పొదుపు చేస్తున్నారా?

ఎంత ఎక్కువ సంపాదించినా సరే.. నెలాఖరుకు ఖర్చు పెట్టడానికి డబ్బు మిగలదు. అందుకే పొదుపు చేయాలని చాలా ఆలోచిస్తాం. కానీ ఆచరణలో సాధ్యం కాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతాం. తీరా డబ్బంతా ఖర్చయ్యాక ఇక నెలాఖరులో అది కొనకుండా ఉంటే బాగుండేది, ఈ ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేది అని మనల్ని మనం నిందించుకోవడం సాధారణం. ఓ సర్వే ప్రకారం మన దేశంలో పొదుపు చేసేవారి శాతం గత కొన్నేండ్లుగా తగ్గుతూ వస్తోందట. అందుకే డబ్బు మిగుల్చుకుని చేయడం అలవర్చుకోవాలి. మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేస్తే డబ్బు పొదుపు అవుతుందో ఈ రోజు తెలుసుకుందాం…
ఖర్చులు అన్ని అయిపోయిన తర్వాత ఇంకెంత పొదుపు చేద్దాం అని ఆలోచిస్తుంటారు. ఇది తప్పు. ముందు పొదుపు చేసేందుకు కొంత డబ్బు పక్కకు పెట్టి, తర్వాత మాత్రమే ఖర్చులు పెట్టుకోవాలి. సంపాదనలో కనీసం నలభై శాతం పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవచ్చు. ఖర్చు కోసం ఓ బడ్జెట్‌ రాసి పెట్టుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులు అదుపు చేసుకోవచ్చు. ఇందులోనే ఓ 20 శాతం అత్యవసర ఖర్చులకు కూడా పెట్టుకోవడం మంచిది.
యాప్స్‌ ద్వారా
లగ్జరీలకు పెట్టే మొత్తాన్ని తగ్గిస్తేనే పొదుపు చేయడానికి డబ్బు మిగులుతుందని తెలుసుకోవాలి. చాలా యాప్స్‌ మనకు డబ్బు పొదుపు చేయడం ఎలాగో చెప్పడంతో పాటు మన నెలవారీ ఖర్చులను, పొదుపు చేసిన మొత్తాన్ని చూపిస్తూ ఖర్చులు తగ్గించుకోవడం మనకు సులువయ్యేలా చేస్తుంటాయి. మరికొన్ని యాప్స్‌ హోటల్‌ ఫుడ్‌ పై ఆఫర్లు, డీల్స్‌ అందిస్తాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే కొద్దిగా డబ్బు మిగులుతుంది. బయట భోజనం వీలైనంత వరకు తగ్గించుకోవాలి.
పాత వస్తువులనే…
రీసైకిల్‌ చేసిన వస్తువులను ఉపయోగించడం వల్ల చాలా వరకూ ఖర్చులు తగ్గించుకోవచ్చు. చాలామంది ఇంటిని డెకరేట్‌ చేయడానికి రకరకాల వస్తువులు కొంటూ ఉంటారు. దీనికి బదులుగా మీరు ఉపయోగించిన సీసాలతో ఫ్లవర్‌ వేజ్‌లు, ఐస్‌ క్రీం పుల్లలతో అలంకరణ వస్తువులు, టిష్యూ పేపర్లు, ప్లాస్లిక్‌ కవర్లతో పువ్వులు వంటివి తయారు చేసుకోవచ్చు. ఆలోచించాలే కానీ టైం పాస్‌తో పాటు అందంగా, ఆకర్షణీయంగా ఉండే డెకరేటివ్‌ వస్తువులు ఎన్నో తయారు చేసుకోవచ్చు. డబ్బు కూడా ఆదా అవుతుంది.
నడక మంచిదే..
నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అయితే నడక అంటే ఉదయమో, సాయంత్రమో చేయాల్సిన అవసరం లేదు. వీలున్నప్పుడల్లా నడిచేయడం మంచిదే. ఒక్కోసారి తక్కువ దూరాలకు కూడా ఆటోలు, క్యాబ్‌లు తీసుకుంటూ ఉంటాం. స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ నడిచి వెళ్తే ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇలా ఆదా చేసిన డబ్బును వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన పక్కకు పెట్టి దాచి ఉంచుకోవాలి.
వ్యక్తిగత అలవాట్ల వల్ల..
ఏదైనా అలవాటు మానుకోవాలనుకుంటే, ఆ అలవాటు మానడం వల్ల మీకు వ్యక్తిగతంగా లేదా ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా ప్రయోజనం అందే ప్రయత్నం చేయండి. ఇందుకు మీరు మార్చాలనుకుంటున్న అలవాటును పాటించని ప్రతిసారి కొంత మొత్తాన్ని ఓ డబ్బాలో దాచి ఉంచండి. ఉదాహరణకు జంక్‌ఫుడ్‌ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఆ అలవాటు మానుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆ ఫుడ్‌ తిన్న ప్రతిసారీ దానికి అయ్యే ఖర్చు డబ్బును వేరేగా పొదుపు చేసి చూడండి.. మీరెంత డబ్బు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారో అర్థం అవుతుంది. ఆ అలవాటును మార్చుకునేందుకు మనసు మళ్ళించేందుకు అవకాశం ఉంటుంది. అప్పటికీ అలవాటు మార్చుకోలేకపోతే ఈ మొత్తాన్ని రెట్టింపు చేయండి. ఆ మేరకు మీ ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. తగ్గించిన ఖర్చులతో గడపడం కాస్త ఇబ్బందే కాబట్టి తొందరగానే ఆ అలవాటును మార్చుకుంటారు.
డిస్కౌంట్స్‌…
పొదుపు చేయమని చెబితే అస్సలు ఖర్చు పెట్టవద్దని కాదు.. కాస్త ఆలోచించి తెలివిగా ఖర్చు చేయాలని దాని అర్థం. ఉదాహరణకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లో ఓ డ్రెస్‌ నచ్చితే, దాన్ని వెంటనే కొనేయకుండా కార్ట్‌లో వేసుకొని అలా ఉంచుకోండి. కొన్నాళ్లకు ఏదైనా సేల్‌ ఉన్నప్పుడు అది మామూలు కంటే తక్కువ ధరకే లభిస్తుంది.
చెక్‌ చేసుకుంటూ…
ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు గాలి బయటకు పోవడం వల్ల అది మరింత పని చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎలక్ట్రిసిటీ బిల్‌ కూడా పెరుగుతుంది. అన్నీ తలుపులు, కిటికీలు మూయడం వల్ల గది తొందరగా చల్లారుతుంది. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అన్ని స్విచ్చులూ ఆపారా? లేదా? చెక్‌ చేసుకోండి. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Spread the love