పువ్వుల రాగాలం

ఏ !పాయదేరులోడు ..
పాపుతుండో? ప్రపంచాన్ని ..
వాని నోట్లే మన్నువోసి వాని సేతులకు కంపగొట్ట!
మనిషిని మనిషిగా సూడని-
వానిమీద ఇస్సిని యిసిరికొట్ట!!

దోపిడికొండ్రిగాడు ఖండ ఖండాలుగా
బొండిగొర్కే కొనవూపిరితో జక్మీ దేహాలు
ఆవాసాల ఆనవాళ్లకు గూడెం గుండెకు
అడవి ఆత్మకు దూరంగా
సిల్లక సిత్తుర్లు సిందరవందరగా
యిసిరివేయబడుతున్న జిందగీలు
పచ్చి పరదేశిలం వనవాసులం
ఈ దేశ మూలవాసులం

జమీన్‌ జంగల్‌ పస్క ఫలం ఆకు అలం
ఆత్మగౌరవాన్నిఅడధరిమిగా గుంజుకుంటే
అర్మంద్రమై కాటగల్సి దిక్కు దీములేని
నెమలి కన్నుల శోకాలమైతిమీ!
ఏడ! పూలగం పొత్తివోసి
కూరాడు బెట్టి కూడుందామంటే!
ఈ !దునియంతా..విషపు కొండిలనెత్తి
కాటేసే ఇంగిలికాల తావురాలే!!

పురుకాషిపురుగు పుల్లెందల మనిషి మీద
ఎక్కువ కులం అని ఎగసిపడే కొండెంగ
మొకపోడు కండ్లకు కావురమెక్కి
అతిలావు జులుం తోటి
ఇప్పపువ్వు శిరస్సు మీద ఇకారంగా ఉచ్చ పోస్తే!

కడుపంతా మసులుకుంట
ఆగ్రహంతో భగభగమండి రగులుతున్న
గూడాల కొర్రాయిల సెగకు
కొత్తగా సింగారించుకున్న సింగోలు ఇజ్జత్తో
యాడ !తల పెట్టుకోను జాగలేక
నక్కింది అశోకుని పాదాల కింద దేవులాడుకో …
కలం కత్తిపట్టి లడాయిసేయనంతవరకే మీ బడాయి
మేముబ్యాతగీసి పోరాడనంతకాలమే ఈ బానిసత్వం
… … …
గుల్లేడు పేగులు నెత్తికెత్తుకోని
గుడ్డి దీపాలు ముట్టిచ్చుకోని
కాశెగోసి పోసుకోని కైరత్గా బదురుకున్నం
ఇప్ప సారదాగి ఇల్లంబులు పట్టి ఇసిరెలు నూరుకున్నం

తుడుం దెబ్బలు దుల్దుమ్మలు బరిసెలుఎత్తి
దండు దండులుగా జంగుకు కదులుతున్నం
లఫంగుల్లారా లాగులు వూడేదాకా తన్ని తరుముతం
ఏడికేలి సేపోయచ్చిండ్రో..! ఆడికి వురికేదాకా….!
– డా.పొన్నాల బాలయ్య, 9908906248

Spread the love