కొత్త పాట

New Songఎన్నికలల విహారంలో ఎన్నో కొత్తగా కనిపిస్తుంటారు, మరెన్నో కొత్తగా వినిపిస్తుంటాయి. ఏం చేస్తాం వినకతప్పదు. కలల విహారంలో కళల సోయగాలు కనకతప్పదు. ఎన్ని చివుళ్లు గొంతుదిగినా వసంత కాలాన కోయిల గొంతుమారదు. ఎన్ని పండ్లు ముక్కు కొరికినా చిలుక పలుకూ మారదు. వేపపువ్వు చేదుమారదు. మామిడి పండు మధురమూ మారదు. సంధ్య ఎరుపు తరగదు. జాబిలి తెలుపు మలగదు. ఎందుకంటే ఇవి ప్రకృతి ధర్మ నియమాలు. కలుష రహిత గుణాలు. ఇక మారే గొంతు ఒక్క మనిషి సొంతమే. అదికూడా అవసరార్థమై నానా విధ విన్యాసాలకు పాల్పడే నాయకమన్యుల కొత్త గొంతులు వింతపాటలు వినిపిస్తుంటారు. కోరికలు నెరవేర్చుకునేందుకు కొత్త పాటలూ ఎత్తుకుంటారు. వసంతకాలం గనక కోయిలల తీయని గానాలతో పాటు, మనకు ఎన్నికల పుణ్యాన నాయకుల కొత్తపాటలూ చెవిన మోగుతున్నాయి. పాటలు హాయిగా అనిపించినా కొత్తపాటని, విని తరించినా ఏమీ ఫర్వాలేదు. కానీ పాటెందుకు మారిందో అందులోని మర్మమేమిటో తెలుసుకోలేకపోతే మోసపోతాం, మొసలి కన్నీటికి కరిగిపోతాం!
సార్వత్రిక ఎన్నికల వేల పదేండ్లుగా కడుపునిండా మింగించిన నాయకుడు, దాని రుచి ఇంకా జనానికి తెలియనట్టు తిరిగి చెబుతున్నాడు. మొన్న తమిళనాడుకు ప్రచారానికి వచ్చిన మోడీ తోడిరాగంలో కొత్త పాటను వినిపించాడు. పాపం ఛానెల్‌వాళ్లు రికార్డు చేసి మరీ రిలే చేశారు. నాకు తమిళ భాషంటే ఎంతో ఇష్టం, నేను తమిళం నేర్చుకుంటా, ఐక్యరాజ్య సమితిలో తమిళంలో మాట్లాడతానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు ఇంతవరకు తమిళ భాషకు అన్యాయం జరిగిందని, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తమిళభాష భారతదేశంలో ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పలేక పోయాం. గర్వపడలేక పోయాం. రాజకీయాల వల్లే ఈ భాషను విస్తరించలేక పోయామని తెగ ఆవేదన చెందారు మన మోడీ గారు. ఇవి మొసలి కన్నీరులా ఉందని అంటే కాదని ఎవరైనా అనగలరా! ఈయనగారి పాలనలోనే, ఇంకా ఆ సంఘటనల జ్ఞాపకాలు పచ్చిపచ్చిగానే ఉన్నాయి. తమిళ ఉద్యోగులను హిందీలో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చి భారతీయులు కాదా మీరని అవమానిం చిన వాళ్లు తమిళ భాష గొప్పతనాన్ని పొగడడమా! దేశం మొత్తంలో ఒకే మతం, ఒకే పన్ను, ఒకే భాష అనే నినాదాన్ని ఇస్తూ, హిందీ భాషని దక్షిణ భారతంపై బలవంతాన రుద్దే ప్రయత్నం చేసింది ఎవరు? దక్షిణాది ప్రాంతీయ భాషల ప్రాధాన్యతను గుర్తించ నిరాకరించింది ఎవరు? మోడీగారి ప్రభుత్వం కాదా! తమిళభాషా ఔన్నత్యాన్ని, దాని వారసత్వాన్ని పోరాడి నిలుపుకుంటున్నది అక్కడి తమిళ ప్రజలే. అక్కడే కాదు, కన్నడ, మళయాల, తెలుగు ప్రజలు కూడా హిందీ భాషాధిపత్య రాజకీయాలను తిప్పికొట్టారు. రాజకీయంగా ఉద్యమించారు కనుకనే భాషా సంస్కృతిని వారసత్వంగా నిలుపుకున్నారు. తమిళభాషా ఘన వారత్వాన్ని ప్రపంచమంతటా చెప్పుకోవాలనీ ప్రధాని సెలవిచ్చారు. భారతీయ భిన్న సాంస్కృతిక విలువలకు తిలోదకాలిస్తూ భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ హిందూత్వ రాష్ట్రంగా ప్రకటించాలని ఉవ్విళ్లూరుతున్న వీరు వారసత్వం గురించి వల్లిస్తున్నారు. ఎంత విచిత్రం! ఇంకా ఏమన్నారు తెలుసా! ‘ఇంకా నయం ఇడ్లీ, దోసెలను రాజకీయం చేయలేదు, చేసుంటే అవి తమిళనాడుకే పరిమితమయ్యేవి’ అన్నారు. భిన్నమైన, ప్రాంతీయ ఆహారపు అలవాట్లను గౌరవించే గుణ సంపన్నత ఉన్న మనిషా ఈయన? భీఫ్‌ తింటున్నారని కొట్టి చంపే మూకకు నాయకుడిగా ఉండి, మాంసాహారులనే మంద బుద్దులని ప్రచారం చేసే సన్నాసులకు వత్తాసు పలికే గొంతు ఆహారపు వారసత్వాన్నీ మాట్లాడటమా! ఎంత నిస్సిగ్గుతనం! ఏ ఎండకా గొడుగు పట్టే లక్షణమంటే ఇదే మరి!
అసలు మన అధినాయకుని కొత్త పాటకు కారణమేమో తెలుసు కోవటం చాలా అవసరం. ఉత్తర భారతంలో ఎట్లాగూ ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయనేది స్పష్టమయిన విషయం. ఇక ఉన్నదొక్కటే ఆశ. గతం నుండి కాలు మోపనీయని దక్షిణాది, ముఖ్యంగా తమిళనాడులో కొన్నయినా సీట్లు పొందాలన్న ఆశ తప్ప మరేమీ కాదు. అందుకు తమిళ సెంటిమెంటును పండించే బృహత్‌ నాటకానికి నాందీ వచనం పలుకుతున్నారు మోడీగారు. భావోద్వేగాలను రెచ్చగొట్టటం వీరికి కొత్తేమీ కాదు కదా! అందుకే తమిళ భాష, ఇడ్లీ, దోశ గుర్తుకొచ్చాయి వీరికి, సాధారణంగా పరిపాలకులు పదేండ్లుగా ప్రజలకు ఏమిచేశానో ఎంత అభివృద్ధి చేశానో, చెప్పి ఓట్లడుగుతారు. అవేమీ లేవు గనక, సెంటిమెంటు నెత్తుకున్నది ఎన్నికల కోకిల. అంతేకాదు, కచ్చతీవు ద్వీపాన్నీ పదేండ్లుగా మాట్లాడని, పరిష్కరించని అంశాన్ని రాజకీయం చేసే పనికి పూనుకుంటున్నారు. దాని ద్వారా ఓట్లు దండుకోవాలనే ఆశ తప్ప ప్రజల మేలు కోరుకోవడమేమీ లేదు. తమిళనాడు ప్రభుత్వం, తమ ప్రజల కోసం చేసిన చట్టాలను, తమ గవర్నరు ద్వారా ఆమోదం పొందకుండా నిలుపుదల చేసిన తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కోర్టులు, వీరు తమ ప్రతినిధులుగా నియమించిన గవర్నర్లను తప్పుబడుతూనే ఉన్నారు. కేరళలోనూ అంతే చేస్తున్నారు. అయినా దక్షిణాది ప్రజల కోసం తెగ ఆవేదన చెందే నటనా, ఎత్తుకున్న పాటా ఎంత ఎబ్బెట్టుగా ఉందో జనం గమనిస్తూనే ఉన్నారు.

Spread the love