ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారత స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కానీ ఇటీవల అది స్వతంత్రతలేని దర్యాప్తు సంస్థగా మారిపోయింది. దర్యాప్తు సంస్థల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మన దేశంలో ఉన్నంతగా ఎక్కడా ఉండదేమో. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి పార్టీలపై అస్త్రాలుగా ఈ స్వతంత్ర సంస్థల్ని వినియోగించుకోవడం ఆనవాయితీ అయిపోయింది. దీంతో అధికారంలో ఉన్నవారికి ఆ సంస్థలు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సిబిఐ కేసులతో కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం జైలుకు వెళ్లారు. ఆయన్ను జైలుకు పంపించడంలో కీలకపాత్ర మాత్రం అమిత్ షాదే. తనను ఒకప్పుడు ఏ సంస్థతో అయితే చిదంబరం జైలుకు పంపించారో, ఇప్పుడు అదే సంస్థతో ఆయన్ను జైలుకు పంపించడంలో షా విజయవంతమయ్యారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే ఒరవడి అనుసరిస్తున్నారు. దీన్ని కొత్తగా వచ్చిన సర్కార్ ఏదైనా మారుస్తుందేమోనని చూసినవారికి నిరాశే ఎదురువుతోంది. కాంగ్రెస్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని బీజేపీ అంతకన్నా ఎక్కువగానే రాష్ట్రాలపై ప్రయోగిస్తోంది. ఎందుకంటే ప్రత్యర్థుల ఆటకట్టించడానికి బ్రహ్మాండంగా అక్కరకొచ్చే ఈ బ్రహ్మాస్త్రాలను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? అందుకే బీజేపీ సైతం అదే బాటలో పయని స్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరినవారి కేసులకు సంబంధించి ఎలాంటి కష్టాలూ ఉండకపోవడమే ఇందుకు నిదర్శనం. పార్టీలో చేరక ముందు వరకు ఉన్న కేసులు కాషాయ కండువా కప్పుకోగానే పక్కకు వెళ్లిపోతున్నాయి. దీంతో తమ భద్రత దృష్ట్యా పలువురు బీజేపీ బాటపడుతున్నారు. ఇలా దర్యాప్తు సంస్థల బూచితోనే భారత్‌లో రాజకీయాలు కొనసాగుతున్నాయి
అయితే ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజరు కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ పదవీకాలం పొడిగింపు అక్రమ మంటూ మోడీ సర్కారుకు మొట్టికాయలు వేస్తూ జస్టిస్ బిఆర్ గౌరవ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజరు కరోల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై11, మంగళవారం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వును కొట్టిపారేసింది. అంతేగాకుండా ఈ నెల 31న సంజరు కుమార్ మిశ్రా ఈడీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈలోగా ఈడీ నూతన డైరెక్టర్ నియమకాన్ని పూర్తి చేయాలని కేంద్రానికి సూచించింది. దాంతో సంజరు మిశ్రా ఈనెలాఖరుకు తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 18 వరకు సంజరు మిశ్రా ఈడీ డైరెక్టర్‌గా కొనసాగేవారు. ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సిబిఐ, ఈడీ డైరెక్టర్‌ల నిర్ణాయక రెండేండ్ల పదవీకాలం పూర్తయ్యాక మరో మూడేళ్ల పాటు వారి పదవీకాలాలను పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను కట్టబెట్టిన చట్టాలకు సవరణలు జరిగిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయితే ఈ తీర్పుపై కేంద్రహౌంమంత్రి అమిత్ షా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదని, అక్కడ ఎవరున్నా వంశపారంపర్యంగా రాజ్యాలు ఏలుతున్నవారి అవినీతి కోటలను బద్దలుకొట్టి తీరుతారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మిశ్రా పోయినా, ఆ స్థానంలో వచ్చిన వారు మిమ్మల్ని వదిలి పెట్టరన్న హెచ్చరిక కూడా హౌంమంత్రి మాటల్లో వినిపించింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమంటే మిశ్రా కాకపోతే మరొకరు అని ఇంత సులువుగా తేల్చేసిన అమిత్ షా అదే మిశ్రాకు సుప్రీంకోర్టు కూడదన్నా సరే పొడిగింపులు ఇవ్వడం ఎందుకు? ఆయన కోసమే ఓ ఆర్డినెన్సు తేవడం ఎందుకు? అన్నదే అంతు చిక్కని ప్రశ్న. హోంమంత్రి ప్రవచించినట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యక్తికి అతీతమైన ఉన్నత వ్యవస్థే కావచ్చు కానీ, తమ ఆదేశాలను శిరసావహించే అస్మదీయులకు దానిని అప్పచెప్పినప్పుడే దాని ఔన్నత్యం దిగజారిపోయింది. ప్రభుత్వం అభ్యర్థన మేరకు, అధికారాల బదలాయింపు సవ్యంగా జరిగేందుకు సంజరు మిశ్రాను ఈ నెల చివరి వరకూ ఉండనిచ్చింది సుప్రీంకోర్టు. నవంబర్ వరకూ కొనసాగనివ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు సరేనంటే తన తీర్పుకే అర్థం లేకుండా పోతుంది.
వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అని ఇప్పుడు హోంమంత్రి గొప్పగా మాట్లాడుతున్నారు కానీ, కేవలం ఈ వ్యక్తి కోసమే ఆయన ప్రభుత్వం అన్ని సంప్రదాయాలను, నిబంధనలను తుంగలో తొక్కింది. పైగా న్యాయవ్యవస్థను, పార్లమెంట్‌ను అవమానపరిచి అస్మదీయుడి పదవీకాలాన్ని తమకు నచ్చినంతకాలం పొడిగించుకున్నది కాక, ఇంకా ఉండాలంటూ న్యాయపోరాటాలు కూడా చేస్తోంది. అవినీతిని చీల్చి చెండాడుతున్న మిశ్రాను తప్పించడానికి అవినీతిపరులంతా ఏకమయ్యారని రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని న్యాయస్థానాల్లో వాదిస్తోంది. డైరెక్టర్‌గా రెండేండ్ల పదవీకాలం పూర్తయిన తరువాత ఆయనను వదిలి పెట్టి ఉంటే, వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అన్న మాటలకు అర్థం ఉండేది. కానీ మరో ఏడాది పొడిగింపు కోసం 2018నాటి నియామక ఉత్తర్వులను మూడేండ్లకు వర్తించేలా వెనక్కుపోయి మరీ సవరించింది. సుప్రీంకోర్టు ఈ చర్యను కాదన కుండానే 2021 నవంబరు 17 తరువాత ఆయన ఆ పదవిలో కొనసాగకూడదని ఆదేశించింది. దీనికి విరుగుడుగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పట్టుమని 15రోజుల్లో ఉండగా, రెండు ఆర్డినెన్సులతో ఈడీ, సిబిఐ సంచాలకుల పదవీ కాలాన్ని ఐదేండ్లకు పెంచింది. దానితో పాటు ఏడాదికొకసారి చొప్పున మూడుసార్లు గడువు పొడిగించుకొనే వెసులుబాటు కూడా పాలకులకు కల్పించుకున్నారు. ప్రతిపక్ష నాయకులను ఎంతగా వేధిస్తే అన్ని పొడిగింపులు అందుకోవచ్చన్న సందేశం ఇందులో ఉన్నదని విపక్షాలు అప్పట్లోనే విమర్శించాయి. ఉద్యోగ కాలాన్ని పెంచడం దేశ శ్రేయస్సుకు ఉపకరించేదే అయితే ఆ సవరణలేవో పార్లమెంటులో చర్చించే చేయవచ్చు కదా? అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్డినెన్సులు చేయాల్సిన పాలకులు మిశ్రాను నిలబెట్టుకోవడానికే దానిని వాడారన్నది వాస్తవం. ఆయన అధీనంలో రెండు వేలకు పైగా దాడులతో రూ.65వేల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసి కొత్త సిబిఐగా అవతరించిన మాట నిజమే కానీ, అందులో విపక్షనేతలు, ఆయా పార్టీలతో అనుబంధం ఉన్న సంస్థలు ఎన్నో, బీజేపీ శ్రేయోభిలాషులు, అనుకూల కార్పొరేట్ సంస్థలు కూడా ఎన్నో లెక్క విప్పితే బాగుంటుంది.
ఇప్పటి వరకూ మనీలాండరింగ్ ఆయుధంతో ఈడీ అడుగు పెట్టని విపక్ష రాష్ట్రమంటూ దేశంలో ఏదీ మిగల్లేదు. 2021 తరువాత మిశ్రా కొనసాగింపు అక్రమం, చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం నిర్థారించిన నేపథ్యంలో, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అక్రమమే అవుతాయి కదా! మిశ్రా తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర న్యాయవిచారణ జరపాలన్న డిమాండ్ రాజకీయపరమైనదే కావచ్చు కానీ, అర్థం లేనిదైతే కాదు. సివిసి చట్టంలో సవరణలను సుప్రీం కోర్టు సమర్థించిందని పాలకులు గుర్తుచేస్తున్నారు కానీ, ఆ సవరణల వెనుక ఒక వ్యక్తి కొనసాగింపు లక్ష్యం ఉన్న విషయం న్యాయస్థానానికి కూడా తెలుసు, శాసనం చేసుకొనే హక్కును అది కాదనలేక పోవచ్చు కానీ, ఆ వ్యక్తి కొనసాగింపును న్యాయస్థానం తప్పుబట్టడం కేంద్ర ప్రభుత్వానికి అవమాన కరమైనదే. న్యాయస్థానం తీర్పు మిశ్రాకు పరిమితమైన అంశమే కావచ్చు. కానీ, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఆయా సంస్థలను యస్‌బాస్‌లతో నింపుతూ వాటిని ఆయుధాలుగా వాడుతు న్నారనడానికి మిశ్రా ఉదంతమే ఒక నిదర్శనం.
నాదెండ్ల శ్రీనివాస్
9676407140