మణిపూర్‌ మారణకాండకు బాధ్యులెవరు?

భారతదేశంలోని మణిపూర్‌ రాష్ట్రంలో మైతేయిలు, కూకీలు అనే రెండు జాతుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర జనాభా పరంగా మైతేయిల జనాభానే ఎక్కువ, ఆ రాష్ట్ర శాసనసభలో 60సీట్లు ఉంటే 41సీట్లలో మైతేయిల ప్రాతినిధ్యం ఉంటుంది. మైతేయిలలో అత్యధిక భాగం హిందువులు, కొంత వరకు ముస్లింలు కూడా ఉన్నారు. మైతేయిలు షెడ్యూల్‌ కులాల్లో, ఓబీసీ కులాల్లో ఉండి రాష్ట్రంలో మెజారిటీ వర్గంగా ఉన్నారు. వీళ్ళు ఇంఫాల్‌ వంటి పట్టణాల్లో, కొండ లోయ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కూకీలు, నాగాలు కొండపై నివాసం ఉండే గిరిజనజాతులు. జనాభాలో మెజారిటీ మైతేయిలే అయినా, రాష్ట్రంలో అత్యధిక భూభాగం మాత్రం కుకీలు, నాగాల చేతుల్లోనే ఉంది. రాష్ట్రంలో కూకీలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఆర్టికల్‌ 371(సి) అమల్లో ఉంటుంది, గిరిజనుల భూములను కొనడానికి కానీ అమ్మడానికి కానీ అధికారాలుండవు. మైతేయిలు అక్కడి గిరిజనుల భూములపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, భూముల అమ్మకం, కొనుగోలుకు స్వేచ్ఛా మార్కెట్‌ కోసం యత్నిస్తూనే, తమనూ గిరిజన తెగగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కూకీలు చట్టసభల్లో తమ ప్రాతినిధ్యం పెంచాలని, ఎక్కువ శాసనసభా స్థానాలు తమకు కేటాయించాలని, జాతి స్వయం ప్రతిపత్తిని కాపాడాలని కోరుతున్నారు. ఈ రెండు అంశాల్లో జాతుల మధ్య వైరుధ్యమే నేటి మణిపూర్‌ మారణకాండకు ప్రధాన కారణం. దీనిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని బిరేన్‌ సింగ్‌ ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అక్కడి గిరిజనుల భూములను బడా బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు అక్కడి బీజేపీ నేతృత్వంలోని బిరేన్‌సింగ్‌ ప్రభుత్వం మైతేయిలను కూకీలపై ఉసిగొల్పుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
77రోజుల వ్యవధిలో 150మంది ప్రాణాలు కోల్పోయారు, 400మంది గాయాలపాలయ్యారు, 60వేల మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్‌ రాష్ట్రంలో కాంగ్‌ పోకి జిల్లాలో ఇద్దరు కూకీ-జో అనే జాతుల మహిళలను వివస్త్రలను చేసి, రేప్‌ చేసి, తండ్రి తమ్ముడిని చంపేసిన ఘటన భారత సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేసు నమోదు చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. ఇంత జరిగినా దేశప్రధాని, హౌంమంత్రి నోరు మెదపడం లేదు. మన పార్లమెంటులో ఈ అంశంపై చర్చే లేదు, యూరప్‌ దేశ పార్లమెంటులో మణిపూర్‌ అల్లర్లపై శాంతి, భద్రతలు గూర్చి చేసిన తీర్మానం ఆ దేశానికున్న కనీస సృహ మనకు లేకుండాపోయింది. శాంతి భద్రతలు అదుపు చేసేందుకు అనే పేరుతో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. జాతీయ మహిళా కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా కనీసం స్పందించడం లేదు. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్యం అన్నదే లేదు. అత్యున్నత న్యాయస్థానం కలగజేసుకున్నా పాలకుల్లో కనీస చలనం లేదు. పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి అనడం మరింత విస్తుపోయేలా చేసింది. తమ స్వార్థ రాజకీయాలను పక్కనపెట్టి ఇరు జాతుల మధ్య వైరుధ్యాలను పరిష్కరించాలి, గిరిజనుల హక్కులను కాపాడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాలి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెజారిటీ వర్గ ప్రజల ప్రతినిధా లేక మొత్తం రాష్ట్ర ప్రజల ప్రతినిధా తేల్చుకోవాలి, తన పదవికి రాజీనామా చేయాలి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలే ఈ అల్లర్లకు బాధ్యత వహించాలి. బాధితులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలి.
బి. వీరభద్రం

Spread the love