నగమైన సమాజం..!

నేను ఈ దేశపు సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దేశంలో పరిణామాలు చూస్తే ఆందోళన కలుగుతోంది. ప్రత్యేకంగా మణిపూర్‌లో తెగల ఘర్షణ ఇప్పటికే ఎంతోమందిని బలిగొంది. మహిళల్ని వివస్త్రలను చేసి ఊరిగేంచి లైంగికదాడి చేసి మరీ హత్యలు చేస్తున్నారు. ఎందుకింత దారుణాలకు తెగబడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి అనేక విషయాలకు కారణాలు వెతికితే అసలు దోషి కేంద్రం. మతం మాటున తెగల మధ్యన ఘర్షణ పెట్టి చోద్యం చూస్తోంది. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తోంది. ఇది బాధ్యతారహితమైన పాలనకు నిదర్శనం. మణిపూర్‌ రాష్ట్రంలో ఉన్న మైతి తెగలు ఎస్టీ హోదా కావాలని కోర్టులో పిటిషన్‌ వేయగా దాన్ని స్వీకరించిన కోర్టు దానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో మిగిలిన కుకీ, నాగా తెగలు ఆ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తూ రోడ్డెక్కారు దాంతో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి అలామొదలైన గొడవలు కాస్త మత ఘర్షణలుగా మారాయి. బిపీనామ్‌ గ్రామంలో మే 4న మిట్ట మధ్యాహ్నం కుకీ, నాగా తెగలకు చెందిన ఇద్దరి మహిళలను వివస్త్ర చేసి సామూహిక లైంగికడాడికి పాల్పడి మానవ మృగాల మాదిరి వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. ఒక తల్లిని నగంగా బహిరంగంగా తిప్పుతూ ఆనందిస్తుంటే ఇందుకేనా 75సంవత్సరాలుగా నిర్మిస్తున్న స్వతంత్ర భారతం? మణిపూర్‌లో వివస్త్రను చేసింది ఒక స్త్రీని కాదు, నీ తల్లి అస్తిత్వాన్ని, నీ దేశపు గౌరవాన్ని. రెండు జాతుల మధ్య జరుగుతున్న పోరాటాన్ని రెండు మతాల పోరుగా చేసి నడిపిస్తున్న కుళ్లు రాజకీయాల మారువేషం కోసమా ఈ దేశ నిర్మాణం. వేదాలు పుట్టిన నేల అని గర్వంగా చెప్తారు కదా! సనాతన ధర్మానికి తార్కాణమని జబ్బలు చరుస్తూ అరుస్తారు కదా! మరి నీ తల్లి అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే కనీసం నోరు కూడా మెదపవా? ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అంత బహిరంగంగా కెమెరాల ముందు కనబడుతున్నా ఈ దేశపు ప్రతీకలు న్యాయస్థానాలు, రక్షక నిలయాలు కళ్ళుండే నిద్రపోతున్న తీరును చూస్తుంటే… బాధే స్తోంది. మానవతా విలువలని మరిచి మైకంలో ఉంటే దీని కోసమా వేలాది గుండెలు త్యాగాలు చేసి సాధించిన స్వతంత్రమా అనిపిస్తుంది.
ఇలా రోజుకొకడు, వీధికొక్కడు మహిళల్ని నగంగా నిలబడుతుంటే సమాజం తలవంచుకొని తప్పుని ఆమోదిస్తుంటే ఇంతకుమించిన రాక్షసత్వం రాక్షస రాజ్యం ఉంటుందా? దేశ గౌరవం అత్యున్నత స్థాయికి పోవాలి అంటే పెద్ద పెద్ద విగ్రహాలు, అతిపెద్ద నిర్మాణాలర, రాజమార్గాలు నిర్మిస్తే సరిపోతుందనుకుంటే అది సిగ్గుచేటు ఈ దేశం ఏనాడైతే స్వేచ్ఛకి, స్వచ్ఛతకు ఆదర్శంగా నిలుస్తుందో ఆనాడే కదా నువ్వు గొప్ప అంటూ నిలబడేది. నేను ఈ ఒక్క సంఘటన గురించే మాట్లాడటం లేదు. ఈ దేశంలో అడుగడుగునా జరుగుతున్న ఇలాంటి వందలాది ఘటనల గురించి మాట్లాడుతున్న సంస్కారం మా నరనరాల్లో ఉంది అంటూ విర్రవీగుతారు కదా! ఒక స్త్రీని వివస్త్ర చేసిన సంస్కారం ఈ దేశం తాలూకు వీరత్వమా అని ప్రశ్నిస్తే ఏంచేస్తారు.? నాకైతే ఆనాటి కౌరవసభ గుర్తుకొస్తుంది, కీచకులంతా ఏకమై రాజకీయాల రంగును పులు ముకుని ఉన్నారా అనిపిస్తుంది. ఈ దేశపు మూల సంపద యువతే అంటారు కదా! అలాంటి యువత కూడా మౌనంగా ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మౌనానికేనా పీహెచ్‌డీలు, గౌరవమైన డిగ్రీలు చదివింది. నాకు అడవి కాలపు రాతియుగం కూడా ఎంత ఘోరంగా లేదేమో అనిపిస్తుంది. మృగాల మాదిరి వేటాడుతుంటే. దీనికి అడవి చట్టాన్ని అమలు చేయాలని అనిపిస్తుంది. ఎంతో గొప్ప గొప్ప పోరాటపు వీరులు పుట్టిన గడ్డకి ఇంత తుచ్చమైన స్థితియా! కులం అంటూ అగ్గి రాజేసి ఒక స్త్రీ ఆత్మాభిమానాన్ని దహనం చేయటం మన సంకుచితమైన మనస్తత్వాలకు అది ఒక బలమైన నిదర్శనం. రాబోయే తరాలకు భవిష్యత్తులకు నువ్వు నేర్పిస్తున్న వ్యక్తిత్వం వికాసం ఇదేనా! జనగణమన అంటూ ప్రతిరోజు పాడే జాతీయ గీతం ఉత్తిదేనా? ఒక రాజ్యం ఒక సమాజం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు దారుణం అధికార ఆపేక్షతో ఎంత తారాస్థాయికైనా దిగజారి పోవటం, దీన్ని దేశభక్తి అని మళ్లీ అనడం కూడా మీకే సాధ్యం. ఇలాంటి వ్యక్తులకి మళ్లీ మళ్లీ మనం రాజ్యాధికారం అందించడం నీచాతి నీచం.
ఇలాంటిదే మీ ఇంట్లో ఉన్న తల్లికో చెల్లికో జరిగితే ఇలాగే మౌనంగా ఏమీ పట్టనట్లు ఉంటావా? దిక్కులన్నీ పగిలి పోయేటట్లు అరుస్తావా లేదా! ఇంత జరిగినా శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలను, రాజకీయ సిద్ధాంతాలను చూస్తే ఒక్కసారిగా ఈ నగపు సమాజాన్ని దహించి వేయాలన్న ఆక్రందన నాలోకి వస్తుంది. ఈ రాజ్యం ఎవరిని ఎక్కడ వదిలిందని ఈ దేశానికి పేరును పతకాలను తెచ్చిన స్త్రీలను గౌరవించేది పోయి లైంగికదాడులకు పాల్పడితే దానికి నిరసనగా నిరసిసే,్త వాళ్లని ఉక్కుపాదంతో అణిచివేస్తుంటే ఇలాంటి రాజ్యం కోసమా ఓటు వేస్తుంది? ఇలాంటి రాజ్యంలోనా మనం జీవిస్తున్నామని అనిపిస్తుంది. సందు దొరికితే చాలు మేధావులు అంటూ, విశ్లేషకులు అంటూ టీవీల్లో దూరిపోయి ‘ఇది ప్రజా స్వామ్యదేశం. సమాఖ్య విలువలకు చిహ్నం’ అంటూ భజనలు చేస్తారుగా… కనీసం ఒక్కరికి కూడా అప్పుడు గుర్తు రాలేదా? ప్రజాస్వామ్య దేశంలో ఒక స్త్రీని వివస్త్రను చేసి ఊరేగించి నప్పుడు? మతవిశ్వాసాల ఆధారంగా పాలించేవాళ్లను, మానవ మృగాలు వెనక్కివేసు కొచ్చేవాళ్లను పాతాళానికి తొక్కేయాలి. నిత్య నూతనంగా మనల్ని మనం నిర్మించుకోవాలి. లేదు… నేను ఇలాగే ఉంటాను… అంటావా రేపు నీ ఇంటికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది!

టి. వెంకట్‌ కౌశిక్‌
7601061383

Spread the love