ముందున్న‌ది ముస‌ళ్ల పండ‌గే..

Next is Musalla festival..– మోడీ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండి
– నడ్డా వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఆగ్రహం
– పార్టీలో రగులుతున్న అసమ్మతి చిచ్చు
– మిత్రులను మెప్పించకుంటే ముప్పే
న్యూఢిల్లీ : దేశభక్తి ముసుగులో దశాబ్దం పాటు బీజేపీ సాగించిన ఆధిపత్యానికి ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని చేరుకోలేకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బల నుండి కోలుకోవడానికి ఆ పార్టీకి చాలా కాలమే పట్టేలా ఉంది. గత పది సంవత్సరాలుగా కమలదళంలో అంతా కేంద్రీకృత రాజకీయాలే నడిచాయి. మోడీ ఆడింది ఆట…పాడింది పాటలా సాగిపోయింది. సంస్థాగతంగా పార్టీ బలపడలేదు. పాత మూస పద్ధతిలోనే వ్యవహారాలు నడిచాయి.
బీజేపీ సంస్థాగతంగా ప్రధాని మోడీ, ఆయన ఇద్దరు ప్రధాన సన్నిహితులు అమిత్‌ షా, జేపీ నడ్డాల నియంత్రణలో ఉండిపోయింది. ఈ ఇద్దరిలో కూడా అమిత్‌ షా తరచుగా ప్రధానితో సంప్రదింపులు జరిపేవారు. వారిద్దరూ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకే నడ్డా పరిమితమయ్యే వారు. బీజేపీ అధ్యక్షుడుగా నడ్డా పదవీకాలం జనవరితోనే ముగిసింది. లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆయన ఆ పదవిలోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు నూతన అధ్యక్షుడిని బీజేపీ ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఆయన ఇటు… ఈయన అటు
2019లో అమిత్‌ షాకు కేంద్ర మంత్రి పదవిని, నడ్డాకు పార్టీ అధ్యక్ష పదవిని మోడీ కట్టబెట్టారు. అంతకుముందు నడ్డా కేంద్ర క్యాబినెట్‌లో ఉండేవారు. అమిత్‌ షా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే వారు. 2019లో మోడీ రెండోసారి ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత వీరిద్దరి పదవులు మారాయి. అప్పటి మాదిరిగా ఇప్పుడు బీజేపీకి చట్టసభలో మెజారిటీ లేదు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. గత దశాబ్ద కాలంలో కొనసాగిన కేంద్రీకృత రాజకీయాలను ఇప్పుడు మిత్రులు సహిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.
ప్రక్షాళన అనివార్యం
మోడీ ప్రభుత్వంలో అమిత్‌ షాకు లభించిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. క్యాబినెట్‌లో ఆయనది రెండో స్థానం. ఇప్పుడు ఆ స్థానాన్ని మిత్రపక్షాలు అంగీకరించకపోవచ్చు. విధానపరమైన ప్రతి నిర్ణయం ప్రధాని కార్యాలయంలోనే జరగడానికి ఆ పార్టీలు ఒప్పుకోకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మోడీ ముందున్న తక్షణ కర్తవ్యం ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడం. ముందుగా మిత్రుల డిమాండ్లను తీరుస్తూ, ఆ తర్వాత తన అధికారాన్ని పెంచుకోవడానికి ఆయన ప్రయత్నించాల్సి ఉంటుంది. నడ్డా స్థానంలో పార్టీ అధ్యక్షుడిని నియమించుకోవడంతో పాటు సంస్థాగతంగా బీజేపీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నూతన అధ్యక్షుడే తన బృందాన్ని ఎంపిక చేసుకోవాలి.
అదంత ఈజీ కాదు
బీజేపీలోని త్రిమూర్తుల (మోడీ, షా, నడ్డా) మధ్య సంబంధాలు, వీరిలో కూడా నడ్డాకు పెద్దగా అధికారాలు లేకపోవడం వంటి అంశాలను పరిశీలిస్తే ఆయన తనకు తానుగా అలాంటి ప్రకటన చేసి ఉంటారని భావించలేము. ఈ ప్రకటన పార్టీ అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చిందేనని పరిశీలకులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి ప్రకటనలు మోడీని మున్ముందు మరిన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పలువురు ప్రచారక్‌లను (పూర్తి స్థాయి కార్యకర్తలు) పార్టీ కోసం పనిచేసేందుకు పంపారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యవహారాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయాన్ని తక్కువగా అంచనా వేయలేము. ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం నుండి బీజేపీ బయటపడడం అంత సులభంగా కన్పించదు.
ఆర్‌ఎస్‌ఎస్‌ సహకారం లేకుంటే…
అమిత్‌ షా బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పార్టీలో ఎవరైనా చేరేందుకు వీలుగా ‘మిస్డ్‌ కాల్‌’ విధానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ సభ్యత్వం పొందాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా చేశారు. ప్రపంచంలో బీజేపీయే అతి పెద్ద పార్టీ అని, చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కంటే బీజేపీ సభ్యులే అధిక సంఖ్యలో ఉన్నారని నాయకత్వం భావించింది. కానీ ఓ సిద్ధాంతానికి, కార్యక్రమానికి పార్టీ నాయకత్వం కట్టుబడలేదు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసే కార్యకర్తలు ఆ పార్టీకి లేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకుల వ్యవస్థ తోడ్పాటు లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం బీజేపీకి సాధ్యమయ్యే పనికాదు. నడ్డా ప్రకటన నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు పొందడం ఇకపై బీజేపీకి అంత సులభం కాదు. నడ్డా ప్రకటనతో ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు…దాని అనుబంధ కార్మిక, రైతు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. బాహాటంగా నిరసన వ్యక్తం చేయకపోయినప్పటికీ లోలోన రగిలిపోతున్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పవు
2001లో మోడీ తొలిసారిగా రాజ్యాంగ పదవిని చేపట్టారు. అప్పటి నుండి నిన్నటి వరకూ ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా, ప్రధాని పదవిని నిర్వహించినా పూర్తి మెజారిటీతోనే ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలన సాగించారు. ఇప్పుడు తొలిసారిగా మెజారిటీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని తన పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కూడా మిత్రులు, పార్టీ నేతలను ఎప్పటికప్పుడు సంప్రదించాల్సి ఉంటుంది. సొంత పార్టీ నేతలతోనూ, సంఫ్‌ు పరివార్‌తోనూ జాగ్రత్తగా మసలు కోవాల్సి ఉంటుంది. నూతన భారతావనిని ఆవిష్కరించడం మాట అటుంచి, ముందుగా నూతన బీజేపీకి రూపకల్పన చేసే విషయంపై దృష్టి సారిస్తే మంచిది. లేకుంటే ముందున్నది ముసళ్ల పండగే అవుతుంది.
బీజేపీ సెల్ఫ్‌ గోల్‌
అయితే బీజేపీ ఎదుర్కోబోయే అతి పెద్ద సవాలు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నడ్డా ఓ సమావేశంలో మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలలో…అవి ఎన్నికలు కావచ్చు లేదా ప్రచారం కావచ్చు… ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం లేదని స్పష్టం చేశారు. నడ్డా వ్యాఖ్యలతో బీజేపీ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంది. ఆయన వ్యాఖ్య కారణంగానే బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ 272ని చేరుకోలేకపోయిందన్న వాదన కూడా విన్పిస్తోంది.
పెల్లుబుకుతున్న అసమ్మతి
బీజేపీ నాయకత్వానికి పార్టీలోని పలువురు సీనియర్‌ నేతలు మద్దతు ఇస్తూ ఉండవచ్చు. కానీ అనేక రాష్ట్రాల్లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏ క్షణంలో అయినా అగ్నిపర్వతం మాదిరిగా పేలి పోవచ్చు. ముఖ్యంగా సంవత్సరాల తరబడి బీజేపీ కోసం కష్ట పడుతూ విధేయులుగా ఉన్న వారికి కాకుండా ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న వలస వాదులకు టిక్కెట్లు ఇవ్వడంతో ఆగ్రహం పెల్లుబుకు తోంది. ఒకవేళ మోడీ మున్ముందు కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఈ ఆగ్రహజ్వాలలు మరింతగా ప్రజ్వరిల్లే ప్రమాదం ఉంది. ఇదిలావుండగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లో మోడీకి ఉన్న సంబంధాలు అంత సజావుగా లేవు. యోగి ప్రధాన్యత ఎక్కడ పెరుగుతుందోనన్న ఆందోళన మోడీలో కన్పిస్తోంది. అందుకే యోగిని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు ప్రయత్నించారు. నితిన్‌ గడ్కరీ వంటి పలువురు సీనియర్‌ నేతల విషయంలోనూ మోడీ ప్రవర్తన ఇలాగే ఉంది. తాజా ఎన్నికల్లో మోడీ ప్రాభవం మసకబారడంతో అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. వీటిని పరిష్కరించ లేకపోతే మోడీ నాయకత్వానికే ఎసరు రావచ్చు.

Spread the love