నిశ్శబ్ద రహస్యం

నిశ్శబ్ద రహస్యంశబ్దమెప్పుడూ
భయానికి పుట్టినిల్లే
అది విధ్వంసానికి, విజయానికి
కాలం భరించ లేని నిర్వచనం కావచ్చు
భూమీ ఆకాశం మధ్యలో గాలిమోటారుపై
గర్వంగా రోషాన్ని మెలేయడం కొంచెం సేపే
ఒడలు మరచి కడలి అలల పై
ఊయల లూగేదీ కొంచెం సేపే.
కానీ నిశ్శబ్దం
మండుతున్న గాయానికి
కన్నీటి మందు పూస్తూ
నిన్ను మర్లి మర్లి చూస్తుంది
కొమ్మనుంచి అచానక్‌ గా
పండు నేల రాలినట్లు
నిన్ను మంచం పై నుంచి
కిందపదగొడుతుంది
అది నీ నిరంకుశంత్వాన్ని
కొంచెం కొంచెం కొరుక్కు తింటుంది
నీకు దినమూ రాత్రీ దక్కకుండా చేస్తుంది
పదిమందిలో నిన్ను
ముక్కు భూమికి రాయిస్తుంది
వాగులో ముంచి గుడి చుట్టూ
ప్రమాణం చేయిస్తుంది.
అది నువ్వున్నచోటే
ఉరికంబం నీ మీద వంగి
చెవిలో చావుగీతం పాడుతుంది
వేటాడిన మగాన్ని సింహం పీక్కు తిన్నట్లు
నీ గొంతును ఇనుప పాదమై నలిచేస్తుంది
జనం చెమటా నెత్తురుతో మెరుసున్న
నీ రాజసం నీమీదే
పెళ పెళ మని విరిగి పడేట్లు చేస్తుంది .
న్యాయస్థానం ముందు నేరస్తుడు
తలవంచి నిల్ల్చున్నట్లు చేస్తుంది
చివరికి కారడవిలో కనబడనిగుహలో
నువ్వు తల దాచుకునేట్లు చేస్తుంది.
మొదటి దెబ్బకే మత్యువును తప్పించుకున్న పాము నిశ్శబ్దం
వేటకుముందుపదునుపెట్టినగొడ్డలినిశ్శబ్దం
కారిన దు:ఖ ధారలన్నీ
రాలిన కలలన్నీ, తెగిన ఆశలన్నీ
ఒక చోట చేరి శబ్దం చేసే
సుదీర్ఘ రిహాల్సలే
అసలు నిశ్శబ్దమంటే.
– డా|| ఉదారి నారాయణ, 9441413666

Spread the love