ఉమ్మడి పౌరస్మృతి కన్నా పాలనాస్మృతి అవసరమెక్కువ!

ఎన్నికల వేటలో ప్రజానీకాన్ని విభజించడానికి, ప్రజల మనసుల్లో ద్వేష కుంపటిని రాజేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారు వేసిన దుర్మార్గపు ఎత్తుగడ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ (యూసీసీ) ప్రతిపాదన. ఎదుటివాడి ముక్కులో మాత్రమే మలినముందని చెప్పే ప్రయత్నమిది. ఇస్లాంపై బురదజల్లి లౌకికత్వాన్ని సమర్థించే పార్టీలను ఒంటరిజేసే కుటిలత్వమిది. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌కు సంబంధించిన డ్రాఫ్ట్‌, అనగా ”సదరు సివిల్‌ కోడ్‌ పరిధిలోకి ఏయేఅంశాలు వస్తవి, వాటిపైన ఏ రకమైన మార్పులు, చేర్పులు వగైరా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోతున్నది” అనే అంశాలు కలిగిన సమగ్ర డాక్యుమెంట్‌, తయారు చేయకుండానే యూనిఫాం సివిల్‌ కోడ్‌ పైన సాధారణ ప్రజానీకం నుండి లా కమిషన్‌ అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నాలు కేంద్రం చిత్తశుద్ధి లేమి, కేవలం భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం కోసమే జరుగుతున్న ప్రయత్నమని మనకు స్పష్టమవుతున్నది. న్యాయ సమ్మతమైన, ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన సున్నితత్వపు అంశాల పైన న్యాయశాఖ, కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన విధానాలు రూపొందించకుండా, యూసీసీ లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలను తెలుపకుండా, నూతన ప్రతిపాదనల ఫలితాలను వివరించకుండా సామాన్య ప్రజానీకం నుండి అభిప్రాయాన్ని సేకరించడం రాజ్యాంగబద్ధ పాలన కాదు. ఈ అసంబద్ధ ప్రతిపాదనలను వ్యతిరేకించే వారిని తప్పుగా చిత్రీకరించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది. దేశ పరిపాలనను ప్రభావితం చేసేవి ”కామన్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌” కామన్‌ సివిల్‌ కోడ్‌ కాదు. పౌరస్మృతికి సంబంధించినవి ఏవైనా సరే మితిమీరిన వివాదాస్పదమైనప్పుడు నేరపూరిత చట్టాల పరిధిలోకి వస్తాయి. కుల మత ప్రాంత వ్యత్యాసం లేకుండా క్రిమినల్‌ ప్రొసీజర్‌ దేశమంతా ఒకే విధంగా అమలు జరుగుతున్నది. ఉమ్మడి పౌరస్మృతి లేనంత మాత్రాన జరిగిన నష్టాలేమీ లేవు. దీనిని తీసుకురావడం చేత ఫలానా వాళ్ళని కట్టడి చేయొచ్చు అన్న భ్రమలు కల్పింపజూస్తున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని తెచ్చారు. ఫలితమేమంటే మనోవర్తి కూడా చెల్లించే అవకాశం లేకుండా సదరు దోషి జైలుపాలవుతున్నాడు. ఇదా బాధితురాలు కోరుకునేది? ”ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు, విడాకులకోసం కోర్టును సంప్రదించి, పరిహారం చెల్లించి, ఎవరి దారిన వారు నడవండి” అనే చట్టం తేవాల్సిందిపోయి, దాన్ని నేరపూరితం జేస్తే కుటుంబమంతా రోడ్డున పడుతుంది. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన ముస్లిం నేరస్తుడైనప్పుడు, విడాకుల నోటీస్‌ పంపించిన హిందువు నేరస్తుడు కాడా? ఈయనకి మాత్రం రాచమర్యాదలతో విడాకులు మంజూరు చేస్తారా!
వివాహం, విడాకులు, పిల్లల సంరక్షణ, వారసత్వపు హక్కు వంటివి ప్రధాన అంశాలు యూసీసీలో భాగంగా భావించబడుతున్నవి. అయితే వివాహాలు సంప్రదాయాలను సివిల్‌ చట్టాలే కాదు క్రిమినల్‌ చట్టాలు కూడా ఇప్పటివరకు శాసించలేకపోయినవి. వరకట్నం నిషేధం కాని జరుగుతున్నది ఏమిటి? జరిగిన అఘాయిత్యాల్లో నమోదు కాబడుతున్నవి కూడా చాలా తక్కువ. దేశమంతా కుల, మత రహిత కుటుంబ సంబంధాలను – వివాహాలు, వ్యవహారాల అంశాలలో – బలవంతంగా అమలుపరచడం సాధ్యపడదు. అన్ని మతాల్లోనూ గుడిలోకి ప్రవేశానికి, పూజకి పరిమితులున్నవి. వీటన్నిటిని కామన్‌ సివిల్‌ కోడ్‌ క్రిందకి తీసుకురాగలమా? పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, ఆస్తిపాస్తుల పంపకాలు మొదలగునవన్నీ పౌరచట్టాల పరిధిలోనే ఉన్నప్పటికీ వివాదాస్పద మైనప్పుడు కోర్టులు ఎలాగూ పరిష్కరిస్తున్నాయి. విడాకుల అనంతరం మనోవర్తికి సంబంధించి ముస్లిం పర్సనల్‌ లా బోర్డు విభేదించినప్పటికీ 1985లోని షాబానో కేసులో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రోగ్రెసివ్‌గా బాధితురాలికి అనుకూలంగా తీర్పును ఇవ్వడం జరిగింది. కామన్‌ సివిల్‌ కోడ్‌ చట్టాల ద్వారా మాత్రమే సాధ్యపడదు. దీనికి అంతిమ పరిష్కారం సామాజిక ఎదుగుదలలోనే ఉన్నది. ఒక వేళ ఈ యూసీసీ వ్యక్తిగత ఆచారాలను కట్టడి చేసేలా రూపొందిస్తే మతం పేరుమీద చలామణిలో ఉన్న అనేక సంస్థలు భావోద్వేగాలను రెచ్చగొట్టి అనిశ్చితికి కారణ మవుతాయి. శబరిమల ఆలయంలోకి అనుమతినివ్వాలని కోరిన వారికి అనుకూలంగా సుప్రిం కోర్టు తీర్పునిస్తే సదరు తీర్పును సాక్షాత్తూ కేంద్ర మంత్రులే ధిక్కరించారు. ఇస్లాం మతాచారం ప్రకారం మసీదుల్లోకి మహిళలకి అనుమతి లేదు, కొన్ని హిందూ దేవాలయాల గర్భగుడుల్లోకి కొందరికే అనుమతి ఉన్నది. బహుభార్యత్వం చెల్లదు, కాని, ఫిర్యాదు చేయబడినప్పుడే అది నేరం. ఆస్తిపాస్తుల పంపకాల్లో వివాదాలేర్పడినప్పుడు కోర్టులు సమానతీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. వీటన్నింటినీ యూసీసీ పరిష్కరించగలదా!
ఒక రిపోర్టు ప్రకారం 1971 నాటికి మొత్తం బహుభార్యత్వపు కేసుల్లో ముస్లింలకి సంబందించినవి కేవలం 5.79శాతం, ఎక్కువ శాతం అదివాసీలు, జైనులు మొదలగు వారే ఉన్నారు. ఆ తరువాతి జనాభా లెక్కల్లో ఈ గణాంకాల నమోదుకు ‘కాలం’ (ప్రస్తావన) తీసేశారు. మహిళా హక్కులకు పెద్దపీట వేయడానికి స్వతంత్ర భారత మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ బిల్లును ఆనాటి మితవాద శక్తులు వ్యతిరేకించడమే కాదు, శబరిమల అంశంలో సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించిన బీజేపీకి ఉమ్మడి పౌరస్మృతిని గురించి మాట్లాడే హక్కు లేదు. దేశంలో 400మంది పైన పార్లమెంటు సభ్యులు, 1000మంది దాకా శాసనసభ్యులు గెలిగిన బీజేపీలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా 20కోట్ల ప్రజానీకి సంబంధించిన ఒక ముస్లిం లేడు. ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని వర్గాలకు సంబంధించిన చట్టాలను రూపొందిస్తామనడం హాస్యాస్పదమవుతుంది. నిజానికి ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి కన్నా ముందు, ఉమ్మడి పాలనాస్మృతి అవసరం ఎక్కువగా కనిపిస్తున్నది. వివాదాలకు కారణమైన 370ఆర్టికల్‌ రామజన్మభూమి వంటి వాటిపై నిర్ణయం తీసుకున్న కేంద్రం మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై ఎందుకు కదలడం లేదు. అంతేకాకుండా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నప్పుడు అదే ప్రాతిపదికన ప్రజాప్రతినిధుల ఎన్నిక ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేవలం ధన వంతులకు నెలవులుగా మారిన చట్టసభల్లో వ్యక్తుల సంపద ప్రాతిపదికన కూడా సీట్లు ఎందుకు కేటాయించ కూడదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంచేత ఎదుటివారిపై ఎగదోసేముందు మన ముక్కులో ఏముందో వేలు పెట్టుకొని చూసుకోవడం మంచిది.
అయితే వ్యక్తిగత, సాంప్రదాయ స్వేచ్ఛకు భంగం కలుగకుండా ఉమ్మడి స్మృతిని పాటించమని చెప్పడం కచ్చితంగా ఆహ్వానించదగినదే. అయితే ఇందు లో కులాలకు, మతాలకు లేదా ప్రాంతాలకు ప్రత్యేకమైన మిన హాయింపులేవి ఇవ్వని నిష్పక్షపాతం ఉండాలి. ఉమ్మడి పౌరస్మృతికి భంగం కలిగినప్పుడు వర్తించే క్రిమినల్‌ చట్టాల ప్రతిపాదన కూడా అందులో భాగమై ఉండాలి. ఇలాంటి మరింత విశాల దృక్పథంతో ఉమ్మడి పౌరస్మృతికి సంబం ధించిన డ్రాఫ్ట్‌ సిద్ధం చేసిన తర్వాత మాత్రమే దానిని ప్రజాబహుళ్యంలో చర్చకు పెట్టాలి. పన్నులు, పంపకాల అంశంలో ప్రజల అభిప్రాయాలను సేకరించని ప్రభుత్వం ఈ సున్నిత అంశాన్ని ప్రస్తావించడంలో అంతర్లీన అంశం లేదని అనుకోలేం
. -జి.సునితారాణి, 9440543563

Spread the love