పునాది విద్యే భవితకు ప్రాణం ‘దేశం కోసం సైన్స్‌’ ‘ప్రజల కోసం సైన్స్‌’ ‘శాంతి కోసం సైన్స్‌’

ఈ నినాదాలతో భారత జన విజ్ఞాన సమితి (బిజివిఎస్‌) 1987లో దేశవ్యాప్తంగా శాస్త్ర కళాజాత నిర్వహించింది. పాఠశాలలు, కళాశాలల్లో, బహిరంగ ప్రజానీకంలో కళారూపాలు ద్వారా శాస్త్ర విషయాలను ఆ సందర్భంగా మున్ముర్‌ ప్రచారం గావించింది. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌ (కె.ఎస్‌.ఎస్‌.పి.) ఇందుకు తన విశేష అనుభవంతో ఈ మహత్తర ప్రచార ఉద్యమానికి పునాదిగా నిలిచింది. ఆ ఏడు అక్టోబరు 2న (గాంధీ జయంతి) దేశంలోని వివిధ మూలల నుండి ప్రారంభమైన ఈ ఐదు ప్రధాన కళాయాత్రలు భిన్న భాషల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చుకుంటూ లక్షలాదిగా ప్రజలను కలుసుకుంటూ నవంబర్‌ 14న (నెహ్రూ జయంతి) మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరానికి చేరుకున్నారు. అక్కడ బహుళజాతి కంపెనీ యూనియన్‌ కార్బైడ్‌ అంతకుముందు చేసిన అమానుష దురాగతాన్ని (గ్యాస్‌ ట్రాజడీ-విషవాయువు లీకు) ఎండగడుతూ, ప్రజలకు సైన్సును చేరువు చేస్తామని అసంఖ్యాక మేధావులు, కళాకారులు ప్రతినబూనారు. హాజరైనవారికి ఆ ప్రతిజ్ఞ మరచిపోలేని ఓ ఉద్విగ జ్ఞాపకం. ఆ ఉత్సాహంతో 1988 ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్‌ జన విజ్ఞాన వేదిక ఆవిర్భవించిన విషయం విదితమే.
ఈ శాస్త్ర విజ్ఞాన ఉద్యమం ఉత్ప్రేరకంగా బి.జి.వి.ఎస్‌. సారధ్యంలోనే 1990లో దేశవ్యాప్తంగా అక్షర కళాయాత్రలు నడిచాయి. కొనసాగింపుగా ఎన్నో రాష్ట్రాలు, జిల్లాల్లో, ప్రాంతాల్లో సాక్షరతా ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. రాత్రిబడులు, వయోజన కేంద్రాలు వెల్లువలా ఎక్కడికక్కడ విలసిల్లాయి. 9, 10 తరగతుల విద్యార్థులు కూడా తమ తల్లితండ్రులుకు, పెద్దలకు గురువులై విద్య గరిపిన అనుభవాలు కోకొల్లలు. చదువుకోవడానికి, వయసు పేదరికం అడ్డం కాదని తొంభై ఏండ్ల ముదిసలులు, నిరుపేద వ్యవసాయ కూలీలు సైతం చదువు నేర్చుకుని నిరూపించారు. కేరళ రాష్ట్రంలో సహా పలు జిల్లాలు, ప్రాంతాలు సంపూర్ణ అక్షరాస్యతను సాధించినట్టు అప్పుడు ప్రకటించుకోవడం గమనార్హం.
తకేవలం చదవడం, రాయడం, సంతకం పెట్టడం వేరు. నిత్య జీవితంలో ఆ చదువును ఉపయోగించుకుని ముందుకు అడుగిడటం వేరు. ఆయా ప్రభుత్వాలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, శక్తులు, ఈ సాక్షరతా మహౌద్యమానికి నడుం కట్టాయి. ఆధునిక మానవుని మనుగడకు తిండి, బట్ట, వసతితో పాటు చదువుకూడా ఓ ప్రాధమిక అవసరమని ఐక్యరాజ్యసమితి కూడా ప్రకటించింది. విశేషం ఏమంటే ఆ 1990 సంవత్సరంలోనే మన దేశంలో అధ్వాని రథయాత్ర కూడా నడిచింది. బి.జి.వి.ఎస్‌. రాష్ట్ర అధ్యక్షులు బి.వి.ఆర్‌. విఠల్‌ అక్షర కళాయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ…. ఒక యాత్ర ప్రజలను చీల్చుకుంటూ పోతుంటే, మా యాత్ర చదువుకోసం ప్రజలను కలుపుకుంటూ నడిచిందని తెలిపారు. అన్యాపదేశంగా రథయాత్రను విమర్శించి కళాకారులను ఉత్తేజపరిచారు. ఈ మొత్తం ఉద్యమానికి మూలపురుషుడుగా నిలిచిన శాస్త్రవేత్త ఎం.పి. పరమేశ్వరన్‌ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ… అట్టడుగు శ్రామికవర్గ, ప్రజానీకం, ముందు చదువు నేర్చుకుంటే, ఆ ‘చదువు’ తమ హక్కుల సాధన ఉద్యమానికి పునాదిగా నిలుస్తుందని చెప్పేవారు.
మూడు దశాబ్దాలు గడిచినా దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతున్నది గాని నాణ్యమైన విద్య (క్వాలిటీ ఎడ్యుకేషన్‌) నిత్యజీవితంలో ఉపయోగపడే సాక్షరతావిద్య (ఫంక్షనల్‌ లిటరసీ), అజ్ఞానంథ కారాన్ని పారద్రోలే విజ్ఞాన విద్య (సైంటిఫిక్‌ ఎడ్యుకేషన్‌) ఇప్పటికీ విద్యార్థులకు అందటం లేదనేది యదార్థం. ఇందుకు పాలకుల విధానాలు ఓ ముఖ్యకారణం. అయితే, పెట్టుబడిదారి వ్యవస్థ అందించే విశృంఖుల అభివృద్ధి పరుగు వల మరో ముఖ్యకారణం. అవధులలేని ఈ అభివృద్ధి పరుగు ప్రకృతిని విషతుల్యం చేస్తున్నది. ఏ విలువలు ఏ ప్రమాణాలు పాటించని వ్యక్తిగత స్వార్థం, భోగలాల సత్యంను విద్యార్థులకు నేర్పుతున్నది.
‘అమ్మ… ఆకలి అవుతున్నది అన్నం పెట్టు.’ ఎక్కువగా ఉపయోగించే ఈ వ్యాక్యాన్ని సైతం తప్పులు లేకుండా నూటికి పదిమంది ఉన్నత పాఠశాల విద్యార్థులు రాయలేకపోతున్నారు. మాటకు రాతకు సంబంధం తెగిపోయింది. పిల్లలకు సరైన పునాది విద్య (పౌండేషన్‌ లిటరసీ)ను గరపలేకపోతున్నామని చాలామంది ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు కూడా బాధపడటం లేదు. చాపకింద నీరులా ఈ విపరిణామం జరిగిపోతున్నది. డిగ్రీలు, పోస్టుగ్రాడ్యుయేషన్‌, ఇంజనీరింగ్‌ పట్టాలు మాత్రం విద్యార్థులకు లభిస్తున్నాయి కానీ ఈ పునాది విద్య ఉండదు. తెలుగులో వచ్చిన వస్తున్న అసంఖ్యాక, అమూల్య సాహితీ సంపదంతా వారికి వ్యర్థం. భాష తెలిస్తేగదా సాహితీ మాధుర్యం తెలిసేది. పొడిపొడిగా వాగడం, పేలవంగా మాట్లాడుతూ పరిమితంగా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. చేసేపని (వృత్తి) వేరు – జీవితం వేరు అన్న విధంగా పరిస్థితి దాపురించింది.
ఈ నేపథ్యంలో ఇందుకు విరుగుడుగా కొన్ని సంస్థలు, వ్యక్తులు కృషిచేయడం అభినందనీయం. అవశ్యం. పిల్లలకు పునాది విద్యనే నేర్పడమే పనిగా పెట్టుకుని ట్యూషన్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నప్పటి నుండే చదవను, రాయను ఆసక్తిగా, ఆకర్షణగా చేయడం పట్ల రకరకాల బోధనా ప్రయోగాలు చేస్తున్నారు. కథలను చదివిస్తున్నారు. రాయిస్తున్నారు. బొమ్మల కథల పుస్తకాలను జట్టుగా కూర్చోపెట్టుకుని చదవడం, చదివించడం, బొమ్మలతో కథలు చెప్పిడం, చెప్పించడం, అసంపూర్ణంగా కథలు వదిలి పూరించమనడం, కథలను రాయించడం, కథలను నాటికలుగా మలచి అభినయించడం చేయిస్తున్నారు. తద్వారా పుస్తకాలతో స్నేహం చేయడం, చదవడాన్ని, రాయడాన్ని ప్రేమించడం, అభ్యసించడం, జీవన మాధుర్యాన్ని తమదైన శైలిలో అనుభవించడం, అభివ్యక్తీకరించడం సాధ్యమయ్యేలా కృషి చేస్తున్నారు. ట్యూషన్‌ సెంటర్స్‌తో పాటు లైబ్రరీ సెంటర్స్‌ (గ్రంథాలయ పఠన కేంద్రాలు) ఎక్కడబడితే అక్కడ నెలకొల్పి తోడ్పడాలనే ఉత్సుకతను చూపిస్తున్నారు. మురికివాడలు నుండి అపార్ట్‌మెంట్స్‌ వరకు ఈ కేంద్రాలు అంకురిస్తున్నాయి. గతంలో అక్షరాస్యతా ఉద్యమంలాగనే ఈ పునాది విద్య ఉద్యమంలా ఏర్పడేందుకు పరిస్థితి డిమాండ్‌ చేస్తున్నది. అక్షరాస్యతా ఉద్యమంలో ఎక్కడికక్కడ వాలంటీర్స్‌ ఉద్భవించినట్లే, ఇప్పుడుకూడా ఈ ఉద్యమానికి రిటైర్‌ వ్యక్తులు, చదువుకున్న గృహిణులు, సాహితీపరులు ముందుకు రావడం ముదావహం. ఆ అక్షరాస్యతా ఉద్యమంలో చదువురాని నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పితే, ఈ ఉద్యమంలో చదువుకుంటున్న, చదువుకున్న వారికి పునాది విద్యను నేర్పవలసిన బాధ్యత ఎర్పడింది. ఈ పునాది విద్యే ఉత్ప్రేరకంగా భవితకు ప్రాణం పోస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
అంతర్జాతీయంగా ద్రవ్యపెట్టుబడి ముదిరి వెర్రితలలు వేస్తూ, ఆధిపత్యం, అణచివేత, హింస, యుద్దోన్మాదాలకు తెరతీస్తున్నది. ఫలితంగా ప్రజలు, కష్టజీవుల జీవితం కరిమింగిన వెలగపండులా డొల్లగా మారుతున్నది. ఇలాంటి నేపథ్యంలో పౌర సమాజానికి శాస్త్రీయ భావ (వర్గ) చైతన్యాన్ని నూరిపోయడమే ఏకైక మార్గమని రోజాలగ్జంబర్గ్‌ పేర్కొంటాడు. దట్టంగా పొరలు పొరలు పేరుకుపోతున్న అజ్ఞానాంధ కారాన్ని తుత్తునియలు చేయడం అవశ్యమని చెప్పారు. ‘ఏం జరుగుతున్నదో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని’ అని ఉద్ఘాటిస్తారు.
కె. శాంతారావు
9959745723

Spread the love