క్రిస్పీగా… టేస్టీగా…


మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది. చినుకులు రాలుతున్నప్పుడు కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటుంటే భలే రుచిగా ఉంటాయి. అయితే పిల్లలు, కొంతమంది పెద్దవారు వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ కాలంలో బేబీకార్న్‌ కూడా ఎక్కువగా దొరుకుతాయి. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వీటితో కొన్ని రకాల స్నాక్స్‌ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి కొన్ని రకాల స్నాక్స్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం…
        బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, ఐరన్‌, విటమిన్‌ సి సమద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటితో శారీరక, మానసిక ఆరోగ్యం. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకొనే వారికి చాలా మంచిది. పీచు పదార్ధం సమద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రించేందుకు సాయం చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఇందులోని కెరోటినాయిడ్స్‌ కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫోలేట్‌ అనే పోషక పదార్థం సమద్ధిగా ఉండుట వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
మంచూరియా
కావాల్సిన పదార్థాలు : బేబీ కార్న్‌లు – 12, మైదా – మూడు చెంచాలు, కార్న్‌ఫ్లోర్‌ – రెండు చెంచాలు, ఉల్లిగడ్డ – ఒకటి, ఉల్లికాడల తరుగు – చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు, కారం – చెంచా, వెల్లుల్లి తరుగు – అర చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, చిల్లీ సాస్‌ – చెంచా, సోయా సాస్‌, టమాటా సాస్‌ – రెండు చెంచాల చొప్పున, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : ఒక గిన్నెలో బేబీ కార్న్‌లు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, మైదా, కార్న్‌ఫ్లోర్‌ వేసి, సరిపడా నీళ్ళు పోసి బాగా కలపాలి. తర్వాత బేబీ కార్న్‌లను నూనెలో పకోడీల మాదిరిగా వేసి దోరగా వేగించాలి. ఆ తర్వాత ఒక ఫ్రయింగ్‌ పాన్‌లో అర చెంచా నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి తరుగులను వేగించాలి. తర్వాత చిల్లీ సాస్‌, సోయా సాస్‌, టమాటా సాస్‌, కొద్దిగా ఉప్పు కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత బేబీ కార్న్‌, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలిపి దించేయాలి.
గోల్డ్‌ ఫింగర్స్‌
కావాల్సిన పదార్థాలు : బేబీ కార్న్‌లు – పది, – శెనగపిండి, బియ్యప్పిండి – పావు కప్పు చొప్పున, కారం – అర చెంచా, వంటసోడా – పావు చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : ఒక్కో బేబీ కార్న్‌ను నిలువుగా సగానికి కోసి రెండు ముక్కలు చేయాలి. తర్వాత ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వంట సోడా వేసి, సరిపడా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి అది వేడయ్యాక బేబీ కార్న్‌ ముక్కల్ని బజ్జీల పిండిలో ముంచి, పిండి బాగా పట్టాక, నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి.
లాలీపాప్స్‌
కావాల్సిన పదార్థాలు : పనీర్‌ – రెండు వందల గ్రాములు, క్యాప్సికం – ఒకటి, బేబీ కార్న్‌లు – పది, గరంమసాల, తేనె – అర టీ స్పూను చొప్పున, నిమ్మరసం – టీ స్పూను, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, చాట్‌ మసాల, కారం – పావు టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, టూత్‌పిక్‌లు – ఇరవై.
తయారు చేసే విధానం : బేబీ కార్న్‌లను అడ్డంగా సగానికి కోయాలి. తర్వాత పనీర్‌, క్యాప్సికంలను కూడా అంగుళం మేర ముక్కలుగా కోయాలి. ఆ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసి ఉప్పు, కారం, నిమ్మరసం, గరంమసాల, తేనె వేసి బాగా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత టూత్‌పిక్‌లకు క్యాప్సికం, పనీర్‌ ముక్కలను గుచ్చి, చివరిలో బేబీ కార్న్‌లను నిలువుగా గుచ్చాలి. ఆ తర్వాత వీటిని ఒక పెనం మీద ఉంచి కొద్దికొద్దిగా నూనె వేస్తూ దోరగా అన్ని వైపులా వేగించాలి. చివర్లో చాట్‌ మసాల చల్లి దించేయాలి.
స్పైసీ బేబీ కార్న్‌
కావాల్సిన పదార్థాలు : బేబీ కార్న్‌లు – పది, పెరుగు – పావు కప్పు, కార్న్‌ఫ్లోర్‌, నూనె – 5 చెంచాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – పావు చెంచా చొప్పున, కారం, చాట్‌ మసాల, గరం మసాలా – అర చెంచా చొప్పున, ఉప్పు – రుచికి సరిపడా, నిమ్మరసం – చెంచా.
తయారు చేసే విధానం : బేబీ కార్న్‌లను కుక్కర్‌లో వేసి ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించి తీయాలి. తర్వాత ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, పెరుగు, పసుపు, కారం ఉప్పు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరంమసాల, బేబీ కార్న్‌లు వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఒక పెనం మీద నూనె వేసి బేబీ కార్న్‌లను అన్ని వైపులా దోరగా వేయించాలి.

Spread the love