కొత్తేడాది…

కొత్తేడాది...గోడకు కొత్తరంగేసినట్లు కొత్త క్యాలెండర్‌ తెచ్చి మొలకేసుడే మాకు తెల్సిన కొత్తేడాది…
సంవత్సరాలు మారినా సంపాదన ఎక్కిరిస్తూనే ఉంది..
తారీకు మారినా మా తలరాతలు తలుపు సందుల్లోంచి తొంగి చూస్తూనే ఉన్నాయి…..
ఉన్నోడికి పన్నెండు నెలలూ పండగైతే…
లేనోడికి లెక్కకు రానన్ని పస్తులున్న రోజులు…..
ఒక్క రాత్రి నిషా కోసం
సీసాలు ఖాళీ చేసుడే మీ కొత్త సంవత్సరమైతే…..
ఏండ్ల సంది ఒడ్వని దు:ఖం మా దుప్పట్లో దూరి
మమ్మల్ని ‘జో’ కొడుతూనే ఉంది….
ఉన్నోడు నాలుగ్గంటల కోసం పెట్టే ఖర్చు ..
పేదోడు రెండు నెలల బతుకును ఇగ్గుకస్తడు…
అయినా మన సదువు సంపాదననిచ్చిందని సంస్కారాన్ని ఇవ్వలేదు కదా…
ఆకలి కడుపులు రోడ్డెక్కి అడుక్కుటాంటే….
కొత్త సంవత్సరం ఈలలు వేస్తూ వారిని ఆహ్వానిస్తుంది…
అంకెలు, సంకెలు మారుడు కాదు కొత్త సంవత్సరమంటే…
నిచ్చెనెక్కిన అవినీతిని నేలకు దింపాలి…
రాజకీయపు మాటలతో అటకెక్కిన అబద్దాల మూటలకు నిప్పు పెట్టి…
నిజాలను పేదోడి ఆకిట్ల రంగులతో నింపాలి…..
తొమ్మిది నెలల మోసి తల్లి బిడ్డకి జన్మనిచ్చినట్లు…
కాలం పన్నెండు నెలలు మోసి కొత్తేడాదికి తొవ్వ సూప్తే…
ఆ తొవ్వల మన ఆశల ఇత్తనాలు సల్లుకొని కట్టాన్ని కళ్ళద్దుకొని…
ఫలితాన్ని ఈ ‘యాడాది’ కి వదిలేద్దాం…..
– తుమ్మల కల్పనరెడ్డి, 9640462142

Spread the love